సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

ఎగిరే కారు వచ్చేస్తోంది.. ఎలాన్‌ మస్క్‌ టెస్లా సంచలనం!

అమెరికా టెక్సాస్‌లోని స్పేస్‌ఎక్స్‌ ఫెసిలిటీలో అక్టోబర్ 15న నిర్వహించిన కార్యక్రమంలో టెస్లా కంపెనీ నెక్స్ట్-జెన్ రోడ్‌స్టర్‌ మోడల్‌ లో భాగంగా రూపొందించిన 'ఫ్లయింగ్‌ టెస్లా'ను ఆవిష్కరించింది.

Phaneendra

కార్లు రోడ్లపై దూసుకెళ్లడం చూశాం.. విమానాలు ఆకాశంలో ఎగరడం చూశాం. మరి  రోడ్డుపై వెళ్తున్న కారు ఒక్కసారిగా గాల్లోకి లేచి ఆకాశంలోకి దూసుకెళ్తే? ఊహించుకోవడానికే ఆసక్తిగా ఉంది కదూ! ఎవరూ ఊహించని ప్రయోగాలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌..ఈ సారి ఫ్లయింగ్ కారుతో అందరి దృష్టిని ఆకర్షించారు.

ర్యాంప్‌పై తలకిందులుగా.. గాల్లో విన్యాసాలు!

అమెరికా టెక్సాస్‌లోని స్పేస్‌ఎక్స్‌ ఫెసిలిటీలో అక్టోబర్ 15న నిర్వహించిన కార్యక్రమంలో ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ నెక్స్ట్-జెన్ రోడ్‌స్టర్‌ మోడల్‌ లో భాగంగా రూపొందించిన 'ఫ్లయింగ్‌ టెస్లా' (ఎగిరే కారు)ను  ఆవిష్కరించింది (టెస్లా నెక్స్ట్‌ జనరేషన్‌ రోడ్‌స్టర్‌ ప్రోటోటైప్‌). ఈ కార్యక్రమంలో రోడ్‌స్టర్‌ మొదట  అత్యంత వేగంగా  ఒక భారీ, నిటారుగా ఉన్న వంపు ఆకారపు (Curved) ర్యాంప్‌పైకి దూసుకెళ్లి తలకిందులుగా ప్రయాణించింది. ఆ తర్వాత గాల్లోకి లేచి, మధ్యలో తిరుగుతూ నేలపైకి సురక్షితంగా దిగింది. ఈ  వీడియోను ఎలాన్‌ మస్క్‌ తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. "భవిష్యత్తులో ఎగిరే కార్లు ఉంటాయని స్పష్టమైంది" అని మస్క్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.

కార్లలో రాకెట్ టెక్నాలజీ

ఫ్లయింగ్‌ టెస్లా కారులో అంతరిక్ష నౌకలు, రాకెట్లలో ఉపయోగించే 'స్పేస్‌ఎక్స్‌' పరిజ్ఞానాన్ని జోడించారు. ముఖ్యంగా స్పేస్‌ఎక్స్‌ అభివృద్ధి చేసిన కోల్డ్ గ్యాస్ థ్రస్టర్లు ఇందులో కీలకంగా పనిచేస్తాయి. కారును గాల్లోకి లేపడానికి, గాల్లో దిశ మార్చుకోవడానికి, సురక్షితంగా కిందకు దించడానికి ఈ థ్రస్టర్లను కారు చుట్టూ వేర్వేరు కోణాల్లో అమరుస్తారు. కారు కింద భాగంలో ఉన్న థ్రస్టర్ల నుంచి గాలి అత్యంత బలమైన పీడనంతో కిందికి నెట్టబడుతుంది. దీనివల్ల ఏర్పడే వ్యతిరేక బలం కారును నేల నుంచి పైకి లేపుతుంది. కారును కుడి, ఎడమ లేదా గుండ్రంగా తిప్పడానికి కారు పక్కల, వెనుక ఉన్న థ్రస్టర్లను ఉపయోగిస్తారు. కారు కిందకు దిగేటప్పుడు వేగాన్ని తగ్గించి (Braking Effect), షాక్ లేకుండా సురక్షితంగా ల్యాండ్ అవ్వడానికి కూడా ఈ థ్రస్టర్లు సహాయపడతాయి. మాన్యువల్‌గా ఈ థ్రస్టర్లను నియంత్రించడం కష్టం కాబట్టి, అంతర్నిర్మిత AI / స్పేస్‌ఎక్స్ సాఫ్ట్‌వేర్ వీటిని కంట్రోల్ చేస్తుంది. ఏ థ్రస్టర్ నుంచి ఎంత గాలి, ఏ క్షణంలో విడుదల కావాలో కంప్యూటర్ మిల్లీసెకన్ల వ్యవధిలో నిర్ణయిస్తుంది. టెస్లా ఇంజనీరింగ్‌ విభాగం అధిపతి లార్స్‌ మొరావీ తెలిపిన వివరాల ప్రకారం.. కారులో 10 థ్రస్టర్లు, సుమారు 600 లీటర్ల సామర్థ్యం కలిగిన గాలిని అధిక పీడనంతో నిల్వ చేసే ట్యాంకులు ఉన్నాయి. వీటి నుంచి గాలి వేగంగా బయటకు రావడంతో కారు పైకి లేచేందుకు, గాల్లో దిశ మార్చుకునేందుకు అవసరమైన బలం ఏర్పడుతుంది.

గంటకు 370 కి.మీ. వేగం..2028లో మార్కెట్లోకి!

టెస్లా ప్రకటించిన  వివరాల ప్రకారం..టెస్లా ఫ్లయింగ్ కారు గంటకు 230 మైళ్లకు పైగా.. అంటే సుమారు 370 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. సున్నా నుంచి గంటకు 60 మైళ్ల వేగాన్ని సెకనులోపే చేరుకోగలదు. టెస్లా రెండో తరం రోడ్‌స్టర్‌ను 2017లోనే  ప్రకటించింది. అప్పట్లోనే ఈ కారు తన వేగం, డిజైన్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది. అయితే, ఉత్పత్తి ప్రారంభానికి సంబంధించిన గడువులు పలుమార్లు వాయిదా పడ్డాయి. తాజాగా 2028లో ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

టెస్లా ప్రదర్శనలో కారు గాల్లోకి లేచి విన్యాసాలు చేసినప్పటికీ.. దీన్ని విమానంలా నిరంతరం గాల్లో ప్రయాణించే కారుగా భావించకూడదు. సాధారణ రోడ్లపై వినియోగం, గాల్లోకి ఎగిరేందుకు అవసరమైన భద్రతా ప్రమాణాలు, నియంత్రణ సంస్థల అనుమతులు వంటి అంశాలు కీలకంగా ఉంటాయి. అయినప్పటికీ కార్ల సాంకేతికతకు రాకెట్‌ పరిజ్ఞానాన్ని జోడించి టెస్లా చేసిన ఈ ప్రయోగం భవిష్యత్తు రవాణాపై కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.