మానవుడు అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు సాధించినా.. అక్కడి పరిస్థితులు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అంతరిక్ష రహస్యాలను ఛేదించేందుకు చేసే సుదూర ప్రయాణాల వెనుక ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మరి, అంతరిక్ష యాత్రలో ఓ వ్యోమగామి మరణిస్తే ఆయన భౌతిక కాయంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మృతదేహాన్ని భూమికి ఎలా తీసుకొస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో అంతరిక్ష సంస్థలు ఏం చేస్తాయి? అనే ప్రశ్నలు ఆసక్తిని కలిగిస్తుంటాయి.
శూన్యంలో ద్రవాల ఆవిరి రూపం మార్పు
అంతరిక్ష నౌకలో ప్రమాదవశాత్తూ వ్యోమగామి మరణిస్తే, మృతదేహాన్ని శూన్యంలోకి వదిలేస్తే ఏం జరుగుతుందనే దానిపై టెక్సాస్‌లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన స్పేస్ హెల్త్ రిసెర్చ్ చీఫ్ ఇంజనీర్ జిమ్మీ వూ స్పష్టతనిచ్చారు. అంతరిక్షంలోని అల్పపీడన శూన్య వాతావరణంలో చర్మం, కళ్ళు, నోరు, చెవులు, ఊపిరితిత్తులపై ఉండే ద్రవాలన్నీ క్షణాల వ్యవధిలోనే వాయువులుగా మారి ఇగిరిపోతాయని, శరీరపు ఉపరితలానికి దగ్గరగా ఉన్న రక్తనాళాలు పగిలి రక్తం కారిపోయే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
కుళ్ళిపోయే ప్రక్రియ పూర్తిగా అసాధ్యం
నిజానికి భూమిపై ఏ ప్రాణి చనిపోయినా కొంత సమయానికి అది కుళ్లిపోవడం మొదలవుతుంది. భూమిపై శరీరం కుళ్లిపోవడానికి సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, ఆక్సిజన్ ప్రధాన కారణమవుతాయి. కానీ అంతరిక్షంలో ఆక్సిజన్ గానీ, గాలి గానీ లేకపోవడం వల్ల బ్యాక్టీరియా పనిచేయదు. దీనివల్ల శరీరం భూమిపై మాదిరిగా కుళ్లిపోయే అవకాశమే లేదు. అంతరిక్షపు అత్యంత కఠినమైన పరిస్థితులలో శరీరం కాలక్రమేణా ఎండిపోయి పూర్తిగా భిన్నమైన భౌతిక మార్పులకు లోనవుతుంది.
డీహైడ్రేషన్‌తో రాయిలా మారే శరీరం
గురుత్వాకర్షణ శక్తి శూన్యంగా ఉండే ఆ ప్రదేశంలో శరీరంలోని నీరంతా క్రమంగా ఆవిరి అయిపోతుంది. తగిన వాతావరణం లేకపోవడం వల్ల మృతదేహం పూర్తిగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. సరైన ఉష్ణోగ్రతలు లేని ప్రదేశంలో రేడియేషన్ ప్రభావం వల్ల చర్మం కాలిపోవడం లేదా ఎముకలు బలహీనపడటం జరుగుతుంది. అంతిమంగా శరీరం ఎండిపోయి రాయిలాగా మారిపోతుంది. ఈజిప్టులో భద్రపరచబడిన మమ్మీల మాదిరిగా మిగిలిపోతుంది.
భూమికి చేర్చడమే ప్రధాన సవాల్
చరిత్రలో ఇప్పటివరకు అంతరిక్షంలో వ్యోమగాములు వ్యక్తిగత అనారోగ్యంతో మరణించిన దాఖలాలు లేవు. ఒకవేళ భవిష్యత్తులో మిషన్ సమయంలో అలాంటి పరిస్థితి ఎదురైతే తోటి సిబ్బందికి పెద్ద సవాలుగానే ఉంటుంది. మృతదేహం కుళ్ళిపోవడం వల్ల వచ్చే ముప్పును నివారించడానికి దాన్ని భద్రపరచడం లేదా వీలైనంత త్వరగా క్యాప్సూల్ ద్వారా భూమికి చేర్చడంపై అంతరిక్ష సంస్థలు ప్రత్యేక ప్రోటోకాల్స్ సిద్ధం చేశాయి. మనుషులు సుదూర అంగారక గ్రహం లేదా ఇతర గ్రహాలకు వెళ్లే ప్రయాణాలు పెరిగేకొద్దీ ఈ సవాళ్లు మరింత జటిలం కానున్నాయి. ఒకవేళ అంతరిక్షంలోనే ఖననం చేయాల్సి వస్తే శూన్యత వల్ల జరిగే మార్పులను అంచనా వేస్తున్నారు. స్పేస్ సూట్‌లోనే డీహైడ్రేట్ చేసి భద్రపరిచే ఆధునిక పద్ధతులపై నాసా శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.