1994 డిసెంబరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 216 స్థానాలతో అఖండ విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆ చారిత్రాత్మక విజయం సాధించిన కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని తుఫాను చెలరేగింది. 1995 ఆగస్ట్ నెలలో చోటుచేసుకున్న సంక్షోభం కేవలం తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారంగా మాత్రమే కాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సామాజిక-రాజకీయ రూపురేఖలను శాశ్వతంగా మార్చివేసిన అతిపెద్ద రాజకీయ ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది.
ఏడాదిలోనే అనూహ్య సంక్షోభం
ఎన్టీఆర్.. మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా పూర్తి కాకముందే ఆయన ప్రభుత్వానికి అనూహ్యమైన సంక్షోభం ఎదురైంది. సొంత పార్టీలోనే ఎన్టీఆర్ నాయకత్వంపై పార్టీలో అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా లక్ష్మీపార్వతి రాజకీయ జోక్యం, ఆమె చుట్టూ ఏర్పడిన అధికార కేంద్రం, పార్టీ నిర్ణయాల్లో ఆమె ప్రభావం, ఎమ్మెల్యేలతో సంబంధాలు, ప్రభుత్వ పరిపాలనపై వచ్చిన విమర్శలు.. ఇవన్నీ అసంతృప్తికి కారణాలుగా మారాయి. చివరకు 1995 ఆగస్టులో టీడీపీ శాసనసభ్యుల్లో మెజారిటీ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా నిలబడటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంతో టీడీపీ చరిత్రలోనే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనూ ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది.
చంద్రబాబు ఎందుకు ముందుకొచ్చారు?
నారా చంద్రబాబు నాయుడు అప్పటికే టీడీపీలో కీలక నాయకుడు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లోనూ ఆయనకు బలమైన పట్టు ఏర్పడింది. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో వ్యక్తిగత సంబంధాలు, జిల్లాల వారీగా పార్టీ నాయకులతో అనుసంధానం, శాసనసభలో రాజకీయ వ్యూహాలపై అవగాహన.. ఇవన్నీ చంద్రబాబుకు బలం. 1995 సంక్షోభం ప్రారంభమైనప్పుడు ఆయన మొదట ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా బహిరంగ తిరుగుబాటు చేసిన వ్యక్తిగా కాకుండా.. పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలను ఒకచోట చేర్చిన నాయకుడిగా ముందుకు వచ్చారు.
వెన్నుపోటు’నా? ‘పార్టీని కాపాడిన తిరుగుబాటా?’
1995 ఆగస్టు పరిణామాలకు అప్పటి నుంచే రెండు భిన్నమైన రాజకీయ వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఎన్టీఆర్ అనుచరులు దీనిని ‘వెన్నుపోటు’గా అభివర్ణించారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని సొంత అల్లుడు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కలిసి పదవి నుంచి తొలగించారని వారు విమర్శించారు. మరోవైపు చంద్రబాబు వర్గం మాత్రం ఇది వ్యక్తిగత అధికారం కోసం చేసిన తిరుగుబాటు కాదని, టీడీపీని రక్షించడానికి, పార్టీ ఎమ్మెల్యేలు–ప్రభుత్వం మధ్య పెరిగిన అసంతృప్తికి పరిష్కారం చూపడానికి తప్పనిసరిగా తీసుకున్న చర్య అని వాదించింది. ఈ రెండు వాదనలు 1995 ఆగస్ట్ ఎపిసోడ్‌ను ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఘట్టాల్లో ఒకటిగా నిలబెట్టాయి.
వైస్రాయ్ హోటల్.. రాజకీయ చరిత్రలో నిలిచిపోయిన పేరు
1995 సంక్షోభంలో హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్ ఒక కీలక రాజకీయ కేంద్రంగా మారింది. హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్‌లో టీడీపీ ఎమ్మెల్యేలందరూ ఒకచోటకు చేరారు. పార్టీని, ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి నాయకత్వ మార్పు తప్పదని చంద్రబాబు నాయుడు, ఇతర సీనియర్లు స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా నిలిచిన ఎమ్మెల్యేలు అక్కడ బస చేయడంతో ఆ హోటల్ పేరు ఆగస్ట్ సంక్షోభానికి పర్యాయపదంగా మారింది. ప్రతి ఎమ్మెల్యే ఒక సంఖ్యగా మారిన ఆ రోజుల్లో వైస్రాయ్ హోటల్ చుట్టూ జరిగిన పరిణామాలు గంట గంటకూ మారుతున్న రాజకీయ సమీకరణాలకు వేదికగా నిలిచాయి. వైస్రాయ్ హోటల్ వద్దకు ఎన్టీఆర్ స్వయంగా వచ్చి ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, మెజారిటీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడి వైపే మొగ్గు చూపారు.
గవర్నర్ కృష్ణకాంత్ పాత్ర వివాదస్పదం
ఈ సంక్షోభ సందర్భంలో రాజ్‌భవన్ పాత్ర కీలకంగా మారింది. పార్టీ ఎమ్మెల్యేలు మెజారిటీ సంఖ్యలో చంద్రబాబు నాయుడికి మద్దతు ప్రకటించగా, మరోవైపు ఎన్టీఆర్ తాను సీఎం స్థానంలో ఉన్నందున అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు వెళ్తామని అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ కు సిఫార్సు చేశారు. నాటి గవర్నర్ కృష్ణకాంత్, సీఎం ఎన్టీఆర్ చేసిన అసెంబ్లీ రద్దు సిఫార్సును పక్కనబెట్టి, అసెంబ్లీలోనే ఎవరికి మెజారిటీ ఉందో తేల్చుకోవడానికి చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్ వర్గం ఈ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమని విమర్శించినప్పటికీ, కృష్ణకాంత్ శాసనసభ వేదికగానే బలపరీక్ష జరగాలనే సూత్రానికి కట్టుబడి చంద్రబాబును ఆహ్వానించారు. శాసనసభలో తనకు తగినంత సంఖ్యాబలం లేదని గుర్తించిన అనంతరం, 1995 ఆగస్ట్ 31న ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఎన్టీఆర్ కుటుంబంలో.. ఎవరు ఎటు?
ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులతో పాటు ఆయన కుమారులు నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ, కుటుంబంలోని మెజారిటీ సభ్యులు చంద్రబాబు వైపే నిలిచారు. వీరితోపాటు అశోక్ గజపతిరాజు, దేవేందర్ గౌడ్, యానమల రామకృష్ణుడు, విద్యాధరరావు వంటి కీలక సీనియర్ నేతలు సైతం ఈ మార్పునకు పూర్తి మద్దతు నిలిచారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణం
తెలుగుదేశం శాసనసభా పక్షం సమావేశమై నారా చంద్రబాబు నాయుడిని తమ నూతన నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 1995 సెప్టెంబర్ 1న నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం శాసనసభలో తన బలాన్ని నిరూపించుకుని పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
జాతీయ నాయకుల రాయబారాలు
నాటి నేషనల్ ఫ్రంట్ (National Front) కూటమికి ఎన్టీఆర్ అధ్యక్షుడిగా ఉండేవారు. దీంతో సంక్షోభ నివారణ కోసం జాతీయ నాయకులు రాయబారాలు నడిపారు. కేంద్ర రాజకీయాల్లో ప్రభావం చూపే జాతీయ నాయకులైన బిజూ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం జ్యోతిబసు, శరద్ యాదవ్ వంటి అగ్రనేతలు ఇరు వర్గాల మధ్య సంధి కుదిర్చేందుకు (మధ్యవర్తిత్వం) హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోవడం జాతీయ స్థాయి కూటమి రాజకీయంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు ఆందోళన చెందారు. అయితే ఎమ్మెల్యేల సంఖ్య చంద్రబాబు వైపే స్పష్టంగా ఉండటంతో వారి రాయబారాలు విఫలమయ్యాయి.
టీడీపీకి కొత్త దిశ
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీడీపీ రాజకీయ శైలి కూడా మారడం ప్రారంభమైంది. ఎన్టీఆర్ రాజకీయాలకు ప్రధానంగా ప్రజా సంక్షేమం, తెలుగు ఆత్మగౌరవం, వ్యక్తిగత ప్రజాదరణ వంటి అంశాలు కేంద్రంగా ఉండగా.. చంద్రబాబు నాయకత్వంలో పార్టీ పరిపాలనా సంస్కరణలు, ఆర్థిక విధానాలు, సాంకేతికత, పెట్టుబడులు, పరిపాలనా సామర్థ్యం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. దీంతో టీడీపీ ఒక కొత్త రాజకీయ దిశలోకి వెళ్లింది. అయితే ఆ మార్పునకు ఆరంభ బిందువు 1995 ఆగస్ట్ సంక్షోభం.
‘ఆగస్ట్ ఎపిసోడ్’ ఎందుకు చరిత్రలో నిలిచిపోయింది?
1995 ఆగస్టు సంక్షోభం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రత్యేకమైనది కావడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది.. ప్రజలు భారీ మెజారిటీతో ఎన్నుకున్న ముఖ్యమంత్రి తన సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో పదవి కోల్పోవడం. రెండోది.. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వ్యక్తి ముఖ్యమంత్రి సొంత అల్లుడు కావడం. మూడోది.. ఈ పరిణామం తర్వాత టీడీపీ పార్టీగా పూర్తిగా కొత్త రాజకీయ దిశలో ప్రయాణించడం. అందుకే 1995 ఆగస్టు కేవలం ఒక ‘పవర్ షిఫ్ట్’ కాదు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మలుపు.