సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

అందుబాటులోకి వాట్సాప్‌ సరికొత్త ఫీచర్లు

-చిన్నారుల భద్రతకు పేరెంటింగ్ కంట్రోల్స్ -ఎడిటింగ్ కోసం ఏఐ టూల్స్ -వ్యాపార సంస్థలకు చార్జీలు

Suryanarayana

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరిన్ని అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. యువత భద్రత, ఏఐ టూల్స్, గ్రూప్ కమ్యూనికేషన్లను మరింత సులభతరం చేస్తూ అక్టోబరు 1వ తేదీ నుంచి తాజా అప్‌డేట్స్‌ను విడుదల చేసింది. ఐఫోన్ యూజర్లకు కూడా ఆండ్రాయిడ్ తరహాలో డ్యూయల్ అకౌంట్ సదుపాయాన్ని కల్పించడం ఇందులో మరో ఆకర్షణ.  

 తల్లిదండ్రుల నియంత్రణ

 పిల్లల భద్రతపై ఆందోళన చెందే తల్లిదండ్రులకు వాట్సాప్ ఊరటనిచ్చింది. సరికొత్త పేరెంటల్ కంట్రోల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. పిల్లల ప్రొఫైల్ ఫొటోలను ఎవరు చూడాలి, వారిని కొత్త గ్రూపుల్లో ఎవరు యాడ్ చేయవచ్చు అనే విషయాలను ఇకపై తల్లిదండ్రులే నియంత్రించవచ్చు. పిల్లలు ఏదైనా కొత్త గ్రూపులో చేరినా, వదిలినా తల్లిదండ్రులకు నోటిఫికేషన్లు వస్తాయి.

 గ్రూపుల్లో 'మెగా' అలర్ట్

వాట్సాప్ గ్రూపుల్లోని సభ్యులందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి వీలుగా '@all' ట్యాగ్‌ను ప్రవేశపెట్టింది. ఒకవేళ ఎవరైనా గ్రూపును మ్యూట్ చేసినా సరే, ఈ ట్యాగ్ ఉపయోగిస్తే అందరికీ తప్పనిసరిగా నోటిఫికేషన్ వెళ్తుంది. 32 మందికి మించి సభ్యులున్న గ్రూపుల్లో ఈ సదుపాయాన్ని కేవలం అడ్మిన్లు మాత్రమే ఉపయోగించేలా పరిమితి విధించారు.

 మెటా ఏఐతో రైటింగ్, ఎడిటింగ్

వాట్సాప్‌లో ఏఐ వినియోగం మరింత పెరుగుతోంది. యూజర్ల మెసేజ్‌లను మరింత మెరుగ్గా, స్పష్టంగా మార్చేందుకు 'ఏఐ రైటింగ్ హెల్ప్'ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే థర్డ్-పార్టీ ఎడిటింగ్ యాప్స్‌తో పనిలేకుండానే వాట్సాప్‌లోనే ఫొటో బ్యాక్‌గ్రౌండ్ మార్చడం, ఇమేజ్‌ల స్టయిల్ మార్చడం, అవసరంలేని భాగాలను తొలగించడం లాంటివి 'ఏఐ ఎడిటింగ్' ద్వారా సులభంగా చేసుకోవచ్చు.

 డెస్క్‌టాప్ యాప్ లేకుండానే కాల్స్..  

ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వాడేవారికి వాట్సాప్ మరో సౌలభ్యాన్ని అందించింది. ఇకపై డెస్క్‌టాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే పనిలేకుండా, నేరుగా బ్రౌజర్‌లోని 'వాట్సాప్ వెబ్' నుంచే ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.

 ఐఫోన్ యూజర్లకూ డ్యూయల్ అకౌంట్

ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే ఉండే డ్యూయల్ అకౌంట్ ఫీచర్ ఇప్పుడు యాపిల్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ వినియోగదారులు కూడా ఇకపై ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు వేర్వేరు అకౌంట్లను లాగిన్ చేసి వాడుకోవచ్చు.

 బిజినెస్ ఖాతాలకు చార్జీలు

సాధారణ యూజర్లకు ఉచిత ఫీచర్లు ఇస్తూనే, వ్యాపార సంస్థలకు(వాట్సాప్ బిజినెస్ ఖాతాలకు) మాత్రం చార్జీలు విధిస్తుంది. సాధారణ సర్వీస్, యుటిలిటీ మెసేజ్‌లకు కూడా వ్యాపార సంస్థల నుంచి అక్టోబర్ 1 నుంచి చార్జీలు వసూలు చేయనున్నట్లు వాట్సాప్ తెలిపింది.

ఈ సరికొత్త అప్‌డేట్స్‌తో వాట్సాప్ కేవలం మెసేజింగ్ యాప్‌గా మాత్రమే కాకుండా, యూజర్ల భద్రతను, వృత్తిపరమైన అవసరాలను తీర్చే ప్లాట్‌ఫారమ్‌గా రూపాంతరం చెందుతోందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

ప్రభాత ఉదయం, సెంట్రల్ డెస్క్