యూట్యూబ్‌కు పోటీగా 90 నిమిషాల లాంగ్‌ఫామ్‌ వీడియోలను పరీక్షిస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌. 
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

యూట్యూబ్​తో ఇన్​స్టా ‘లాంగ్​’ ఫైట్!

లాంగ్-ఫామ్ వీడియో విభాగంలో యూట్యూబ్‌ను ఢీకొనేందుకు ఇన్‌స్టాగ్రామ్ సిద్ధమైంది. సరికొత్తగా 90 నిమిషాల ల్యాండ్‌స్కేప్ వీడియోల టెస్టింగ్ వివరాలు ఇక్కడ చూడండి.

Haji Pasha

వాషింగ్టన్​: ఎక్కువ నిడివి కలిగిన ​వీడియో కంటెంట్ విభాగం​లో రారాజుగా వెలుగొందుతున్న యూట్యూబ్​ను ఢీకొనేందుకు ఇన్​స్టాగ్రామ్ సిద్ధమైంది. ఇన్​స్టా రీల్స్ మన మొబైల్​ స్క్రీన్​పై వర్టికల్​గా​(నిలువులో) డిస్​ప్లే అవుతాయి. ఇప్పుడు తొలిసారిగా 90 నిమిషాల (గంటన్నర) నిడివి గల ల్యాండ్​స్కేప్ (అడ్డం)​ వీడియోలను ఇన్​స్టాగ్రామ్ పరీక్షిస్తోంది. ఈ టెస్టింగ్​ సోమవారం (అక్టోబర్​ 26) నుంచే అమెరికాలో ప్రారంభమైంది. ఇన్​స్టాలో రీల్ గరిష్ఠ నిడివి 20 నిమిషాలే. యూట్యూబ్​లోనైతే గరిష్ఠంగా 12 గంటల (256 జీబీ ఫైల్ సైజ్) నిడివి కలిగిన పెద్ద వీడియోను అప్​లోడ్​ చేయొచ్చు. ఇకపై 90 నిమిషాల వీడియోలతో యూట్యూబ్​కు పోటీ ఇవ్వాలనే సంకల్పంతో ఇన్​స్టా ఉన్నట్లు తెలుస్తోంది.

‘ఫీచర్స్’​తో రంగంలోకి

ఇన్​స్టాగ్రామ్​ తమ లాంగ్​ఫామ్​ వీడియోల కేటగిరీకి ‘ఫీచర్స్​’ అని పేరు పెట్టింది. సినిమా రంగంలో పూర్తి నిడివి గల సినిమాలను ‘ఫీచర్ ఫిల్మ్స్’ అంటారు. వాటి నుంచి ప్రేరణ పొంది 90 నిమిషాల వీడియోల కేటగిరీకి ‘ఫీచర్స్’ అనే పేరు పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్ ప్రోడక్ట్​ వైస్ ప్రెసిడెంట్ టెస్సా లియోన్స్, ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి ఈవివరాలను అధికారికంగా ధృవీకరించారు. ‘‘ఫీచర్స్​ కేటగిరీపై బ్రెజిల్‌లో కొంతమంది క్రియేటర్లతో జరిపిన మొదటి దశ ట్రయల్స్​లో మంచి ఫలితాలు వచ్చాయి. అందుకే ఇప్పుడు అమెరికాలో రెండో దశ ట్రయల్స్​ మొదలుపెట్టాం” అని వారు వెల్లడించారు.

ఆ క్రియేటర్లే టార్గెట్​

లాంగ్​ఫామ్​ వీడియో కంటెంట్​ను క్రియేట్​ చేసే పాడ్​కాస్టర్లు, కమేడియన్లను లక్ష్యంగా చేసుకొని ‘ఫీచర్స్​’ విభాగాన్ని ఇన్​స్టా అందుబాటులోకి తెచ్చింది. ఈ పెద్ద వీడియోలకు 3 నిమిషాల్లోపు నిడివి కలిగిన షార్ట్​ రీల్​ క్లిప్​లను లింక్​ చేసుకునే వెసులుబాటును క్రియేటర్లకు కల్పించింది. అయితే వీటిలో క్యాప్షన్లు, చాప్టర్లు వంటి ఆప్షన్లు లేవు. కేవలం ప్లేబ్యాక్ స్పీడ్​ను మార్చుకునే సౌకర్యం ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని ఫీచర్లను జోడించే అవకాశం ఉంది.

ఉచితంగా అప్​లోడ్​ చేయాలా ?: క్రియేటర్లు

లాంగ్ వీడియోలకు ప్రస్తుతానికి ఎలాంటి డబ్బులను ఇన్​స్టా ఇవ్వడం లేదు. క్రియేటర్లు థర్డ్ పార్టీ బ్రాండ్ పార్ట్‌నర్‌షిప్‌లపైనే ఆధారపడాలని స్పష్టంచేసింది. ‘‘ఎక్కువ నిడివి గల వీడియోలను అప్​లోడ్​ చేసే క్రియేటర్ల కోసం పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలతో కూడిన ఆదాయ మార్గాలను కల్పించే యోచనలో ఉన్నాం” అని ఇన్​స్టాగ్రామ్​ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు. ప్రస్తుతానికి ‘ఫీచర్స్​’ కేటగిరీలోని క్రియేటర్లకు బ్రాండ్ పార్ట్‌నర్‌షిప్‌లు పెంచుకోవడానికి సహాయపడుతామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, యూట్యూబ్ యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో 45 శాతం నుంచి 55 శాతం వాటాను తన క్రియేటర్లకు పంచుతోంది. ఆదాయమిచ్చే యూట్యూబ్​ ఉండగా, ఉచితంగా ఇన్​స్టాలో పెద్ద వీడియోలను అప్​లోడ్​ చేయాల్సిన అవసరం ఏముందని పలువురు కంటెంట్​ క్రియేటర్లు ప్రశ్నిస్తున్నారు.

యూట్యూబ్ షార్ట్స్​ VS ఇన్‌స్టా రీల్స్

తక్కువ నిడివి కలిగిన షార్ట్ ఫామ్ వీడియోల విభాగంలో ఇప్పటికే యూట్యూబ్​కు ఇన్‌స్టాగ్రామ్ గట్టి పోటీ ఇస్తోంది. ఈ కేటగిరీలో యూట్యూబ్ షార్ట్స్​, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇప్పుడు లాంగ్​ఫామ్​ వీడియోల విభాగంలోనూ పోటీకి ఇన్​స్టా తెర తీయడం సోషల్​ మీడియా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మైక్రోడ్రామాలను క్యాష్ చేసుకునేందుకు ‘సిరీస్​’

ఇన్‌స్టాగ్రామ్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న మరో కొత్త ఫీచర్​ పేరు ‘సిరీస్​’. కంటెంట్​ క్రియేటర్లు తాము రూపొందించే సీరియల్స్​, వెబ్ సిరీస్‌లు, విద్యా సంబంధిత వీడియోలను ఎపిసోడ్​ల వారీగా క్రమ పద్ధతిలో అమర్చుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిమిషం లేదా రెండు నిమిషాల నిడివితో సాగే మైక్రోడ్రామా వీడియోలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. దీనిని క్యాష్ చేసుకోవడానికే ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను తెస్తోంది. స్మార్ట్ టీవీలలో ఉండే ‘ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ’ యాప్‌లోనూ ‘సిరీస్’ ఎపిసోడ్‌లను ప్రేక్షకులు ఒకదాని తర్వాత ఒకటిగా చూసేలా డిజైన్ చేస్తున్నారు.