స్టాక్‌హోమ్ (స్వీడన్): భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని బెల్జియంకు చెందిన కణ భౌతిక శాస్త్రవేత్త (పార్టికల్ ఫిజిసిస్ట్) ఫ్రాన్సిస్ హాల్జెన్ గెల్చుకున్నారు. ఈవిషయాన్ని నోబెల్ కమిటీ ఫర్ ఫిజిక్స్ సారథి మార్క్ పియెర్స్ మంగళవారం ప్రకటించారు. ‘‘హాల్జెన్ పట్టుదల, శాస్త్ర సాంకేతిక విజన్ ఈ విశ్వాన్ని సరికొత్త కోణంలో అధ్యయనం చేయడానికి ఒక అద్భుతమైన పరికరాన్ని అందించింది” అని ఆయన కొనియాడారు. అంతరిక్షం నుంచి వచ్చే అత్యంత శక్తిమంతమైన న్యూట్రినోలను కనుగొనడంలో, అంటార్కిటికాలోని ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఏర్పాటులో చేసిన కృషికిగానూ ఫ్రాన్సిస్ హాల్జెన్ను నోబెల్‌కు ఎంపిక చేశామని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. ఈ అవార్డుతో పాటు రూ.11.56 కోట్ల (1.2 మిలియన్ డాలర్లు) నగదు పారితోషికాన్ని ఫ్రాన్సిస్ అందుకోనున్నారు.
బెల్జియంలో జననం, అమెరికాలో పరిశోధనలు
ఫ్రాన్సిస్ హాల్జెన్ బెల్జియంలోని 'టినెన్' నగరంలో జన్మించారు. ఆయన ఉన్నత విద్యను బెల్జియంలోనే అభ్యసించారు. అయితే 1972లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్లో ప్రొఫెసర్‌గా ఫ్రాన్సిస్ చేరారు. అక్కడే తన పరిశోధనలను కొనసాగించారు.
ఏమిటీ న్యూట్రినోలు ?
న్యూట్రినోలను సైన్స్ పరిభాషలో ఘోస్ట్ పార్టికల్స్ (దెయ్యం కణాలు) అని పిలుస్తారు. ఇవి విశ్వమంతటా కోట్లాదిగా తిరుగుతుంటాయి, కానీ వీటికి ఎలాంటి చార్జ్ (ఆవేశం) ఉండదు. వీటి ద్రవ్యరాశి (మాస్) కూడా దాదాపు శూన్యం. ఇవి భూమితో సహా దేన్నైనా చొచ్చుకుంటూ వెళ్లగలవు, కానీ వేటితోనూ అంత సులభంగా ప్రతిచర్య జరపవు. అందువల్ల వీటిని గుర్తించడం అత్యంత కఠినమైన పని.
న్యూట్రినోలపై ఫ్రాన్సిస్ పరిశోధన
సుదూర విశ్వంలోని నక్షత్రాల పేలుళ్లు, బ్లాక్ హోల్స్ వంటి శక్తిమంతమైన ప్రక్రియల నుంచి వచ్చే న్యూట్రినోలను గుర్తించడానికి దక్షిణ ధ్రువం వద్దనున్న మంచును సహజ డిటెక్టర్‌గా వాడుకోవచ్చని ఫ్రాన్సిస్ హాల్జెన్ ప్రతిపాదించారు. ఆయన సారథ్యంలో అంటార్కిటికా మంచు కింద ఒక క్యూబిక్ కిలోమీటరు వైశాల్యంలో వేలాది లైట్ సెన్సర్లను అమర్చి ఐస్‌క్యూబ్ అబ్జర్వేటరీని నిర్మించారు. అంతరిక్షం నుంచి వచ్చే న్యూట్రినోలు అంటార్కిటికాలోని మంచు పరమాణువులతో ఢీకొన్నప్పుడు ఒక చిన్న కాంతి మెరుపు వస్తుంది. ఆ కాంతిని ఈ సెన్సర్లు గుర్తించి రికార్డ్ చేస్తాయి. ఫ్రాన్సిస్ చేసిన ఈ ఆవిష్కరణ ఖగోళ శాస్త్రంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని తెరిచింది.