తెలంగాణ

1983 పొలిటికల్ స్క్రీన్ పై.. ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్..!

Agasthya kantu

వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ రామారావు.. రాజకీయ రంగంలోనూ అదే స్థాయిలో సంచలనం సృష్టించారు. ఎవరూ కూడా ఊహించని విధంగా సంచలన చరిత్రకు తెర తీసారు..రాజకీయ అరంగేట్రం చేసిన 9 నెలల్లోనే బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టిన ఎన్టీవోడు.. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి తిరుగులేని శక్తిగా రాజకీయాలను శాసిస్తున్న కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి 1983 ఎన్నికలలో 201 సీట్లతో అఖండ విజయం సాధించి.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి యావత్ రాజకీయ రంగంలోనే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్ సాధించిన గెలుపు అలాంటి ఇలాంటిది కాదు..! అప్పటివరకు కొనసాగిన రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసిన ఈ విజయంతో.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల ప్రస్తావన వస్తే.. ఎన్టీఆర్‌కు ముందు, ఎన్టీఆర్​ తర్వాత అని చెప్పుకోవాల్సినంత ప్రభంజనం సృష్టించారు.

వెండితెర రారాజుగా తనను అంతటి స్థాయికి చేర్చిన ప్రజలకు తిరిగి ఏదైనా చేయాలనే సంకల్పంతో 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీ తొమ్మిది నెలల్లోనే అది ఓ రాజకీయ ప్రభంజనంగా మారింది. ఫలితంగా 1983, జనవరి 5న జరిగిన ఎన్నికలలో  294 అసెంబ్లీ స్థానాలకుగాను తెలుగుదేశం పార్టీ  201 స్థానాలు సాధించి తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 60 స్థానాలు, జనతా పార్టీ 2 స్థానాలు, ఇతరులు 31 స్థానాలు గెలిచారు. గుడివాడ, తిరుపతి రెండు స్థానాల నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్ రెండింటిలోనూ విజయం సాధించారు. తిరుపతి స్థానానికి రాజీనామా చేసి గుడివాడ ఎమ్మెల్యేగా కొనసాగారు.

 ప్రమాణస్వీకారంలోనూ నూతన ఒరవడి

అప్పటివరకు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టేవారు పరిమిత సంఖ్యలో అతిథుల సమక్షంలో రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయడం ఆనవాయితీగా ఉండేది. అందుకు భిన్నంగా ఎన్టీఆర్ ప్రజల మధ్యే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 1983 జనవరి 9న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌ సంప్రదాయానికి భిన్నంగా.. ప్రజల మధ్య, ఓ క్రీడా మైదానంలో ముఖ్యమంత్రి పదవీ ప్రమాణం చేయడం అప్పట్లో విశేషంగా నిలిచింది. అధికారాన్ని ప్రజలకు దగ్గర చేయాలన్న తన రాజకీయ ఆలోచనను ప్రమాణస్వీకార వేదిక నుంచే ఎన్టీఆర్ చాటిచెప్పారు.

సామాన్యూడికి చేరేలా..పార్టీ జెండా, గుర్తు

పార్టీ జెండా, అజెండా రూపకల్పనలోనూ ఎన్టీఆర్‌ సంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన ఆలోచనను ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ గుర్తింపును సామాన్యుడికి సులభంగా అర్థమయ్యేలా రూపొందించారు. జెండాపై నాగలి, గుడిసె, చక్రం వంటి చిహ్నాలకు చోటు కల్పించి.. రైతులు, పేదలు, శ్రామిక వర్గాలకు అవి ప్రతీకలుగా నిలిచేలా చేశారు. ఈ మూడు గుర్తులనూ పసుపు రంగు నేపథ్యంలో ఉంచారు. భారతీయ సంప్రదాయంలో శుభానికి ప్రతీకగా భావించే పసుపు రంగు.. పార్టీకి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఇక ఎన్నికల గుర్తుగా ‘సైకిల్‌’ను ఎంచుకోవడం కూడా తెలుగుదేశం పార్టీకి బాగా కలిసొచ్చింది. సామాన్యుడి జీవనంతో ముడిపడి ఉన్న సైకిల్‌.. పార్టీ భావజాలానికి, ప్రజలతో నేరుగా అనుసంధానమయ్యే ఎన్టీఆర్‌ ప్రచార శైలికి సరిపోయే గుర్తుగా మారింది.

తనదైన శైలిలో..

తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడంలో  ఎన్టీఆర్​  అనుసరించిన వినూత్న ప్రచారశైలి గురించి చెప్పుకోవాలి. "తెలుగుదేశం పిలుస్తోంది - రా కదిలిరా" అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. "సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు, ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలోంచి పుట్టింది. కార్మికుడి కరిగిన కండలోంచి వచ్చింది. రైతు కూలీల రక్తంలోంచి పుట్టింది. నిరుపేదల కన్నీటి లోంచి, కష్టజీవుల కంటి మంటల్లోంచి, అన్నార్తుల ఆక్రందనల్లోంచి పుట్టింది ఈ తెలుగుదేశం"  అంటూ తనదైన శైలిలో శంఖారావం పూరించారు.

చైతన్యరథమే ప్రచారవేదిక

తెలుగుదేశం పార్టీ 1983 ఎన్నికల్లో సాధించిన సంచలన విజయానికి ఎన్టీఆర్‌ చైతన్యరథం ప్రచారం కీలకంగా మారింది. అప్పటివరకు రాజకీయ నాయకుల ప్రచారం ప్రధానంగా సభలు, సమావేశాలు, ఊరేగింపులకే పరిమితమై ఉండగా.. ఎన్టీఆర్‌ అందుకు పూర్తి భిన్నమైన పంథాను ఎంచుకున్నారు. నేడు రాజకీయ పార్టీలకు సాధారణంగా మారిన రోడ్‌షో తరహా ప్రచారాన్ని.. నాలుగు దశాబ్దాల క్రితమే ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. 1940 మోడల్‌ షెవర్లె వ్యాన్‌ను మార్పులు చేసి ‘చైతన్యరథం’గా తీర్చిదిద్ది.. దానినే తన ప్రచార వేదికగా మలుచుకున్నారు.

1982 అక్టోబర్‌ 3న ప్రారంభమైన చైతన్య యాత్ర.. 1983 జనవరి 3న తిరుపతిలో జరిగిన ప్రచార సభతో ముగిసింది. ఈ వ్యవధిలో ఎన్టీఆర్‌ చైతన్యరథంపై 35 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. దాదాపు తొమ్మిది నెలల పాటు సాగిన రాజకీయ ప్రస్థానంలో.. విశ్రాంతికి తావులేకుండా ప్రజల మధ్య తిరుగుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను, ఎన్నికల హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.

బెల్‌బాటమ్‌ ప్యాంటు, పొడవాటి చేతుల చొక్కాతో చైతన్యరథంపై నిల్చుని.. ‘నా తెలుగింటి ఆడపడుచులారా.. తమ్ముళ్లారా..’ అంటూ ప్రసంగం ప్రారంభిస్తే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చేది. ఆయన పర్యటనలు కేవలం ఎన్నికల ప్రచార సభలుగా కాకుండా.. ప్రజలను నేరుగా కలుసుకునే కార్యక్రమాలుగా సాగాయి. రోడ్డు పక్కనే భోజనం, విశ్రాంతి, ఇతర అవసరాలు పూర్తి చేసుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించేవారు. దారిలో ఎక్కడ ప్రజలు గుమిగూడితే అక్కడే చైతన్యరథాన్ని ఆపి మాట్లాడేవారు. వారి సమస్యలు, కష్టసుఖాలను తెలుసుకునేవారు. అప్పటివరకు రాజకీయ నాయకులు ప్రజల వద్దకు రావడం అరుదుగా ఉండే పరిస్థితుల్లో.. వెండితెరపై దేవుడి పాత్రల్లో కనిపించిన ఎన్టీఆర్‌ స్వయంగా తమ గడప వద్దకు వచ్చి పలకరించడం సామాన్య ప్రజలకు ఒక కొత్త అనుభూతిని కలిగించింది. ప్రజల మధ్యే ఉంటూ, వారి భాషలోనే మాట్లాడుతూ, వారి సమస్యలను వింటూ సాగిన ఈ ప్రచారం ఎన్టీఆర్‌కు జనంతో ప్రత్యక్ష అనుబంధాన్ని ఏర్పరిచింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ జెండా, అజెండాను మారుమూల ప్రాంతాలకూ తీసుకెళ్లింది.

అభ్యర్థుల ఎంపికలోనూ వినూత్న పంథా

రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన ఎన్టీఆర్‌. అభ్యర్థుల ఎంపికలోనూ అదే పంథాను అనుసరించారు. నేరుగా ప్రజల్లో నుంచి కొత్త నాయకత్వాన్ని వెలికితీశారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చిన ఉన్నత విద్యావంతులు, ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న యువతకు అవకాశం కల్పించారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ.. సమాజంలోని విభిన్న వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేశారు. 1983 ఎన్నికల కోసం ఎన్టీఆర్‌ ఎంపిక చేసిన అభ్యర్థుల్లో 20 మంది వైద్యులు, 47 మంది న్యాయవాదులు, 8 మంది ఇంజినీర్లు, 28 మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్లు సహా మొత్తం 125 మంది పట్టభద్రులు ఉండటం విశేషం. రాజకీయ అనుభవం కంటే విద్య, ప్రజాసేవ పట్ల ఆసక్తి, సామాజిక ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కొత్త తరహా నాయకత్వాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్న సంప్రదాయ నాయకత్వానికి భిన్నంగా.. చదువుకున్న యువత, సామాజికంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన కొత్త ముఖాలు అసెంబ్లీ బరిలో నిలిచాయి. ‘మీలో ఒకరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాను.. గెలిపిస్తే మీ సేవకుడిగా ఉంటారు’ అనే భావనతో ఎన్టీఆర్‌ ప్రజలతో నేరుగా అనుసంధానమయ్యారు. అప్పటివరకు ధనికులు, భూస్వాములు, రాజకీయ కుటుంబాల ఆధిపత్యంతో విసిగిపోయిన సామాన్య ప్రజలకు ఈ కొత్త రాజకీయ పంథా బాగా చేరువైంది. తమలోని వారికే రాజకీయ అవకాశం కల్పిస్తున్నారన్న భావన ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. ప్రజల నుంచి నాయకత్వాన్ని తయారు చేసిన ఈ ప్రయోగమే.. 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభంజన విజయానికి మరో కీలక కారణంగా నిలిచింది.

సంక్షేమ హామీల ప్రభావం

 1983 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎన్టీఆర్ ప్రకటించిన విప్లవాత్మక సంక్షేమ పథకాలు, హామీలు బలమైన పునాదిగా నిలిచాయి. కేవలం ‘తెలుగువారి ఆత్మగౌరవం’ అనే భావోద్వేగ నినాదానికే పరిమితం కాకుండా, సామాన్యుల దైనందిన జీవితాలను నేరుగా స్పర్శించే వాగ్దానాలను ఆయన ప్రజల ముందుకు తెచ్చారు. ముఖ్యంగా రూ. 2 లకే కిలో బియ్యం పథకం పేద, మధ్యతరగతి వర్గాలను, మహిళలను విశేషంగా ఆకట్టుకోగా.. భారతదేశంలోనే తొలిసారిగా మహిళలకు తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తామన్న హామీ మహిళా ఓటర్లలో కొత్త ఆశలను రేకెత్తించింది. వీటితో పాటు రైతులకు సబ్సిడీ విద్యుత్, వ్యవసాయ రుణాల ఉపశమనం, శతాబ్దాలుగా సాగుతున్న పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం, పేదలకు రూ. 50 లకే పక్కా ఇళ్లు, సంపూర్ణ మద్యపాన నిషేధం వంటి కీలక హామీలు కాంగ్రెస్ సుదీర్ఘ పాలనపై విసిగిపోయిన ప్రజల్లో తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఈ సంక్షేమ అజెండాను ఎన్టీఆర్ తన గంభీర స్వరంతో "అధికారంలోకి రాగానే అమలు చేసి తీరుతాను" అని సభల్లో ప్రకటించడంతో, ప్రజలు ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచి టిడిపికి అఖండ జనాదేశాన్ని కట్టబెట్టారు.

కాంగ్రెస్ ఓటమికి కారణాలు అనేకం

1983 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయానికి అనేక రాజకీయ, సామాజిక పరిణామాలు కలిసి పనిచేశాయి. ప్రధానంగా ఎన్టీఆర్ గెలుపునకు, కాంగ్రెస్ ఓటమికి కారణంగా నిలిచిన అంశం ‘తెలుగు వారి ఆత్మగౌరవం’ అనే నినాదం ఒకటి.  ముఖ్యంగా తరచూ ముఖ్యమంత్రులను మార్చుతూ కాంగ్రెస్‌ హైకమాండ్‌ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్ర నాయకత్వంపై ఢిల్లీ పెత్తనం ఎక్కువైందనే భావన క్రమంగా బలపడింది. ఇది కేవలం ఎన్నికల నినాదంగా మిగలకుండా.. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన భావోద్వేగ అంశంగా మారింది. రాష్ట్ర రాజకీయాలపై ఢిల్లీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఉన్న అసహనానికి ఎన్టీఆర్‌ తన ప్రచారం ద్వారా ఒక రాజకీయ రూపం ఇచ్చి ఆత్మగౌరవం నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. తాను అధికారంలోకి వస్తే తెలుగువారి గౌరవాన్ని కాపాడుతానని హామీ ఇచ్చారు. దీనికి కాంగ్రెస్ దగ్గర సమాధానం లేకపోయింది.

మరోవైపు ఎన్టీఆర్‌ను కేవలం సినీ నటుడిగానే పరిగణిస్తూ.. ఆయన రాజకీయ ప్రభావాన్ని కాంగ్రెస్‌ నాయకత్వం తొలినాళ్లలో తక్కువగా అంచనా వేసింది. కానీ ఎన్టీఆర్‌ చైతన్యరథంపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ సంప్రదాయ రాజకీయ ప్రచారానికి పూర్తిగా భిన్నమైన శైలిని అవలంబించారు. ఈ ప్రచార వేగాన్ని, ప్రజల్లో ఆయనకు లభిస్తున్న ఆదరణను కాంగ్రెస్‌ సమర్థంగా ఎదుర్కోలేకపోయింది.

ఇక వరుసగా ముఖ్యమంత్రుల మార్పులు, పాలనలో అస్థిరత, అవినీతి ఆరోపణలు, పార్టీలో వర్గపోరు, అధికారం చుట్టూ ఏర్పడిన రాజకీయ సంస్కృతి వంటి అంశాలు కూడా కాంగ్రెస్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. నాయకుల సత్కారాలు, తులాభారాలు వంటి ఆడంబర కార్యక్రమాలపై విమర్శలు వెల్లువెత్తగా.. ప్రజాధనం వృథా అవుతోందనే అభిప్రాయం కూడా బలపడింది. భారీ మంత్రివర్గం, పదవుల పంపకంలో రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు కాంగ్రెస్‌ ప్రతిష్ఠను మరింత దెబ్బతీశాయి.  ధరల పెరుగుదల, పరిపాలనపై విమర్శలు, స్థానిక స్థాయిలో నాయకులపై ఉన్న వ్యతిరేకత, ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి వంటి అంశాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారాయి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీని రక్షించ లేకపోయారు.

ఈ అసంతృప్తి మొత్తాన్ని ఎన్టీఆర్‌ తన ప్రజాకేంద్రిత రాజకీయాలతో ఏకీకృతం చేయగలిగారు. ఫలితంగా కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఒకవైపు.. ఎన్టీఆర్‌పై పెరుగుతున్న ప్రజాభిమానం మరోవైపు కలిసి 1983లో తెలుగుదేశం పార్టీ విజయానికి బాటలు వేశాయి.

కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచే శక్తివంతమైన రాజకీయ పార్టీ అప్పటివరకు రాష్ట్రంలో బలంగా ఎదగలేదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఆ ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుంచారు. ప్రజలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి మాత్రమే కాకుండా.. ఎన్టీఆర్ నాయకత్వంలోని కొత్త రాజకీయ శక్తికి ఓటు వేయడానికి కూడా ముందుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై నవశకానికి నాంది

1983 నాటి సంచలనాత్మక ఎన్నికల తీర్పు కేవలం ఒక అధికార మార్పిడి మాత్రమే కాదు; అది ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై నవశకానికి నాంది పలికిన ఒక చారిత్రక పరిణామం. కాంగ్రెస్ సుదీర్ఘ ఆధిపత్యానికి స్వస్తి పలికి, సామాన్యుడిని రాజకీయాల కేంద్రబిందువుగా నిలబెట్టిన ఎన్టీఆర్ విజయం.. తెలుగువారి రాజకీయంలో 'ఎన్టీఆర్‌కు ముందు - ఎన్టీఆర్ తర్వాత' అనేంతటి చెరగని ముద్ర వేసింది. సంప్రదాయ రాజకీయ సమీకరణాలను తిరగరాస్తూ, 'ప్రజలే దేవుళ్లు - సమాజమే దేవాలయం' అనే భావనతో ఆయన సాధించిన ఈ అపూర్వ విజయం భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక మరుపురాని అధ్యాయంగా నిలిచిపోతుంది.