తెలంగాణ

జీలానీ బానో పేరుతో బుక్ ఫెయిర్ ప్రాంగణం.. డిసెంబర్ 18 నుంచి పుస్తకాల పండుగ!

పుస్తక ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు తేదీలు ఖరారయ్యాయి. 39వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ డిసెంబర్ 18 నుంచి 28 వరకు ఇందిరా పార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు.

Phaneendra

ప్రభాత ఉదయం, ముషీరాబాద్ : పుస్తక ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు తేదీలు ఖరారయ్యాయి. 39వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ డిసెంబర్ 18 నుంచి 28 వరకు ఇందిరా పార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈసారి సుమారు 320 పుస్తక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో ఈ ప్రదర్శన జరగనుంది. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బుక్ ఫెయిర్ లోగోను సీనియర్ ఎడిటర్ కె. రామచంద్రమూర్తి, విశ్రాంత ప్రొఫెసర్ రామా మెల్కోటే, కవి యాకూబ్, వైస్ ప్రెసిడెంట్ బాల్‌రెడ్డి ఆవిష్కరించారు. నవంబర్ 14వ తేదీలోగా స్టాళ్ల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ పూర్తవుతుందని నిర్వాహకులు తెలిపారు.

ప్రముఖ సాహితీవేత్తల పేర్లు

బుక్ ఫెయిర్ ప్రాంగణానికి ప్రముఖ ఉర్దూ రచయిత్రి జీలానీ బానో పేరు పెట్టారు. సాహిత్య వేదికకు రచయిత, అనువాదకుడు ముక్తవరం పార్థసారథి, పుస్తకావిష్కరణ వేదికకు దళిత హక్కుల కార్యకర్త, రచయిత డాక్టర్ వై.బి. సత్యనారాయణ పేర్లను ఖరారు చేశారు. ఇతర వేదికలకు సదానంద శారద, ఏటుకూరి ప్రసాద్ పేర్లను, రైటర్స్ స్టాల్స్‌కు తెలిదేవర భానుమూర్తి పేరును నిర్ణయించారు.

బాలలకు ప్రత్యేక కార్యక్రమాలు

ఈసారి బుక్ ఫెయిర్‌లో సుమారు 320 పుస్తక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ డిజైన్‌ను కూడా సిద్ధం చేశారు. బాలల కోసం నిర్వహించే కార్యక్రమాలకు నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌బీటీ) సహకారం అందించనుంది. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో భాగస్వామ్యం కావాలని కోరుతూ తెలంగాణ సాహిత్య అకాడమీకి ఆహ్వానం పంపినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు శోభన్‌బాబు, కోశాధికారి కె. సురేష్, సంయుక్త కార్యదర్శి రజని, కార్యవర్గ సభ్యురాలు సజయ తదితరులు పాల్గొన్నారు.