Online Frauds 
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

విద్యావంతులకే ‘సైబర్’ వల.. అధ్యయనంలో నిజాలు!

Suryanarayana
  • పెరిగిపోతున్న ఆన్‌లైన్ మోసాలు

  • సరికొత్త పద్ధతులతో రెచ్చిపోతున్న నేరగాళ్లు

దేశంలో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో రెచ్చిపోతున్నారు. ఏదో రకంగా ఓటీపీలను తీసుకుని బ్యాంకు ఖతాల నుంచి సొమ్ము కాజేస్తున్నారు. ఈ మోసాలకు విద్యావంతులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.

 భయం, అత్యవసరమే ఆయుధాలు

మనుషుల బలహీనతలను సైబర్ మోసగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. నకిలీ ఆఫర్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆశచూపడం, అత్యవసరంగా డబ్బులు పంపాలనే బెదిరింపులతో ఒత్తిడికి గురిచేస్తున్నారు.

 అధ్యయనంలో వెల్లడైన నిజాలు

సైబర్ మోసాలు చాలా వరకు అవగాహన లోపం వల్లే జరుగుతాయని భావిస్తారు. కానీ అది అన్ని సందర్భాల్లో నిజం కాదు. మోసగాళ్లు బాధితుల్లో తీవ్రమైన భయం, ఆందోళన, తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడిని సృష్టిస్తారు. ‘‘ఆ మానసిక ఒత్తిడి కారణంగా విద్యావంతులు, టెక్నాలజీ తెలిసిన వారు కూడా విచక్షణ కోల్పోయి మోసగాళ్లు చెప్పినట్లే చేసి సర్వం కోల్పోతున్నారు’’ అని మద్రాస్ ఐఐటీకి చెందిన పరిశోధకులు తేల్చారు.

రికార్డు స్థాయికి మోసాలు

కేంద్ర హోంశాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం, 2021 నుంచి 2025 మధ్య నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నమోదైన ఆర్థిక మోసాల ఫిర్యాదుల సంఖ్య 65.89 లక్షలు దాటింది. వాటి విలువ సుమారు రూ.55,050 కోట్లు. కేవలం 2021లో నమోదైన రూ. 551 కోట్ల నష్టం, 2025 నాటికి రూ. 22,495 కోట్లకు పెరిగింది. నిత్యం డిజిటల్ అరెస్టులు, కేవైసీ అప్‌డేట్‌లు, నకిలీ కొరియర్ కాల్స్ పేరుతో రోజూ కోట్ల రూపాయలు స్వాహా అవుతున్నాయి.

మోసం బారినపడితే ఏం చేయాలి?

డెలివరీ లేదా కొరియర్ మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ‘‘ఆర్డర్ చేయని వస్తువు వచ్చినప్పుడు తీసుకోవడానికి నేరుగా నిరాకరించండి. ఆ డెలివరీని రద్దుచేయడానికి ఫోన్‌కు వచ్చే క్యాన్సిలేషన్ ఓటీపీని ఎవరితోనూ పంచుకోవద్దు. ఒకవేళ పొరపాటున కోడ్ ఇచ్చి మోసపోయినట్లు గుర్తిస్తే, తక్షణమే యూపీఐ పిన్, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌‌లు మార్చుకోవాలి. నేషనల్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. నకిలీ మెసేజ్ స్క్రీన్‌షాట్లు, కాల్ రికార్డులు భద్రపర్చుకోవాలి’’ అని ఇటీవల పరిశోధనలు చేసిన మద్రాస్ ఐఐటీ నిపుణులు చెప్పారు.  

ఫోన్‌కు వచ్చే గుర్తుతెలియని లింక్‌లను ఓపెన్ చేయడం, ఓటీపీలను షేర్ చేయడంలోనూ అప్రమత్తత అవసరం. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్, డెలివరీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధిక లాభాలు, ఉచిత బహుమతుల కోసం ఆశపడితే మోసపోక తప్పదనేది సైబర్ సెల్ నిపుణుల హెచ్చరిక.