ప్రభాత ఉదయం, స్పోర్ట్స్: గౌతమ్ గంభీర్.. టీమిండియా క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన ఆటగాడు. ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన గంభీర్ యూటర్న్ తీసుకొని ఆ తర్వాత కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ప్రస్తుతం భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే, అతడి కెరీర్‌లో ఓ జెర్సీకి ప్రత్యేక స్థానం ఉంది. దానికి బురద మరకలు అంటుకున్నాయి. అయినా 15 ఏళ్లుగా దాన్ని ఉతకకుండా భద్రపరిచాడు. అక్టోబర్ 14న గంభీర్ 45వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఆసక్తికరమైన జెర్సీ కథ మరోసారి చర్చలోకి వచ్చింది. ఇంతకీ ఆ జెర్సీ వెనుక ఉన్న కథేంటి? గంభీర్ దాన్ని అంత ప్రత్యేకంగా ఎందుకు భావిస్తున్నాడు?తెలుసుకుందాం
గంభీర్ పోరాటానికి గుర్తుగా జెర్సీ మరక!
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్, శ్రీలంక తలపడ్డాయి. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 274/6 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 275 పరుగుల లక్ష్యం నిలిచింది. అప్పటికే కీలక ఆటగాళ్ల వికెట్లు పడటంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. లక్ష్య ఛేదనలో వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్ కాగా, సచిన్ తెందూల్కర్ కూడా త్వరగానే పెవిలియన్‌కు చేరాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన గౌతమ్ గంభీర్.. జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు.
97 పరుగులతో కీలక ఇన్నింగ్స్!
ఒకవైపు వికెట్లు పడుతున్నా గంభీర్ మాత్రం ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ కొనసాగించాడు. సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తూనే.. అవకాశం చిక్కినప్పుడు బౌండరీలు బాదాడు. వేగంగా పరుగులు తీసే క్రమంలో పలుమార్లు డైవ్ చేయాల్సి వచ్చింది. దీంతో అతడి నీలిరంగు జెర్సీకి బురద మరకలు అంటుకున్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా తన పోరాటాన్ని కొనసాగించాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో 97 పరుగుల వద్ద గంభీర్ ఔటయ్యాడు. అయితే, అప్పటికే అతడు భారత్ విజయానికి బలమైన పునాది వేశాడు. ఆ తర్వాత ధోనీ అజేయంగా 91 పరుగులు చేసి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో భారత్ 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది.
15 ఏళ్లుగా ఉతకకుండా భద్రపరిచిన జెర్సీ!
ఆ ఫైనల్‌లో గంభీర్ ధరించిన జెర్సీకి అంటుకున్న బురద మరకలు అతడి పోరాటానికి గుర్తుగా నిలిచాయి. ఆ మ్యాచ్‌లో చెమటోడ్చి, బురద అంటిన ఆ జెర్సీని గంభీర్ ఇప్పటికీ ఉతకలేదట! దాన్ని అలాగే ఒక పవిత్ర జ్ఞాపకంగా ఫ్రేమ్ కట్టించి గత దశాన్నర కాలంగా తన గదిలో భద్రపరుచుకున్నారు. "వరల్డ్ కప్ సాధించడంలో దేశం కోసం నా వంతు పాత్ర ఉందనే విషయాన్ని ఈ జెర్సీ నాకు నిత్యం గుర్తుచేస్తూనే ఉంటుంది" అని ఓ సందర్భంలో గంభీర్ స్వయంగా భావోద్వేగంతో పంచుకున్నారు. ప్రపంచకప్ విజయంలో తన పాత్రను గుర్తుచేసే జ్ఞాపకంగా దాన్ని దాచుకున్నట్లు తెలిపాడు. ఏది ఏమైనప్పటికీ, వ్యక్తిగత మైలురాళ్ల కంటే దేశ విజయమే ముఖ్యం భావించే గౌతమ్ గంభీర్ పోరాట పటిమకు, ఆ 'బురద అంటిన జెర్సీ' ఎప్పటికీ ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది!