ఐఐటీ మద్రాస్‌ ఈప్లేన్ కంపెనీ అభివృద్ధి చేస్తున్న ఈ200ఎక్స్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ట్యాక్సీ 
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

మన కోసమే ఈ ఫ్లయింగ్​ ట్యాక్సీ

హైదరాబాద్, ముంబై నగరాల ట్రాఫిక్ జామ్‌లకు చెక్ పెట్టేందుకు ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు 'E200X' ఎగిరే టాక్సీని తయారు చేస్తున్నారు.

Haji Pasha

చెన్నై: నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి మహా నగరాల ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుపోయే చాలామందికి ఒకే ఆలోచన వస్తుంది. ‘వాహనం కాస్త పైకి ఎగిరిపోతే ఎంత బాగుండు’ అని వారంతా అనుకుంటారు! ఐఐటీ మద్రాస్ డిస్కవరీ క్యాంపస్​లోని శాస్త్రవేత్తల బృందమొకటి ఈ ఆలోచనను నిజం చేయడానికి ముమ్మర పరిశోధనలు చేస్తోంది. ప్రస్తుతం వీరు ‘ఈ200ఎక్స్’ పేరుతో ఎగిరే ట్యాక్సీని తయారు చేస్తున్నారు. ఐఐటీ మద్రాస్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సత్య చక్రవర్తి 2019లో స్థాపించిన ‘ది ఈప్లేన్ కంపెనీ’ దీన్ని అభివృద్ధి చేస్తోంది.

తొలుత ఫ్లయింగ్ అంబులెన్స్​గా..

‘ఈ200ఎక్స్’ అనేది ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్​ అండ్ ల్యాండింగ్ విమానం. అంటే, ఇది హెలికాప్టర్​లా నేరుగా పైకి లేవగలదు, విమానంలా ముందుకూ ప్రయాణించగలదు. ఇంధనంతో కాకుండా పూర్తిగా బ్యాటరీలు, ఎలక్ట్రిక్ మోటార్లతో ఎగరగలదు. ఏకంగా 10 రెక్కలు (రోటర్లు) కలిగిన ఈ విమానాన్ని తొలుత ఫ్లయింగ్ అంబులెన్స్​గా, తదుపరిగా రద్దీ నగరాల్లో ఎయిర్ ట్యాక్సీగా తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులోని 10 రెక్కల్లో ఆరు వాహనాన్ని పైకి లేపడానికి, నాలుగు రెక్కలు దాన్ని ముందుకు నెట్టడానికి ఉపయోగపడతాయి. ప్రతీ రెక్కకు ప్రత్యేక మోటార్ ఉంటుంది.

2028 డిసెంబరు నాటికి మార్కెట్​లోకి

ఈ200ఎక్స్​లో దాదాపు ఏడు అంచెల రక్షణ వ్యవస్థ ఉందని సత్య చక్రవర్తి చెప్పారు. ఈ విమానంలోని ఒక వ్యవస్థ విఫలమైతే, దాని తర్వాతి అంచెలోని మరో వ్యవస్థ రక్షణ కవచంగా నిలుస్తుందన్నారు. ప్రయాణికులను తీసుకెళ్లడానికి అవసరమైన ‘ప్యాసింజర్ సర్టిఫికేషన్’ దీనికి ఇంకా రాలేదని ఆయన పేర్కొన్నారు. ‘‘2028 సంవత్సరం జూన్​కల్లా ఈ ఎయిర్ అంబులెన్స్ సిద్ధమవుతుంది. 2028 డిసెంబరు నాటికి దీన్ని మార్కెట్​లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని సత్య వెల్లడించారు.