న్యూఢిల్లీ: క్రిెకెట్ ఆస్ట్రేలియా మాదిరిగానే మహిళల క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లు పోటీపడేలా ఒక విధానాన్ని తీసుకురావాలని అనయా బంగర్ బీసీసీఐని కోరారు. ట్రాన్స్‌జెండర్, జెండర్-డైవర్స్ ఆటగాళ్ల పాలసీ కింద క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నుంచి ఎలైట్ క్రికెట్ ఆడేందుకు అనుమతి పొందిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్‌లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు.
భారత మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ సంతానమైన అనయా బంగర్ (గతంలో ఆర్యన్) లింగ మార్పిడి (Gender Transition) ద్వారా మహిళగా మారిన విషయం తెలిసిందే. లింగమార్పిడి శస్త్రచికిత్స తర్వాత తన క్రికెట్ కెరీర్‌ను తిరిగి ప్రారంభించేందుకు అనయా ఆస్ట్రేలియా వెళ్లనుంది.
మరో వైపు ట్రాన్స్‌జెండర్, జెండర్-డైవర్స్ ఆటగాళ్ల పాలసీ కింద క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తీసుకున్న నిర్ణయంపై సౌతాఫ్రికా ఆల్ రౌండర్ మారిజాన్ కాప్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇది పూర్తిగా అసంబద్ధమైన నిర్ణయమని, ఇలాంటి రూల్ను అనుమతించకూడదని ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దానికి ప్రతిగా అనయా స్పందించారు. అన్ని రకాల వైద్య పరీక్షల అనంతరమే తనకు సీఏ మార్గం సుగమం చేసిందని స్పష్టం చేశారు. ‘‘ఆమె ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నారో నేను అర్థం చేసుకోగలను. ఏడాదిపాటు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకున్న తర్వాత నా అథ్లెటిక్ సామర్థ్యాలపై మాంచెస్టర్ యూనివర్శిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ 12 వారాల పాటు సుదీర్ఘమైన పరీక్షలు నిర్వహించింది. నా శారీరక ప్రమాణాలు మహిళా అథ్లెట్ల పరిధిలోనే ఉన్నాయని ఆ పరీక్షలు తేల్చాయి. ఆ ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి’’ అని వివరించారు. తన పునరాగమనంతో ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగబోదన్న అనయా.. మహిళల క్రీడా గౌరవాన్ని కాపాడటంపై క్రికెట్ ఆస్ట్రేలియా సరైన విధానాలను రూపొందించిందని పేర్కొన్నారు.