జపాన్‌లోని ఐచి-నాగోయాలోని నిషిన్‌లో అక్టోబర్ 3న జరిగిన ఏషియన్ గేమ్స్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన పాకిస్థాన్ బౌలర్ సైమ్ అయూబ్.. బిడ్డను ఊయల ఊపుతున్నట్టుగా ‘క్రేడిల్ సెలబ్రేషన్’ చేశాడు. వైభవ్ చిన్న వయసును ఉద్దేశించేలా కనిపించిన ఈ సంబరం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే.. ఇలాంటి అనుభవం భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు కూడా ఎదురైంది. 1989లో 16 ఏళ్ల వయసులో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన సచిన్‌ను అప్పట్లో ‘పిల్లాడు’ అంటూ ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో 37 ఏళ్ల తర్వాత నాటి సచిన్–నేటి వైభవ్ ఘటనలను క్రికెట్ అభిమానులు పోల్చి చూస్తున్నారు.
భారత్–పాకిస్థాన్ ఏషియన్ గేమ్స్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ తనదైన శైలిలో దూకుడుగా ఆరంభించాడు. రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. అయితే పాకిస్థాన్ బౌలర్ సైమ్ అయూబ్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి 9 బంతుల్లో 15 పరుగుల వద్ద ఔటయ్యాడు. వైభవ్ వికెట్ పడగానే అయూబ్.. బిడ్డను ఊయల ఊపుతున్నట్టుగా ‘క్రేడిల్ సెలబ్రేషన్’ చేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన దూకుడైన ఆటతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైభవ్‌ను అభిమానులు ‘బాస్ బేబీ’గా పిలుస్తున్నారు. వైభవ్ ఔట్ కు సమాధానంగా అన్నట్లు అదే సైమ్ అయూబ్ ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదాడు. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించి 28 బంతుల్లో 61 పరుగులు చేశాడు. తిలక్ వర్మ అజేయ అర్ధశతకంతో రాణించడంతో భారత్ 20 ఓవర్లలో 211/6 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 192/6కే పరిమితమైంది. దీంతో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించి ఏషియన్ గేమ్స్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. అలా ‘బేబీ సెలబ్రేషన్’తో మొదలైన ఈ ఆసక్తికరమైన సీన్.. చివరికి భారత్ స్వర్ణంతో ముగిసింది. అదే విధంగా ఆసియా క్రీడల చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన యంగెస్ట్ భారత అథ్లెట్‌గా వైభవ్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు షూటర్ సౌరభ్ చౌదరి పేరిట ఉండేది. 2018 జకార్తా ఆసియా క్రీడలలో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 16 ఏళ్ల వయస్సులో సౌరభ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.
1989లో 16 ఏళ్ల సచిన్ టెండూల్కర్ తొలిసారి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లాడు. అప్పటికి అంత చిన్న వయసులోనే భారత జట్టులో చోటు దక్కించుకున్న సచిన్‌పై క్రికెట్ ప్రపంచం దృష్టి పడింది. మరోవైపు పాకిస్థాన్ జట్టులో ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి ప్రపంచ స్థాయి పేసర్లు ఉన్నారు. సచిన్‌ను చూసిన పాకిస్థాన్ ప్రేక్షకులు అతడి వయసును ఉద్దేశించి ‘పిల్లాడు’ అంటూ ఆటపట్టించారు. పేషావర్‌లో జరిగిన మ్యాచ్‌లో అతడిని ఉద్దేశిస్తూ ‘ఇంటికి వెళ్లి పాలు తాగు’ అనే అర్థం వచ్చే బ్యానర్ కూడా కనిపించింది. అయితే ఈ యువ బ్యాటర్ అక్కడితో ఆగలేదు. ముస్తాక్ అహ్మద్ బౌలింగ్‌లో సచిన్ భారీ షాట్లు ఆడటంతో పాకిస్థాన్ దిగ్గజ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ అతడిని సవాలు చేశాడు. ‘పిల్లలను ఎందుకు కొడుతున్నావు.. నన్ను కొట్టి చూపించు’ అనే రీతిలో సచిన్‌కు సవాలు విసిరాడు. ఆ సవాలును స్వీకరించిన సచిన్, ఖాదిర్ ఒకే ఓవర్లో 28 పరుగులు (4 సిక్సర్లు) బాది పాక్ దిగ్గజాల నోళ్లు మూయించాడు. మరోవైపు వసీం అక్రమ్ కూడా కొన్నేళ్ల తర్వాత 1989 పర్యటనను గుర్తుచేసుకుంటూ.. సచిన్ తమ ముందుకు వచ్చినప్పుడు అతడు 14 ఏళ్ల బాలుడిలా కనిపించాడని, సరదాగా ‘మమ్మీని అడిగి వచ్చావా?’ అని అన్నానని వెల్లడించాడు. అయితే.. సచిన్ కథ ఇంతటితో ఆగలేదు. అదే పర్యటనలో సియాల్‌కోట్‌లో జరిగిన నాలుగో టెస్టులో అతడి పట్టుదలకు అసలైన పరీక్ష ఎదురైంది. భారత్ 38/4తో కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన 16 ఏళ్ల సచిన్‌ను వకార్ యూనిస్ వేసిన వేగమైన బౌన్సర్ తాకింది. హెల్మెట్ నుంచి తగిలిన బంతి ముక్కుపై బలంగా తాకడంతో రక్తం ధారలా కారి షర్టుపై మరకలు పడ్డాయి. దీంతో ఫిజియో, సహచర ఆటగాళ్లు మైదానం నుంచి "వైదొలగు (Retire Hurt)" అని సలహా ఇచ్చారు. సచిన్ రక్తాన్ని తుడుచుకుంటూ గంభీరమైన గొంతుతో "మై ఖేలూంగా" (నేను ఆడతాను) అంటూ తన ఆటను కొనసాగించాడు. తర్వాతి బంతినే బౌండరీకి తరలించాడు. ఆ ఇన్నింగ్స్‌లో 134 బంతులు ఎదుర్కొని 57 పరుగులు చేసిన సచిన్.. భారత్ ఆ టెస్టును డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. చిన్న వయసు కారణంగా అప్పట్లో వెక్కిరింతలు ఎదుర్కొన్న ఆ కుర్రాడే.. తర్వాత ప్రపంచ క్రికెట్‌లో ‘సచిన్ టెండూల్కర్’గా ఒక శకాన్ని సృష్టించాడు.
అప్పుడు సచిన్.. ఇప్పుడు వైభవ్.. కెరీర్ ప్రారంభంలోనే తమ వయసును చూసి ఆటపట్టించిన సందర్భాలను ఇద్దరూ ఎదుర్కొన్నారు. ఇద్దరి కథల్లోనూ మరో ఆసక్తికరమైన పోలిక ఉంది.. ప్రత్యర్థి పాకిస్థానే.. అయితే 1989 పాకిస్థాన్ పర్యటన తర్వాత సచిన్.. ప్రపంచ క్రికెట్‌లో ఒక శకంగా ఎదిగి, ‘క్రికెట్ దేవుడు’గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. 37 ఏళ్ల తర్వాత.. అదే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వైభవ్ ‘బేబీ’గా ప్రత్యర్థి సంబరానికి కారణమయ్యాడు. సచిన్ కథ చరిత్రగా మారింది. వైభవ్ కథ మాత్రం ఇప్పుడే మొదలైంది. తన దూకుడైన బ్యాటింగ్‌తో ఇప్పటికే ‘బాస్ బేబీ’గా మొదలైన వైభవ్ ప్రయాణం.. భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.