టెక్నాలజీ ప్రపంచంలో మరో సంచలనానికి ఎలాన్ మస్క్ తెరతీశారు. ఆయనకు చెందిన బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ సంస్థ న్యూరాలింక్ రెండు సరికొత్త ఉత్పత్తులను పరిచయం చేసింది. పూర్తిగా అంధులైన వారికి చూపును కల్పించే లక్ష్యంతో 'బ్లైండ్‌సైట్' (Blindsight), కేవలం ఆలోచనలతోనే కంప్యూటర్లు, ఇతర మనుషులతో కమ్యూనికేట్ చేసేలా 'టెలిపతి' (Telepathy) అనే టెక్నాలజీలను అభివృద్ధి చేసింది. వీటిలో బ్లైండ్‌సైట్ ఇంనీరింగ్ పరంగా సిద్ధంగా ఉందని, నియంత్రణ సంస్థల అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని అక్టోబర్ 30న మస్క్ వెల్లడించారు.
ఆలోచనలతోనే కమ్యూనికేషన్.. టెలిపతి!
న్యూరాలింక్ తొలి ఉత్పత్తి టెలిపతి అని మస్క్ ఎక్స్ (X) వేదికగా ప్రకటించారు. టెలిపతీ అనేది కేవలం ఆలోచనల ద్వారానే కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర పరికరాలను నియంత్రించడానికి, వాటితో వేగంగా కమ్యూనికేట్ చేయడానికి రూపొందించిన పరికరం. రానున్న కొన్నేళ్లలో ఈ టెక్నాలజీ ద్వారా సమాచారాన్ని పంపే వేగం.. మనుషులు మాట్లాడటం లేదా టైప్ చేయడం వచ్చే వేగాన్ని మించిపోతుందని ఆయన పేర్కొన్నారు. మెదడులో అమర్చే చిన్న ఇంప్లాంట్ ఆధారంగా ఈ టెక్నాలజీ పని చేస్తుంది. ఇందులోని సూక్ష్మ ఎలక్ట్రోడ్లు మెదడులో ఉత్పత్తయ్యే నాడీ సంకేతాలను గుర్తిస్తాయి. వాటిని డిజిటల్ ఆదేశాలుగా మారుస్తాయి. దీంతో చేతులు కదపకుండానే, కీబోర్డ్ ఉపయోగించకుండానే ఆలోచనల ద్వారా కంప్యూటర్‌లో కర్సర్‌ను కదపడం, క్లిక్ చేయడం, టైప్ చేయడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా పక్షవాతం లేదా శారీరక వైకల్యాల కారణంగా కదలలేని, మాట్లాడలేని వారికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పటికే పక్షవాతం ఉన్న కొందరిపై దీనిని పరీక్షించగా, వారు ఆలోచనల ద్వారా కంప్యూటర్ కర్సర్‌ను నియంత్రించడం, గేమ్‌లు ఆడటం వంటివి చేయగలిగినట్లు న్యూరాలింక్ వెల్లడించింది.
అంధులకు చూపునిచ్చే బ్లైండ్‌సైట్!
న్యూరాలింక్ రెండో ఉత్పత్తి బ్లైండ్‌సైట్. పూర్తిగా అంధులైనవారితో పాటు పుట్టుకతోనే చూపులేని వారికి కూడా దృష్టిని అందించడమే దీని లక్ష్యం. కళ్లలోని రెటీనా కాంతిని నాడీ సంకేతాలుగా మార్చి ఆప్టిక్ నర్వ్ ద్వారా మెదడుకు పంపుతుంది. మెదడు వాటిని దృశ్యాలుగా అర్థం చేసుకుంటుంది. అయితే కళ్లు లేదా ఆప్టిక్ నర్వ్ దెబ్బతిన్నప్పుడు ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు బ్లైండ్‌సైట్ ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తుంది. కెమెరా ద్వారా పరిసరాల్లోని దృశ్యాలను సేకరించి, వాటిని వైర్‌లెస్ విధానంలో మెదడులో అమర్చిన ఇంప్లాంట్‌కు పంపిస్తుంది. ఈ పరికరం చూపునకు సంబంధించిన మెదడు భాగాన్ని విద్యుత్ సంకేతాలతో ఉత్తేజపరిచి దృశ్య సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తుంది. తద్వారా కళ్లు లేదా ఆప్టిక్ నర్వ్ పనిచేయకపోయినా మెదడుకు నేరుగా దృశ్య సమాచారాన్ని చేరవేయాలన్నది ఈ టెక్నాలజీ ఉద్దేశం.
ఎఫ్‌డీఏ నుంచి ప్రత్యేక గుర్తింపు.. కానీ ఇంకా అనుమతి రావాల్సిందే!
బ్లైండ్‌సైట్ పరికరానికి 2024 సెప్టెంబర్‌లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) 'బ్రేక్‌త్రూ డివైస్ డిజిగ్నేషన్' ఇచ్చింది. వినూత్న వైద్య పరికరాల అభివృద్ధి, సమీక్ష ప్రక్రియను వేగవంతం చేయడమే దీని ఉద్దేశం. అయితే ఈ గుర్తింపు అంటే పరికరానికి పూర్తి అనుమతి లభించినట్లు కాదు. మనుషుల్లో చూపును పునరుద్ధరించగలదని బ్లైండ్‌సైట్ ఇంకా నిరూపించాల్సి ఉంది. టెలిపతి, బ్లైండ్‌సైట్ టెక్నాలజీలు విజయవంతమైతే శారీరక వైకల్యాలు, చూపులేమితో బాధపడుతున్నవారి జీవితాల్లో కీలక మార్పులు తీసుకురావచ్చు.