BCCI May Action On gambhir Also 
క్రీడలు

అగార్కర్ ఔట్..నెక్ట్స్ గంభీరే ?

• గంభీర్‌కు పదవీ గండం • 2027కు ముందే పంపించే చాన్స్ • తెరపైకి వీవీఎస్ లక్ష్మణ్ పేరు ?

Sai kiran

ప్రభాత ఉదయం, స్పోర్ట్స్ : టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‌కు కొత్త టెన్షన్ మొదలైంది. అజిత్ అగార్కర్ చీఫ్ సెలక్టర్ పదవి నుంచి తప్పుకోవడంతో నెక్ట్స్ గంభీర్‌ను సాగనంపే పనిలో బీసీసీఐ పడినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రెండు రోజుల కిందట సీనియర్ క్రికెటర్లందరూ మూకుమ్మడిగా గంభీర్‌పై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. టాలెంట్ ఉన్న క్రికెటర్లను పక్కకు పెట్టి, తనకు నచ్చిన వాళ్లనే టీమిండియాలోకి తీసుకుంటున్నాడని ఆరోపిస్తూ బీసీసీఐ పెద్దలను కలిసినట్టు సమాచారం.

2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతోన్న నేపథ్యంలో అనుభవం లేని బౌలర్లకు అవకాశాలు ఇస్తూ, టీమ్ వాతావరణాన్ని గంభీర్ పాడు చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక ఈ సమావేశంలో గంభీర్‌పై ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ ?

అజిత్ అగర్కార్‌ను బయటకు పంపిన బీసీసీఐ, ఒకవేళ గంభీర్‌పై వేటు వేస్తే వీవీఎస్ లక్ష్మణ్‌కు అవకాశం ఇవ్వనున్నారని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గంభీర్ సెలవులు తీసుకున్న ప్రతీసారి టీమిండియా తాత్కాలిక కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ పని చేశాడు. అతని ఆధ్వర్యంలో ఏడు సిరీస్‌లు ఆడిన టీమిండియా, 6 గెలుచుకుంది. అంటే అతని సక్సెస్ రేట్ గంభీర్ కంటే మెరుగ్గా ఉంది.

టీమిండియా సీనియర్లు క్రికెటర్లు కూడా లక్ష్మణ్‌ను హెడ్ కోచ్ చేయాలని ఇప్పటికే బీసీసీఐని కోరారని అంటున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా టైటిల్ గెలవాలంటే గంభీర్ స్థానంలో లక్ష్మణ్ రావాల్సిందేనని కూడా క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ 2027 వరల్డ్ కప్‌నకు ఏడాది సమయం కూడా లేదు. ఇలాంటి క్రమంలో హెడ్ కోచ్ మార్చే సాహసం బీసీసీఐ చేస్తుందా ? అనే ప్రశ్నలూ వస్తున్నాయి. కొత్త కోచ్ వస్తే, టీమిండియా వాతావరణం డిస్టర్బ్ అవుతుందని మాజీలు కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి గంభీర్ విషయంలో సోమవారం మీటింగ్‌లో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.