టోక్యో : రెండు చేతులు లేకపోయినా విలువిద్యలో అద్భుతాలు సృష్టిస్తున్న ప్రపంచ నంబర్ వన్ శీతల్ దేవీ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. జపాన్‌లో జరుగుతున్న ఆసియా పారాలంపిక్స్‌లో మరో స్వర్ణాన్ని దక్కించుకుంది. మహిళల వ్వక్తిగత విభాగంలోనూ గోల్డ్ మెడల్ సాధించిన శీతల్.. గురువారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ టైటిల్‌ను నిలబెట్టుకుంది. తోమన్ కుమార్‌తో కలిసి స్వర్ణాన్ని దక్కించుకుంది. ఈ జోడీ ఫైనల్లో 151–148 తేడాతో ఇండోనేషియా ప్లేయర్లను ఓడించారు. 2023 ఆసియా పారా గేమ్స్ అరంగేట్రంలో రాకేశ్ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్ విభాగంలో స్వర్ణం నెగ్గింది. శీతల్ఈసారి కూడా మూడు పతకాలతో తన గత రికార్డును సమం చేసింది.
సువర్ణరాజ్‌కు స్వర్ణం
ఆసియా పారా గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. గురువారం నాటికి 17 స్వర్ణాలు, 22 రజతాలు, 34 కాంస్యాలతో మొత్తం 73 పతకాలు సాధించి భారత్ ఐదో స్థానంలో నిలిచింది. మహిళల డిస్కస్ త్రో ఎఫ్54 విభాగంలో సువర్ణ రాజ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. మరోవైపు డబ్ల్యూ1 ఆర్చరీలో భారత క్రీడాకారిణి స్వాతి చౌదరి తృటిలో పసిడిని చేజార్చుకుంది. ఈ వీల్‌చైర్ ఆర్చరీ విభాగంలో పోటీపడిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచిన స్వాతి.. ఫైనల్లో చైనాకు చెందిన సెన్ మెంగ్‌కన్‌పై ఒక దశలో 4–2తో ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఆ తర్వాత పట్టు కోల్పోయి 4–6తో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకుంది.
బ్యాండ్మింటన్‌లో కాంస్యాలు
పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్4 విభాగంలో సుహాస్ యతిరాజ్, అభిజీత్.. మహిళల సింగిల్స్ ఎస్‌ఎల్3 విభాగంలో సంజనా కుమారి కాంస్య పతకాలు సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్ ఎస్‌హెచ్6లో కృష్ణనాగర్–నిత్యశ్రీ జోడీ, ఎస్‌ఎల్3 విభాగంలో మనీషా రాందాస్–ప్రమోద్ భగత్ జంట కూడా కాంస్య పతకాలను సొంతం చేసుకున్నాయి.