మనుషుల్ని వెంటాడే దోమ వెనక కోట్లాది ఏళ్ల ‘హైటెక్’ ఇంజనీరింగ్ ఉందని మీకు తెలుసా..? లేదు కదూ.. అయితే ఇది తప్పక చదవాల్సిందే.. బియ్యపు గింజంత ప్రాణిలో అమరిన అధునాతన రాడార్ వ్యవస్థ.. ప్రకృతి సృష్టించిన ‘బయోలాజికల్ సిరంజీ ఇవే కాదు..దోమ శరీరంలో గుర్తించబడిన, ఇంకా తెలియని మరెన్సో రహస్యాలున్నాయి. సాయంత్రం కాగానే చెవి దగ్గర 'గుయ్యియ్..' మంటూ చేసే రణగొణ ధ్వని మాత్రమే తెలుసు.. ఆ వెంటనే సూదితో గుచ్చినట్లు కాటు.. విసుగొచ్చి ‘టపీమని ఒకే దెబ్బతో దాన్ని నలిపేస్తాం. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే.. బియ్యపు గింజంత పరిమాణంలో ఉండే ఆ చిన్న దోమ, కటిక చీకట్లో కూడా మనల్ని అంత ఖచ్చితంగా ఎలా గుర్తించగలుగుతోంది? దుప్పట్లు కప్పుకున్నా ఖాళీగా ఉన్న చర్మాన్ని ఎలా గుర్తిస్తుంది?
బయోలాజికల్ సిరంజ్‌ను మోసే దోమ
ప్రకృతిలో అత్యంత సూక్ష్మమైన ‘బయోలాజికల్ సిరింజ్’ను మోస్తున్న దోమ వెనుక.. లక్షలాది సంవత్సరాల పరిణామ క్రమంలో ఏర్పడిన అత్యాధునిక సెన్సార్ల నెట్వర్క్ దాగుంది. వాటి వల్లే మనం వాటి నుంచి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోతున్నాం. వెలుతురులోనే కాదు..చీకట్లోనూ దోమకు దొరికేస్తాం.. ఎందుకంటే? దోమలకు మనుషులను వేటాడేందుకు కంటి చూపు మాత్రమే ఆధారం కాదు. వాటి శరీరంలో ప్రకృతి ప్రసాదించిన ప్రత్యేక ‘మల్టీ-సెన్సర్ గైడెన్స్ సిస్టమ్’ ఉంటుంది. రాజమౌళి ఈగ సినిమా తీసారు కానీ ఈ విషయం తెలిస్తే ఆయన తప్పకుండా దోమ మీదే సినిమా తీసిఉండేవాడంటారు హ్యూమరిస్టులు.
దొమ శరీరంలోని టెక్నాలజీలేంటంటే..
మనం శ్వాస విడిచినప్పుడు వెలువడే కార్బన్ డయాక్సైడ్ (సీఓ2)ను దోమలు దాదాపు 30 నుంచి 50 మీటర్ల దూరం నుంచే పసిగట్టగలవు. అదే మన దురదృష్టం. దోమలోని శరీర ఉష్ణోగ్రత డిటెక్టర్ అద్భుతమైన సెన్సర్‌లా పనిచేస్తుంది. అవి మన దగ్గరకు చేరే కొద్దీ, మన శరీరం విడుదల చేసే వేడి (ఇన్ఫ్రారెడ్ హీట్) ఆధారంగా రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఎక్కడున్నాయో కనిపెడతాయి. మనిషి చెమట వాసనను కూడా అవి అమోఘంగా పసిగడతాయి. మానవ శరీర చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్, అమ్మోనియా వంటి రసాయనాల వాసనలను దోమల శరీరంలో ఉండే యాంటెన్నాలు అత్యంత సులువుగా గుర్తిస్తాయి.
టార్గెట్ ఫిక్సయితే చాలు పని జరిగిపోతుంది
దోమ నుంచి తప్పించుకోడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే వాటిలో ఎక్కడో ఒక్కడ లూప్‌హోల్ వెతుక్కుంటుంది దోమ. నిండా చద్దరు కప్పుకున్నా గాలి కోసం ఎక్కడో ఓపెన్ చేసి ఉంచుతాం.. పోనీ దోమ తెరలు వేసుకున్నా వాటిలో రంద్రం గురించి తెలుసుకుంటుంది. శరీరం ఎక్కడ ఓపెన్‌గా ఉందో చీకట్లోనూ అద్భుతంగా తెలుసుకుని అక్కడికి చేరిపోతుంది. ఆపై శరీరపు కండరాలలో రక్తనాళం ఏ ప్రాంతంలో దగ్గరగా ఉంటుందో పసిగట్టి అక్కడ వాలిపోతుంది. ఆ వెంటనే బ్లడ్ సక్కింగ్ ఆపరేషన్ మొదలుపెడుతుంది.
దోమకు కాటు అంటే సూది దింపడమేనా..?
మనం దోమ కాటు వేసినప్పుడు కండరంలోకి సూది దిగుతుందని అనుకుంటాం. కానీ అది ఒక సూది కాదు.. ఆరు బ్లేడ్ల సెట్ అంటే నమ్మగలరా..? లేరు కదూ అంత చిన్న సైజులో మనం పరిశీలించాలంటే కచ్చితంగా మైక్రోస్కోప్ కావాలి. దాని కింద ఉంచి చూస్తే.. దోమ ముక్కు (ప్రొబోసిస్) భాగంలో అత్యాధునిక సర్జికల్ టూల్స్ లాంటి ఆరు సూక్ష్మ సూదులు (స్టైలెట్స్) ఉంటాయి. ఆ సూదుల పనితనం అద్భుతంగా ఉంటుంది. మొదటి రెండు సూదులు (మాండిబుల్స్) చర్మాన్ని గట్టిగా పట్టి ఉంచడానికి ఉపయోగపడతాయి. తర్వాతి రెండు సూదులు (మ్యాక్సిల్లే) చిన్న రంపపు పళ్ల మాదిరిగా ఉండి, చర్మాన్ని కోయడానికి సహకరిస్తాయి. ఐదో సూది (హైపోఫారింక్స్) ఇది చర్మంలోకి రక్తం గడ్డకట్టకుండా తన లాలాజలాన్ని (యాంటీకోయాగ్యులెంట్) పంపుతుంది. చివరి ఆరో సూది (లాబ్రమ్) రక్తనాళాన్ని కనిపెట్టి, రక్తపు చుక్కను పైకి పీల్చుకోవడానికి స్ట్రా లాగా పనిచేస్తుంది.
మనకు నొప్పి ఎందుకు తెలియడం లేదు?
దోమ మన చర్మంలోకి సూదులు దింపే సమయంలో మొదట తన లాలాజలాన్ని పంపుతుంది. ఈ లాలాజలంలో సహజసిద్ధమైన ‘అనస్థీషియా’ (స్పర్శ కోల్పోయే రసాయనం) ఉంటుంది. దీనివల్ల అది రక్తాన్ని పీల్చుకునే పని కానిచ్చేదాకా మనకు నొప్పి తెలియదు. రక్తం పీల్చుకుని అది ఎగిరిపోతుంది. ఆ తరువాత అది వదిలిన లాలాజలానికి మన రోగనిరోధక వ్యవస్థ స్పందించడం మొదలుపెడుతుంది. అప్పటి దాకా అసలది కుట్టినట్టే తెలియదు. కానీ శరీరం వెంటనే రియాక్ట్ అవుతుండటం వల్ల ఆ ప్రాంతం ఎర్రబడి దురద పెడుతుంది. గోకితే పుండు కూడా పడుతుంద.
పేరు మోసిన సైంటిస్టులకే ఆశ్చర్యం!
అతి తక్కువ శక్తిని వాడుకుంటూ, గాల్లో అత్యంత నిశ్శబ్దంగా ప్రయాణించే దాని శరీర ఆకృతి.. ఆధునిక డ్రోన్ల తయారీకి శాస్త్రవేత్తలకు ప్రేరణగా నిలుస్తోంది దోమ. అలాగే వైద్యరంగంలో రోగికి నొప్పి తెలియకుండా ఇంజెక్షన్లు ఇచ్చే సూదుల తయారీ కోసం నేటికీ పరిశోధకులు దోమ ముక్కు తీరుపై విస్తృతంగా అధ్యయనాలు చేస్తున్నారు. తెలుసుకున్నారుగా మనం టాప్మని కొట్టేస్తే చనిపోయే ఒక చిన్న దోమ వెనుక.. ప్రకృతి అమర్చిన ఇంతటి అద్భుతమైన నానో-టెక్నాలజీ దాగి ఉండటం ప్రకృతి సృష్టించిన అద్భుతమే కదూ..