ప్రభాత ఉదయం, స్పోర్ట్స్: బెంగళూరు చిన్నస్వామి వేదికగా శనివారం జరుగనున్న టీమిండియా, విండీస్ టీ20 సిరీస్ డిసైడర్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ నెల 15న బెంగళూరులో ప్రారంభమైన వర్షాలు, బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో బెంగళూరుతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శనివారం 70 నుంచి 85% పడే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్న 5వ టీ20 మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే ప్రమాదం పొంచి ఉంది. దీంతో టికెట్లు కొనుగోలు చేసిన క్రికెట్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
మ్యాచ్ రద్దయితే, పరిస్థితి ఏంటి ?
బెంగళూరు వేదికగా జరుగనున్న 5వ టీ20కి వర్షం విలన్‌గా మారితే, ఓవర్లు కుదించే వెసులుబాటు ఉంటుంది. అంతేకాదు, చిన్నస్వామిలో ఎంత వర్షం పడినా.. సబ్ ఎయిర్ డ్రైనేజీ సిస్టంతో మైదానాన్ని క్షణాల్లోనే రెడీ చేసే టెక్నాలజీ ఉంది. ఈ క్రమంలోనే కనీసం 5 ఓవర్ల మ్యాచైనా నిర్వహించే అవకాశాలు ఉంటాయి. కానీ, భారీ వర్షం పడి..ఒక్క ఓవర్ కూడా ఆడలేని పరిస్థితి వస్తే, 2-2 తేడాతో టీమిండియా, విండీస్ టీ20 సిరీస్ పంచుకోవాల్సి వస్తుంది.
బౌలింగ్ దళంపై టీమిండియా దృష్టి
హైదరాబాద్ టీ20 సందర్భంగా టీమిండియా బౌలర్లు అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. ఒక్కో బౌలర్ 13 ఎకానమీతో 50కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ తరుణంలోనే విండీస్ బ్యాటర్లు చెలరేగి, టీమిండియాను ఓడించారు. అయితే, చిన్నస్వామి మ్యాచ్‌లో మాత్రం పొదుపుగా బౌలింగ్ చేసేలా టీమిండియా బౌలర్లకు గంభీర్ క్లాస్ పీకినట్టు సమాచారం. సరైన లెన్త్‌తో బంతులు వేయాలని దిశా నిర్దేశం చేశారని సమాచారం. అర్ష్‌దీప్ సింగ్‌కు గాయం కావడంలో భువనేశ్వర్ కుమార్‌ను బరిలోకి దింపుతున్నారు. దీంతో టీమిండియా బౌలింగ్ దళం కాస్త బలంగా మారనుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన భువీకి చిన్నస్వామి హోం గ్రౌండ్ కావడం టీమిండియా కలిసిరానుంది. విండీస్ కెప్టెన్ హోప్, హెట్మెయర్, పోవెల్ లాంటి వాళ్లను త్వరగా పెవిలియన్‌కు పంపిస్తే టీమిండియా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో గెలిచిన విండీస్, అదే ఊపుతో బెంగళూరులో గెలిచి సిరీస్ దక్కించుకొనే దిశగా అడుగులు వేస్తోంది.
వైభవ్‌కు మరోసారి నిరాశే
ఐదో టీ20 సందర్భంగా కూడా వైభవ్ నిరాశే ఎదురుకానున్నట్టు సమాచారం. మరోసారి ఓపెనర్లుగా సంజు, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. సిరీస్ డిసైడర్ కావడంతో బ్యాటింగ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసే చాన్సులు కనిపించడం లేదు.