సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

దానిమ్మతో గుండెకు కొండంత అండ

కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధనల్లో సంచలన నిజాలు వెల్లడి

Srinivas Rao

నిత్య జీవితంలో మనం తినే దానిమ్మ, అక్రూట్లు (వాల్‌నట్స్), కొన్ని రకాల బెర్రీ పండ్లు కేవలం పోషకాలను మాత్రమే కాదు.. ప్రాణాంతక గుండె జబ్బులను సైతం సమర్థంగా అడ్డుకునే అద్భుత ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా గుండె రక్తాన్ని పంప్ చేయగలిగినా..కొన్నిసార్లు ఆ పనిలో విఫలమవడం కారణంగా తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ బాధితులకు ప్రస్తుతం వైద్యరంగంలో పెద్దగా చికిత్సా మార్గాలు లేవు. అయితే వారికో శుభవార్త.. దానిమ్మ పండ్లను తినగా శరీరంలో సహజంగా ఉత్పత్తయ్యే ‘యురోలిథిన్ ఎ’ అనే సమ్మేళనం గుండె పనితీరును ఏకంగా 80 శాతం వరకు మెరుగు పరుస్తున్నట్లు కింగ్స్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ అధ్యయనం ‘సైన్స్ అడ్వాన్సెస్’ జర్నల్‌లో ప్రచురితమై వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

లొంగని గుండెజబ్బుపై సమర్థ పోరాటం

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న గుండె వైఫల్యం కేసుల్లో దాదాపు సగం కేసులు ‘ప్రిజర్వ్‌డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్’ రకానికి చెందినవే ఉంటున్నాయి. ఈ సమస్య ఉన్నవారిలో గుండె రక్తాన్ని పంపింగ్ చేస్తుంది కానీ, కండరాలు బిగుసుకుపోయి సరైన మోతాదులో రక్తాన్ని నింపుకోలేవు. ఫలితంగా కొద్దిపాటి నడకకే ఆయాసం, విపరీతమైన అలసట, దైనందిన జీవితంలో చురుకుదనం కోల్పోవడం జరుగుతుంది. వయసు పైబడటం, అధిక రక్తపోటు, స్థూలకాయం, మధుమేహం వంటి బహుళ కారణాలు దీనికి దోహదపడుతుండటంతో ప్రామాణిక గుండె మందులు ఈ సమస్యపై అంతగా పనిచేయవు. కేవలం జీవనశైలి మార్పులు, బరువు తగ్గడం ద్వారానే వైద్యులు ఇప్పటివరకు రోగులను పర్యవేక్షిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో దానిమ్మ పండులో లభించే ‘యురోలిథిన్ ఎ’ వారి పరిశోధనలను కీలక మలుపు తిప్పింది.

కణజాలంపై ‘యురోలిథిన్ ఎ’ మ్యాజిక్

దీర్ఘాయువు, శరీరంలో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా పనితీరును మెరుగుపరచడంలో యురోలిథిన్ ఎ ప్రభావంపై శాస్త్రవేత్తలు లోతుగా దృష్టి సారించారు. రక్తనాళాల పనితీరును, గుండె కండరాల రిలాక్సేషన్‌ను నియంత్రించే ‘పీకేజీ1 ఆల్ఫా’ అనే కీలక ప్రొటీన్‌ను ఈ సమ్మేళనం క్రియాశీలం చేస్తుందని పరిశోధకులు తొలిసారిగా కనిపెట్టారు. ప్రయోగశాలలో జంతువులపై చేసిన పరిశోధనల్లో ఈ సమ్మేళనాన్ని అందించినప్పుడు గుండె పనితీరు ఏకంగా 80 శాతం మెరుగుపడింది. గుండె కండరాలు సజావుగా విశ్రాంతి తీసుకోవడమే కాకుండా, కండరాలు ప్రమాదకరంగా పెరిగిపోవడాన్ని (ఎన్‌లార్జ్‌మెంట్), అంతర్గత మచ్చలు (ఫైబ్రోసిస్) ఏర్పడటాన్ని ఇది సమర్థంగా అడ్డుకున్నట్లు స్పష్టమైంది.

మానవ స్టెమ్ సెల్స్‌తో సరికొత్త ప్రయోగాలు

జంతు నమూనాలతో పాటు మానవ మూలకణాలతో (స్టెమ్ సెల్స్) కృత్రిమంగా రూపొందించిన అత్యున్నత స్థాయి మానవ గుండె కణజాలంపై కూడా లండన్ పరిశోధక బృందం ప్రయోగాలు నిర్వహించింది. ఇందులోనూ యురోలిథిన్ ఎ అద్భుతమైన ఫలితాలను కనబరిచి, గుండె కణజాలం సహజంగా విశ్రాంతి పొందేలా చేసింది. సాధారణ ప్రయోగశాల ఔషధాల మాదిరిగా కాకుండా, యురోలిథిన్ ఎ అప్పటికే మానవులలో నిర్వహించిన భద్రతా పరీక్షల్లో అత్యంత సురక్షితమైనదిగా రుజువు కావడం విశేషం. ఇది త్వరలోనే సురక్షితమైన ఔషధంగా మారే అవకాశాలకు బలం చేకూరుస్తోంది.

క్లినికల్ ట్రయల్స్ ముగిస్తేనే రోగులకు భరోసా

ఈ ఆవిష్కరణ వైద్యరంగంలో ఒక సరికొత్త మైలురాయిగా పరిశోధకులు చెబుతున్నారు. హార్ట్ పేషెంట్లకు సరికొత్త ఔషధాల తయారీకి ఇది మార్గం సుగమం చేస్తుందని ఆధ్యయనకర్త డాక్టర్ జోసెఫ్ బర్గోయిన్ పేర్కొన్నారు. అయితే రోగులకు నేరుగా చికిత్స అందించే ముందు పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉందని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ జేమ్స్ లీపర్ స్పష్టం చేశారు. కేవలం దానిమ్మ పండ్లు తిన్నంత మాత్రాన గుండె జబ్బులు సమసిపోవని, సమతుల్య ఆహారం, పండ్లు, కూరగాయలు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ఏది ఏమైనా, ఎలాంటి ప్రభావవంతమైన చికిత్స లేని ఈ దీర్ఘకాలిక సమస్యకు ప్రకృతి సిద్ధమైన ఆహార సమ్మేళనమే దివ్యౌషధంగా మారనుండటం రోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.