ప్రభాత ఉదయం, ఖైరతాబాద్ : పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు చేపట్టిన తనిఖీలు కొనసాగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 2014 నుంచి ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి, అక్రమాలను వెలికితీసేందుకు అధికారులు పాత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఇటీవల అవినీతి కేసులో అరెస్టయిన అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ వ్యవహారంలో వెలుగుచూసిన అంశాల నేపథ్యంలో ఏసీబీ విచారణను విస్తరించినట్లు తెలుస్తోంది. ఆమె వెల్లడించిన వివరాలు, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకొని ఆస్పత్రిలోని మరిన్ని విభాగాల్లో అక్రమాలు జరిగాయా? ఎంతమేర ప్రజాధనం దుర్వినియోగమైంది? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.
క్యాంటీన్, సెక్యూరిటీ, మెడికల్ షాపులపై దృష్టి
గురువారం ఏసీబీ అధికారులు క్యాంటీన్, సెక్యూరిటీ, మెడికల్ షాప్, సర్జికల్ విభాగాలకు సంబంధించిన కాంట్రాక్టులపై ప్రధానంగా దృష్టి సారించారు. టెండర్ల ఆహ్వానం నుంచి కాంట్రాక్టుల కేటాయింపు వరకు అనుసరించిన విధానాలను పరిశీలిస్తున్నారు. టెండర్ నిబంధనలు, బిడ్డర్ల అర్హతలు, బిడ్ల పరిశీలన, కాంట్రాక్టుల ఖరారుకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఆస్పత్రిలోని క్యాంటీన్లో తనిఖీలు నిర్వహించారు.
16 ఏళ్లుగా ఒకే క్యాంటీన్.. నిర్వహణపై అనుమానాలు!
నిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలోని తాజ్ బెల్సన్ క్యాంటీన్ నిర్వహణపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 16 ఏళ్లుగా ఈ క్యాంటీన్ కొనసాగుతున్నట్లు సమాచారం. సాధారణంగా నిర్ణీత వ్యవధి తర్వాత టెండర్లు పిలిచి కొత్త సంస్థలకు అవకాశం కల్పించాల్సి ఉండగా, క్యాంటీన్ నిర్వహణ విషయంలో ఆ ప్రక్రియ సక్రమంగా అమలవుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు ఒకరి పేరుతో ఉండగా, నిర్వహణ బాధ్యతలు మరొకరు చేపడుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు భిన్నంగా రోగులు, వారి సహాయకుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
40 ఏళ్లుగా కొనసాగుతున్న అన్నపూర్ణ క్యాంటీన్!
నిమ్స్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ కూడా సుమారు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్యాంటీన్ ద్వారా ఆస్పత్రికి రావాల్సిన ఆదాయం పూర్తిస్థాయిలో సమకూరుతోందా? నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలు, చెల్లింపులు నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నామమాత్రపు రుసుములతోనే క్యాంటీన్ నిర్వహణకు అనుమతులు కొనసాగుతున్నాయనే ఆరోపణలపై కూడా విచారణ జరగాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
రికార్డుల పరిశీలనతో బయటపడనున్న వాస్తవాలు?
నిమ్స్‌లోని వివిధ విభాగాల కాంట్రాక్టులు, క్యాంటీన్ల నిర్వహణ, టెండర్ల ప్రక్రియపై ఏసీబీ చేపట్టిన తనిఖీలతో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రికార్డుల పరిశీలనలో అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశముంది. ఏళ్లుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారాలపై ఏసీబీ విచారణ ఎలాంటి వాస్తవాలను బయటపెడుతుందోనని ఆస్పత్రి వర్గాలు, రోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.