Test Twenty tournament in Sri Lanka 
క్రీడలు

క్రికెట్‌లో మరో కొత్త ప్రయోగం..ఒకే జట్టులో అమ్మాయిలు, అబ్బాయిలు

శ్రీలంకలో నవంబర్ 14 నుంచి కొత్త క్రికెట్ టోర్నీ ‘టెస్ట్ ట్వంటీ’ ప్రారంభం కానుంది. పురుషులు, మహిళల మ్యాచ్‌ల ఉమ్మడి స్కోరు ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.

Sai kiran

 ప్రభాత ఉదయం,  స్పోర్ట్స్:  క్రికెట్‌లో మరో కొత్త ప్రయోగానికి శ్రీలంక వేదిక కానుంది. పురుషులు, మహిళలు కలిసి పాల్గొనే వినూత్న టోర్నమెంట్‌ ‘టెస్ట్‌ ట్వంటీ’ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో అబ్బాయిలు, అమ్మాయిలు విడివిడిగా తమ ప్రత్యర్థి జట్లతో ఆడతారు. అయితే విజేతను నిర్ణయించేది మాత్రం రెండు మ్యాచ్‌ల్లో నమోదైన ఉమ్మడి స్కోరే! బాయ్స్ వర్సెస్ బాయ్స్, గర్ల్స్ వర్సెస్ గర్ల్స్ ఆడిన ఇరు జట్ల స్కోర్లు కలిపి విజేతను నిర్ణయిస్తారు. అంటే పురుషుల ప్రదర్శనతో పాటు మహిళల ప్రదర్శనకూ సమాన ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ కొత్త ఫార్మాట్‌ తొలి ఎడిషన్‌ నవంబర్‌ 14 నుంచి 29 వరకు కొలంబోలోని సింహాలీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా జరగనుంది.

ఒకే రోజు.. రెండు ఫార్మాట్లు!

టెస్ట్‌ ట్వంటీ టోర్నీలో మ్యాచ్‌లు రోజుకు 80 ఓవర్ల పాటు కొనసాగుతాయి. పగటిపూట 40 ఓవర్ల ఆటలో క్రికెటర్లు తెల్ల దుస్తులు ధరించి ఎర్ర బంతితో ఆడతారు. రాత్రి సమయంలో మరో 40 ఓవర్ల ఆటను రంగుల దుస్తుల్లో తెల్ల బంతితో నిర్వహిస్తారు. ఇలా ఒకే రోజు సంప్రదాయ టెస్ట్‌ క్రికెట్‌ తరహా ఆటతో పాటు పరిమిత ఓవర్ల క్రికెట్‌ శైలినీ కలిపి ఈ టోర్నీని రూపొందించారు.

160 మంది ప్లేయర్లు.. నాలుగు జట్లు

ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 13 నుంచి 21 ఏళ్ల వయస్సున్న 160 మంది క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటారు. వారిని నాలుగు జట్లుగా విభజిస్తారు. ఒక్కో జట్టులో 40 మంది ఆటగాళ్లు ఉంటారు. వీరిలో 20 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలు ఉంటారు. మ్యాచ్‌ల్లో అబ్బాయిల జట్టు మరో అబ్బాయిల జట్టుతో, అమ్మాయిల జట్టు మరో అమ్మాయిల జట్టుతో తలపడుతుంది.

రెండు మ్యాచ్‌ల స్కోర్లు కలిపి విజేత

ఈ టోర్నీలో ప్రత్యేకత స్కోరు లెక్కించే విధానమే. అబ్బాయిల మ్యాచ్‌లో నమోదైన పరుగులకు, అమ్మాయిల మ్యాచ్‌లో నమోదైన పరుగులను కలుపుతారు. ఆ రెండు మ్యాచ్‌ల ఉమ్మడి స్కోరు ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. దీంతో జట్టులోని పురుషులు, మహిళలు ఇద్దరూ తమ ప్రదర్శనతో జట్టు విజయానికి దోహదపడాల్సి ఉంటుంది. టాస్‌ ప్రక్రియలోనూ లింగ సమానత్వాన్ని ప్రతిబింబించేలా ‘పారిటీ రూల్‌’ అమలు చేయనున్నారు.