తెలంగాణ

ట్రైనీ ఐపీఎస్‌ల ఫేజ్‌–1 శిక్షణ పూర్తి.. తెలంగాణకు ఇద్దరు, ఏపీకి 8 మంది

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 78వ బ్యాచ్‌కు చెందిన 151 మంది ట్రైనీ ఐపీఎస్‌లు ఫేజ్‌–1 శిక్షణ పూర్తి చేసుకున్నారు.

Boddupalli Naresh

ప్రభాత ఉదయం, హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 151 మంది ట్రైనీ ఐపీఎస్‌లు ఫేజ్‌–1 శిక్షణను పూర్తి చేసుకున్నారు. వీరిలో తెలంగాణకు ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిది మందిని కేటాయించినట్లు అకాడమీ డైరెక్టర్ సుజీత్ పాండే తెలిపారు. గురువారం 78వ బ్యాచ్ పరేడ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ బ్యాచ్‌లో 135 మంది ఐపీఎస్‌లు, 16 మంది విదేశీ పోలీసు అధికారులు శిక్షణ పొందినట్లు వెల్లడించారు.

2027 జూన్‌ 21న శిక్షణ పూర్తి

ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో 15 వారాలపాటు శిక్షణ ఇచ్చినట్లు సుజీత్ పాండే తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో ఫేజ్‌–1 బేసిక్ కోర్సును పూర్తి చేసుకున్నారని వివరించారు. తదుపరి 29 వారాలపాటు జిల్లా స్థాయిలో ప్రాక్టికల్ శిక్షణ, ఆపై తొమ్మిది వారాలపాటు ఫేజ్‌–2 బేసిక్ కోర్సు ఉంటుందని చెప్పారు. ఈ బ్యాచ్ శిక్షణ 2027 జూన్ 21న పూర్తవుతుందని వెల్లడించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన ఐపీఎస్‌లను అకాడమీ డైరెక్టర్ అభినందించారు. ఈ నెల 17న నిర్వహించే దీక్షాంత్ పరేడ్‌లో వారికి బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.

ఉదయ్ కృష్ణారెడ్డి కేసు విచారణలో ఉంది

లైంగిక వేధింపుల కేసులో సస్పెండ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంపై మీడియా ప్రశ్నించగా, ఈ కేసు ప్రస్తుతం తెలంగాణ పోలీసుల పరిధిలో విచారణలో ఉందని సుజీత్ పాండే తెలిపారు. ప్రత్యేక కమిటీ దర్యాప్తు చేస్తున్నందున ఈ దశలో మరిన్ని వివరాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. అకాడమీలో 37 మంది మహిళా ట్రైనీ ఐపీఎస్‌లు ఉన్నారని, వారికి పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.