తెలంగాణ రాష్ట్రం కోసం ఆరు దశాబ్దాల సుదీర్ఘ ఉద్యం సాగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన హామీలు నీటి ముటలుగా మారి..నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయానికి పరిష్కారం ప్రత్యేక రాష్ట్రమే సమాధానమని.. సబ్బ వర్గాలు చేస్తున్న ఉద్యమాన్ని గౌరవించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను నిజం చేసింది. రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రాలో రాజకీయంగా శూన్యమవుతామని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్ర కలను నిజం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో ఎందుకు బోల్తా పడింది? ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన క్రెడిట్‌ను రాజకీయ లబ్ధిగా ఎందుకు మలుచుకోలేకపోయింది? ఆ రాజకీయ వైఫల్యానికి వెనుక ఉన్న కారణాలేంటో వివరంగా తెలుసుకుందాం.
టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు
పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత 2014 మే నెలలో జరిగిన ఎన్నికలలో మొత్తం 119 స్థానాలకుగాను టీఆర్ఎస్ 63 స్థానాలు గెలుచుకుని తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ సీపీఐతో కలిసి పోటీ చేసినప్పటికీ 21 స్థానాలకే పరిమితమైంది. అలాగే టీడీపీ-బీజేపీ కూటమి 20 స్థానాలు (టీడీపీ 15, బీజేపీ 5), ఎంఐఎం 7, వైఎస్సార్సీపీ 3, బీఎస్పీ 2, సీపీఎం 1, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. టీఆర్ఎస్కు 34.3 శాతం, కాంగ్రెస్‌కు సుమారు 25.2 శాతం ఓట్లు వచ్చాయి.
ప్రజల మద్దతు..టీఆర్ఎస్ కే
2014 ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపడం వెనుక బలమైన రాజకీయ, భావోద్వేగ కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ప్రధానంగా ఒక రాజకీయ పరిణామంగా చూస్తే, టీఆర్ఎస్ శతాబ్ద కాలపు ఆకాంక్ష కోసం దశాబ్దానికి పైగా సాగించిన సుదీర్ఘ పోరాటాన్ని 'తెలంగాణ తెచ్చిన శక్తి'గా ప్రజలు గుర్తించారు. 2001 నుంచి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ నడిపిన సబ్బండ వర్గాల ఉద్యమం, అమరవీరుల త్యాగాలు ప్రజల మనస్సుల్లో ఆత్మాభిమానంగా నాటుకుపోయాయి. దీంతో “కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇచ్చి ఉండవచ్చు, కానీ దాన్ని తమ పోరాటాల ద్వారా సాధించుకున్నది మాత్రం టీఆర్ఎస్సే” అనే భావన బలంగా నాటుకుంది. కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారంలో 'తెలంగాణ ఇచ్చింది మేమే' అని ఎంత చెప్పుకున్నప్పటికీ, టీఆర్ఎస్ దానిని తిప్పికొడుతూ తెలంగాణ ఏర్పాటు ఢిల్లీ తీసుకున్న రాజకీయ నిర్ణయం కాదని.. ఆరు దశాబ్దాల ప్రజా ఆకాంక్షకు, సుదీర్ఘ ఉద్యమానికి దక్కిన ఫలితమని టీఆర్ఎస్ బలంగా ప్రచారం చేసింది. తెలంగాణ ప్రజల పోరాటానికి ఢిల్లీ మెడలు వంచిన విజయమిది అనే కథనాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ విషయంలో..స్వరాష్ట్ర ఆకాంక్షను నిజం చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా టీఆర్ఎస్ పార్టీకే ప్రజల్లో బలమైన మద్దతు దక్కింది.
సుదీర్ఘ జాప్యం..కాంగ్రెస్ పార్టీకే మైనస్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో జరిగిన సుదీర్ఘ జాప్యం కూడా 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారింది. 2009 డిసెంబర్లో కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. రాష్ట్రం వెంటనే ఆవిర్భవించలేదు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, రాజకీయ పార్టీలతో చర్చలు, కేంద్ర స్థాయిలో జరిగిన అనేక పరిణామాలు, చివరకు పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించడం వరకు దాదాపు ఐదేళ్ల పాటు ప్రక్రియ సాగింది. దీంతో ఉద్యమానికి మద్దతుగా ఉన్న ఒక వర్గంలో.. ‘తెలంగాణ ఏర్పాటు విషయంలో ఇంతకాలం ఎందుకు జాప్యం చేశారు?’ అనే అసంతృప్తి ఏర్పడింది. దానికితోడు అదే సమయంలో 1200 మంది ఉద్యమంలో అమరులు కావడం, అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం, మంత్రులు, నాయకులు తెలంగాణ ప్రాంతం, ఉద్యమం పట్ల వ్యవహరించిన తీరు కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసింది. ఉద్యమంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ క్రీయాశీలక పాత్రను పోషించలేదు. కొంత మంది మాత్రమే ఉద్యమానికి మద్దతిచ్చారు. ఇది కూడా ఎన్నికల్లో ప్రతికూలంగా మారింది. చివరకు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. ఈ ఆలస్యానికి కాంగ్రెస్ కూడా బాధ్యత వహించాల్సి వచ్చింది.
కేసీఆర్‌కు దీటైన నాయకుడు లేకపోవడం
2014 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ప్రధాన సవాలు కేసీఆర్‌కు దీటైన, రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపగల ఒకే ఒక్క బలమైన నాయకుడు లేకపోవడం. దశాబ్ద కాలానికి పైగా సాగిన తెలంగాణ ఉద్యమంతో కేసీఆర్ ప్రజల్లో సాధించుకున్న ప్రత్యేక గుర్తింపు, 'ఉద్యమ నాయకుడి' ఇమేజ్ ఆయనకు తిరుగులేని రాజకీయ శక్తిని ఇచ్చాయి. తెలంగాణ సాధన కోసం పోరాడిన నాయకుడిగా తనను తాను ప్రజల ముందు ప్రెజెంట్ చేసుకోవడంతోపాటు కొత్త రాష్ట్రంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చగల శక్తి టీఆర్ఎస్కే ఉందనే సందేశాన్ని బలంగా ప్రచారం చేశారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ, వారందరినీ సమన్వయం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఒకే రాజకీయ ముఖచిత్రంగా నిలబడే ఏకీకృత నాయకత్వం లోపించింది. ఈ నాయకత్వ వ్యత్యాసం, కేసీఆర్‌కు ఉన్న అపారమైన ప్రజాదరణ టీఆర్ఎస్కు ఎన్నికల్లో గణనీయమైన ప్రయోజనాన్ని కల్పించి, ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాయి.
ప్రజా వ్యతిరేకత..నాయకత్వ లేమి
2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండటం కూడా 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది. రెండు వరుస పర్యాయాలు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌పై సహజంగా ఏర్పడిన ప్రజా వ్యతిరేకతతోపాటు.. పాలన, అవినీతి ఆరోపణలు, నాయకత్వ మార్పులు, అంతర్గత వర్గపోరు వంటి అంశాలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. వైఎస్ఆర్ మరణంతో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఒకవైపు ఉద్యమాన్ని నడిపించే వ్యూహంతో టీఆర్ఎస్ దూసుకుపోతుంటే, మరోవైపు ఉద్యమాన్ని ఎదుర్కొని నిలబడే లేదా సమర్థవంతంగా సమన్వయం చేయగల ఏకీకృత నాయకత్వం కాంగ్రెస్‌లో కరువైంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ఉధృతమైన సమయంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలా.. విభజించాలా అనే విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు, విధానాల్లో వచ్చిన మార్పులు కూడా రెండు ప్రాంతాల్లోనూ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. తెలంగాణలో ఒకవైపు ‘ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు తెలంగాణ ఇచ్చారు’ అనే భావన.. పదేళ్ల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకత కలిసి తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ను కాంగ్రెస్ రాజకీయ లాభంగా మలుచుకోకుండా అడ్డుకున్న అంశాల్లో ఒకటిగా నిలిచింది.
సీఎం పీఠం కోసం ఆరాటం..పార్టీకి ప్రతికూలం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవిపై అంతర్గత చర్చలు, పోటీ మొదలవడం ఎన్నికల వేళ పార్టీకి ప్రతికూలంగా మారింది. పలువురు సీనియర్ నేతలు తమ రాజకీయ బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నించడంతో.. పార్టీ ప్రచారంలోనూ నాయకత్వంపై ఏకాభిప్రాయం లేదన్న భావన ప్రజల్లో ఏర్పడింది. కాంగ్రెస్ నేతలు తెలంగాణ పునర్ నిర్మాణం కంటే ముఖ్యమంత్రి పదవిపై లాబీయింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వినిపించాయి. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత లేకపోవడమే కాకుండా, సీనియర్ నేతలు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించడం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల యంత్రాంగాన్ని దెబ్బతీసింది. దీనికి పూర్తి భిన్నంగా టీఆర్ఎస్ ప్రచారం మొత్తం కేసీఆర్ నాయకత్వం, కొత్త తెలంగాణ నిర్మాణం చుట్టూనే సాగింది. కాంగ్రెస్‌లో ‘ఎవరు ముఖ్యమంత్రి?’ అనే ప్రశ్న ముందుకు వస్తే.. టీఆర్ఎస్లో ‘కేసీఆర్ నాయకత్వంలో కొత్త తెలంగాణను ఎలా నిర్మించాలి?’ అనే సందేశం ప్రజల్లోకి వెళ్లింది. ఈ స్పష్టమైన నాయకత్వ సందేశం టీఆర్ఎస్కు ఎన్నికల ప్రచారంలో ఒక అదనపు బలంగా మారగా.. కాంగ్రెస్‌లో కనిపించిన అంతర్గత పోటీ, నాయకత్వ అనిశ్చితి పార్టీ అవకాశాలను దెబ్బతీసిన అంశాల్లో ఒకటిగా నిలిచింది.
బలమైన వ్యూహం..ప్రణాళిక లేకపోవడం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన సమయానికి కాంగ్రెస్‌లో నియోజకవర్గాల స్థాయిలో బలమైన నేతలు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ, దాన్ని ఎన్నికల విజయంగా మలచడంలో తీవ్ర సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. ప్రతి నియోజకవర్గంలో ఆధిపత్యం కలిగిన నాయకులు ఉన్నా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని ఒకే దిశగా నడిపించే వ్యూహం గానీ, ఏకీకృత నాయకత్వ ప్రణాళిక గానీ లోపించాయి. దీనికి పూర్తి భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ అత్యంత స్పష్టమైన ప్రచార వ్యూహాన్ని అమలు చేసింది. తెలంగాణ సెంటిమెంట్ + కేసీఆర్ నాయకత్వం + కొత్త రాష్ట్ర నిర్మాణం పునర్నిర్మాణ అజెండాను ప్రధానాంశాలుగా చేసుకుని ప్రచారాన్ని కేంద్రీకరించింది. ఫలితంగా, కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాలు, సమన్వయాభావం ఆ పార్టీని దెబ్బతీస్తే.. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ రూపొందించిన పక్కా వ్యూహం ప్రజలను ఆకట్టుకుని ఆ పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని అందించింది.
యూపీఏ పాలనపై ప్రతికూలత కూడా
2014 నాటి సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభకు కూడా ఒకేసారి జరిగాయి. ఆ సమయానికి కేంద్రంలోని పదేళ్ల యూపీఏ పాలనపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో నెలకొంది. పెరిగిన నిత్యావసర ధరలు, బొగ్గు, 2జీ వంటి వరుస అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ ప్రతిష్టను బాగా దెబ్బతీశాయి. దీనికి తోడు జాతీయ స్థాయిలో మోదీ అనుకూల గాలి వీచడం కూడా ప్రతికూల వాతావరణాన్ని పెంచింది. ఈ పరిణామాల వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు స్థానికంగా దక్కాల్సిన రాజకీయ లబ్ధి, జాతీయ స్థాయి కాంగ్రెస్ వ్యతిరేక పవనాల్లో కొట్టుకుపోయింది. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌కు ఓట్లు పడకుండా అడ్డుకుంది.
కాంగ్రెస్ ఎక్కడ పొరబడింది?
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ 2014లో ఎక్కడ పొరబడింది? కాంగ్రెస్ చేసిన ప్రధాన రాజకీయ పొరపాటు తెలంగాణ ఏర్పాటును కేవలం ఒక పరిపాలనాపరమైన నిర్ణయంగా చూపించడమే తప్ప, దాన్ని ప్రజా ఉద్యమానికి లభించిన ఒక చారిత్రక ఘట్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం. నిజానికి 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు కొన్ని కీలక అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ బిల్లు ఆమోదం తర్వాత రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పోషించిన పాత్రను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడం, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు పోషించిన పాత్రను ప్రజలకు గుర్తుచేయడం, పార్టీకి ఒకే బలమైన నాయకత్వాన్ని ముందుకు తేవడం వంటి చర్యలు రాజకీయంగా ఉపయోగపడేవి. కొత్త రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర–రాష్ట్ర స్థాయిలో స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ప్రజల ముందుంచడం కూడా కాంగ్రెస్ అవకాశాలను పెంచేవి. కానీ ఈ అవకాశాలన్నింటినీ కలిపి ఒక బలమైన రాజకీయ వ్యూహంగా మలచడంలో కాంగ్రెస్ విఫలమవ్వడమే ఆ పార్టీ పరాజయానికి ప్రధాన కారణమైంది.
చారిత్రక నిర్ణయం తీసుకోవడం వేరు..దానికి మద్దతును సాధించడం వేరు
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన చట్టపరమైన, పార్లమెంటరీ ప్రక్రియను పూర్తి చేసి.. ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసింది. కానీ ఆ చారిత్రక నిర్ణయాన్ని ప్రజల మనసుల్లో రాజకీయ విజయంగా మలచుకోవడంలో మాత్రం విఫలమైంది. మరోవైపు టీఆర్ఎస్.. తెలంగాణ ఉద్యమంతో ఏర్పడిన భావోద్వేగాన్ని ఎన్నికల రాజకీయంగా సమర్థంగా ఉపయోగించుకుంది. ‘తెలంగాణ సాధన కోసం పోరాడిన నాయకత్వమే.. ఇప్పుడు కొత్త రాష్ట్రాన్ని నిర్మించాలి’ అనే సందేశాన్ని ప్రజల్లో బలంగా నాటింది. అందుకే 2014 తీర్పును కేవలం ‘తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది?’ అనే ప్రశ్నతో మాత్రమే చూడటం సరిపోదు. ఒక చారిత్రక నిర్ణయం తీసుకోవడం వేరు.. ఆ నిర్ణయానికి ప్రజల రాజకీయ మద్దతును సంపాదించడం వేరు. 2014 ఎన్నికలు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపించిన కీలక రాజకీయ పాఠంగా నిలిచిపోయాయి.