Sikandar Raza 
క్రీడలు

2027 వరల్డ్ కప్‌ తర్వాత రిటైర్మెంట్‌.. సికందర్‌ రజా కీలక ప్రకటన

జింబాబ్వే వన్డే, టీ20 కెప్టెన్ సికందర్ రజా, తన రిటైర్మెంట్‌పై కీలక ప్రకటన చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత క్రికెట్ నుంచి తప్పుకొంటానని తెలిపారు.

Sai kiran

ప్రభాత ఉదయం, స్పోర్ట్స్:  జింబాబ్వే స్టార్‌ ఆల్‌రౌండర్‌, వన్డే, టీ20 కెప్టెన్‌ సికందర్‌ రజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే సమయాన్ని ప్రకటించారు. 2027 వన్డే ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే రిటైర్మెంట్‌ తీసుకుంటానని వెల్లడించారు. భారత పర్యటనలో ఉన్న ఆయన గురువారం దిల్లీలో మీడియాతో మాట్లాడారు. తనకు 40 ఏళ్లు వచ్చాయని, మిగిలిన జీవితాన్ని కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2027–30 సైకిల్‌లో జింబాబ్వేకు అవకాశం లభించినా.. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని మార్చుకోబోనని రజా స్పష్టం చేశారు. జింబాబ్వే, దక్షిణాఫ్రికా, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటం తనకు గొప్ప వరమని పేర్కొన్నారు.

సొంత గడ్డపై మ్యాచ్‌లు జరిగినంత మాత్రాన జింబాబ్వేకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రయోజనం ఉండబోదని రజా అభిప్రాయపడ్డారు. అయితే, జట్టు సమష్టిగా రాణిస్తే ప్రపంచకప్‌ ఫైనల్‌ వరకు చేరే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.