ప్రభాత ఉదయం, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం వస్తున్నా, తెలంగాణకు బకాయీల విడుదలలో జాప్యం చేస్తుండటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్రం నుంచి విడుదల కావాల్సిన బకాయీలు రూ.34,149 కోట్లకు చేరడమనేది, మోదీ సర్కారు వివక్షకు నిదర్శనంగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికార వర్గాలు అంటున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కానీ బకాయీల వసూలులో నిర్లక్ష్యమెందుకు వహిస్తున్నారో అంతుచిక్కడం లేదనే విమర్శలున్నాయి. ఏటా ఈ బకాయీల కోసం రాష్ట్ర సర్కారు లేఖలు రాస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడంతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతున్నది.
జీఎస్టీ ఆదాయాల వెల్లువ
జీఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఈ ఏడాది అక్టోబర్‌లో రికార్డుస్థాయిలో రూ.2.31 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. జీఎస్టీ ఆదాయం 2025 అక్టోబర్‌తో పోలిస్తే ఈసారి 22.9 శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌లోనూ అత్యధికంగా రూ.2.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. వరుసగా నాలుగో నెల కూడా జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటాయి. ఇక అన్నిరకాల మార్గాల నుంచి కేంద్ర ఖజానాకు 2026-27 ఆర్థిక సంవత్సరం చివరికల్లా (2027 మార్చి 31 నాటికి) రికార్డు స్థాయిలో రూ.54 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక శాఖే అంచనా వేస్తోంది.
ఆదాయమున్నా.. బకాయీలు ఇవ్వట్లే?
కేంద్ర సర్కారు ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ, తెలంగాణకు గ్రాంట్ల రూపంలో ఇవ్వాల్సిన రూ.34,149.71 కోట్లను విడుదల చేయడానికి చొరవ చూపడం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు. రాష్ట్ర సర్కారు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో ఆదుకోవడానికి ముందుకు రాకపోయినా కనీసం బకాయీలనైనా కేంద్రం విడుదల చేస్తే బాగుంటుందని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం బకాయీలను వసూలు చేసుకునేందుకు పెద్దగా ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవని ఆర్థిక శాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి కూడా అయిన మల్లు భట్టి విక్రమార్క న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన సమయంలో ఏదో మొక్కుబడిగా తెలంగాణకు రావాల్సిన బకాయీల గురించి ప్రస్తావించారే తప్ప, గట్టిగా అడగలేదని ఆ అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు, పట్టణ స్థానిక సంస్థలకు గ్రాంట్ల రూపంలో ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా పాత బకాయిల జాబితాలో చేర్చి ఫైల్‌ను కేంద్ర ఆర్థిక శాఖ పక్కన పడేసిందని వారు చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత గత ఏడాది మాత్రమే స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేశారని, బీఆర్ఎస్ హయాంలోనైతే ఈ ఫండ్స్ రిలీజ్ చేయలేదని పేర్కొన్నారు.
ఏపీ ఖాతాలో పడిన నిధులూ దక్కకపాయె
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.495.20 కోట్లు, కేంద్ర ఆర్థికశాఖ చేసిన పొరపాటు వల్ల ఏపీ ఖాతాలో జమయ్యాయి. ఆ నిధులనూ కేంద్రం తెలంగాణకు ఇవ్వలేదని అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వభజన చట్టం ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంవత్సరానికి రూ.450 కోట్ల గ్రాంట్ చొప్పున కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. 2020 నుంచి 2024 వరకు ఐదేళ్లకు కలిపి రూ.2,250 కోట్లు విలువైన ఈ గ్రాంట్ నిధులూ బకాయీ జాబితాలోనే ఉండిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఆ సిఫారసులనూ పట్టించుకోని కేంద్రం
14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.315.32 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.502.61 కోట్లను గ్రాంట్ రూపంలో కేంద్రం ఇవ్వాల్సి ఉందని ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు పన్నుల వాటాలో తెలంగాణకు ఇవ్వాల్సిన పాత బకాయీలు రూ.723 కోట్ల దాకా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ న్యూట్రిషన్ విభాగానికి మరో రూ.171 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇంకొన్ని రంగాలకు కేంద్రం ఇవ్వాల్సిన రూ.3,024 కోట్ల గ్రాంట్లు 2022 నుంచి కేంద్రం పెండింగ్‌లో పెట్టిందని చెప్పారు. మిషన్ భగీరథ పథకానికి ఇవ్వాల్సిన రూ.2350 కోట్లకూ అతీగతీ లేకుండాపోయిందని అధికార వర్గాలు వాపోతున్నాయి. మిషన్ భగీరథకు రూ.19,295 కోట్లను, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లను గ్రాంటుగా ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా, ఒక్క రూపాయినీ విదిల్చలేదని గుర్తు చేస్తున్నారు.