తెలంగాణ

1956 విలీనం తర్వాత ఆరేళ్లకు ఆంధ్రప్రదేశ్‌కు తొలి సాధారణ ఎన్నికలు ?

Agasthya kantu

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత జరిగిన తొలి శాసనసభ ఎన్నికల నిర్వహణ వెనుక ఒక ప్రత్యేకమైన చారిత్రక పరిణామం ఉంది. అప్పటికే ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో వేర్వేరు సంవత్సరాల్లో ఎన్నికలు జరగడంతో.. కొత్త రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలను ఒకే సమయంలో నిర్వహించేందుకు పదవీకాలాలను సర్దుబాటు చేశారు. ఫలితంగా 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఆరేళ్లకు అంటే 1962లో తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఇందుకు కారణమేమిటి,  ఆ ఎన్నికల ఫలితాల సరళిని తెలుసుకుందాం..

ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీకి 1952లో, ఆంధ్రా రాష్ట్ర అసెంబ్లీకి 1955లో ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో పదవీ కాలం ముగిసిన తెలంగాణ ప్రాంతానికి 1957లో ఎన్నికలు నిర్వహించి 105 మంది శాసనసభ్యులను ఎన్నుకున్నారు.  1955లో ఆంధ్రా ప్రాంతంలో ఎన్నికైన ఎమ్మెల్యేల  పదవీ కాలం 1960 నాటికే పూర్తవ్వాల్సి ఉంది. అయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం (States Reorganisation Act, 1956)  చట్టం ప్రకారం 1955లో ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికైన ఎమ్మెల్యేల పదవీ కాలాన్ని 5 ఏళ్ల నుంచి 7 ఏళ్లకు (1955–1962 వరకు) పొడిగించారు. దీంతో 1960లో ఆంధ్రా ప్రాంతంలో ఎన్నికలు జరగలేదు. ఆంధ్రా (1955-1962), తెలంగాణ (1957-1962) రెండు ప్రాంతాల ప్రజాప్రతినిధుల పదవీ కాలాన్ని సమన్వయం చేస్తూ 1962లో తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు.

300 స్థానాలు..1.90 కోట్ల మంది ఓటర్లు

1962 ఎన్నికలలో మొత్తం 300 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 246 జనరల్, 43 ఎస్సీ, 11 ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలు. మొత్తం 988 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దాదాపు 1.90 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 1.21 కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 64 శాతం పోలింగ్ నమోదైంది.

ప్రాంతాల వారీగా ఎన్ని స్థానాలు?

1962 నాటి నియోజకవర్గాల క్రమాన్ని ప్రాంతాల వారీగా పరిశీలిస్తే మొత్తం 300 స్థానాల్లో కోస్తా ఆంధ్రాకు 137, రాయలసీమకు 57, తెలంగాణకు 106 స్థానాలు ఉన్నాయి. అంటే అప్పటి ఆంధ్రా ప్రాంతం (కోస్తా ఆంధ్రా + రాయలసీమ) కలిపి 194 స్థానాలు, తెలంగాణకు 106 స్థానాలు. 1957లో తెలంగాణకు 107 స్థానాల్లో ఎన్నికలు జరగగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కారణంగా  1962 నాటికి ఆ  సంఖ్య 106కు చేరింది.

కాంగ్రెస్‌ హవా.. 177 సీట్లతో తిరుగులేని ఆధిపత్యం

1962 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 300 స్థానాల్లో 177 సీట్లు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. కాంగ్రెస్‌కు 55.23 లక్షలకు పైగా ఓట్లు, 47.25 శాతం ఓట్లు లభించాయి. రెండో స్థానంలో నిలిచిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (CPI) 51 స్థానాలు గెలుచుకుని 19.53 శాతం ఓట్లు సాధించింది. స్వతంత్ర పార్టీ (Swatantra Party) 19 సీట్లు గెలుచుకోగా, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఏకంగా 51 స్థానాలు గెలిచారు. సోషలిస్ట్‌ పార్టీ 2 స్థానాలు గెలిచింది.

సీపీఐ.. బలమైన ప్రతిపక్ష శక్తిగా ఎదుగుదల

1962 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా సీపీఐ నిలిచింది. 136 స్థానాల్లో పోటీ చేసి 51 స్థానాలు గెలుచుకుంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్రలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఉన్న బలమైన సామాజిక, రైతాంగ పునాది ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. గన్నవరం నుంచి పుచ్చలపల్లి సుందరయ్య, పుట్టూరు నుంచి తారిమెల నాగిరెడ్డి వంటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు గెలిచారు.

ఇద్దరు ముఖ్యమంత్రులు

1962 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా సంజీవరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడిగా ఎంపికవ్వడంతో 1960 జనవరి 11న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి నీలం సంజీవరెడ్డి 1962, మార్చి 12న రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కర్నూలు ప్రాంతంలో బస్సు రూట్ల జాతీయీకరణ ప్రక్రియలో ముఖ్యమంత్రి వ్యక్తిగత పక్షపాతం చూపారంటూ వచ్చిన ఆరోపణలపై 1964 జనవరిలో సుప్రీంకోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసింది. దీనికి ప్రతిస్పందనగా  ఆయన 1964 ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం 1964 ఫిబ్రవరి 21న ఆయన స్థానంలో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈయన గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం నుంచి గెలిచారు.

ప్రతిపక్షనేత..స్పీకర్.. గెలిచిన ప్రముఖులు

1962 ఎన్నికల్లో అప్పటి రాజకీయ దిగ్గజాలు అనేక మంది గెలిచారు. కర్నూలు జిల్లా కోయిలకుంట్ల నియోజకవర్గం నుంచి గెలిచిన  బొల్లవరపు వెంకటసుబ్బారెడ్డి శాసనసభ స్పీకర్ గా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా పుట్లూరు నుంచి గెలిచిన ప్రముఖ కమ్యూనిస్టు నేత తారిమెల నాగిరెడ్డి (నీలం సంజీవరెడ్డికి తరిమెల నాగిరెడ్డి బావమరిది) శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. గెలిచిన ప్రముఖులలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు, దామోదరం సంజీవయ్య, పి.వి.జి. రాజు, పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న, వావిలాల గోపాలకృష్ణయ్య, తెన్నేటి విశ్వనాథం, అరుట్ల రామచంద్రారెడ్డి, అరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, నంద్యాల శ్రీనివాసరెడ్డి వంటి నాయకులు ఉన్నారు. ఈ అసెంబ్లీ కాలంలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో HMT, BHEL, IDPL, మిధాని వంటి భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమల ఏర్పాటుకు వేగవంతమైన చర్యలు ప్రారంభమయ్యాయి.