ప్రభాత ఉదయం, ఆదిలాబాదు ప్రతినిధి: పేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయి విద్యనందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేడ్ పాఠశాలల నిర్మాణానికి పూనుకుంది. ఇందుకు సంబంధించిన పనులు ఆదిలాబాద్ జిల్లాలో నత్తనడకన కొనసాగుతున్నాయి. జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు మూడు పాఠశాలలు కేటాయించి ఒక్కో దానికి రూ.200 కోట్ల చొప్పున మంజూరు చేశారు. ఏడాదిన్నరలో భవన నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. బోథ్‌లో ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తవగా ఆదిలాబాద్, పులిమడుగులో నిర్మాణాలు పునాదులకే పరిమితమయ్యాయి. ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే పేదల విద్యార్థులకు మేలు చేకూరడంతో పాటు ప్రభుత్వ లక్ష్యం నెరవేనుంది.
గురుకులాలకు భిన్నంగా..
గత ప్రభుత్వం గురుకులాల నిర్మాణాలకు పెద్దపీట వేసింది. గత సర్కార్ మాదిరిగానే సామాజిక వర్గాల వారీగా మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి భిన్నంగా సమీకృత గురుకులాల పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన విద్యార్థులంతా ఒకే దగ్గర కలిసి చదువుకునేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఆదిలాబాద్ నియోజకవర్గం జైనథ్ మండలం బెలగామ్, బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ సమీపంలోని అడెగామ, ఖానాపూర్‌లో ఉట్నూర్ మండల పులిమడుగులో ఏర్పాటు చేస్తోంది. ఈ విషయమై టీఎస్ఎంఐడీసీ ఈఈ రవీందర్‌ను వివరణ కోరగా జిల్లాలో ‘ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు ప్రారంభమయ్యాయి. బోథ్‌లో టెండర్ పూర్తయింది. పనులు వేగిరం చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.’ అన్నారు.
వేగం పెంచితే ప్రయోజనం
ప్రభుత్వం పాఠశాలల నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించింది. ఈ పనులు ప్రారంభించి మూడు నెలలు పూర్తయింది. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా పూర్తి కావడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పనులు ఇలాగే కొనసాగితే వచ్చే విద్యా సంవత్సరంలోపు అందుబాటులోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఉన్నతాధికారులు దృష్టి సారించి పనుల్లో వేగం పెంచితే పేద విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది.