ప్రభాత ఉదయం, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి: పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు పౌష్టికాహారంగా భావించే పాలు కాలకూట విషంగా మారుతున్నాయి. దీపావళి పండుగ వేళ ఇంటిల్లిపాదీ తీపి రుచులతో ఆనందంగా గడపాలనుకుంటే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో దశాబ్దాలుగా పేరొందిన ప్రసిద్ధ స్వీట్ షాపుల్లోనూ కల్తీ దందాలు బట్టబయలవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం దాదాపు 30 లక్షల లీటర్ల పాల డిమాండ్ ఉంది. అయితే, ఎల్‌నినో ప్రభావం, పశుగ్రాసం తీవ్ర కొరత కారణంగా పాల ఉత్పత్తి కేవలం 4 లక్షల లీటర్లకు పడిపోయింది. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో అక్రమార్కులు ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. హానికర రసాయనాలతో కృత్రిమంగా కల్తీ పాలను తయారుచేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
కల్తీకి అడ్డాలుగా శివారు ప్రాంతాలు
గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలు కల్తీ పాలకు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. పాలు చిక్కగా, తెల్లగా నురగలు వచ్చేందుకు, అలాగే రెండు మూడు రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉండేందుకు రసాయనాలు వాడుతున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, నకిలీ పాలపొడి, యూరియా, డిటర్జెంట్లు తదితర హానికర పదార్థాలను కలిపి మార్కెట్లోకి తరలిస్తున్నారు. ఈ కల్తీ పాలను తాగిన ప్రజలు తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులు, కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు.
కల్తీ పాలతో స్వీట్
ఇటీవల ‘టీజీ సేఫ్’ అధికారులు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రముఖ మిఠాయి దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలలో నకిలీ నెయ్యి, చీజ్, పన్నీర్, కల్తీ పాలను ఉపయోగించి మిఠాయిలు తయారు చేస్తున్న బండారం బయటపడింది. స్వీట్లు తయారు చేసే కిచెన్లలో ఎలుకలు, బొద్దింకలు స్వైర విహారం చేయడం, ఎటు చూసినా చెత్తాచెదారం పోగుపడి ఉండటం వంటి దారుణమైన అపరిశుభ్ర పరిస్థితులు వెలుగుచూశాయి. మొత్తం సుమారు 30 దుకాణాల్లో ఈ అక్రమాలు బయటపడగా, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన 16 దుకాణాల లైసెన్సులను అధికారులు తక్షణమే రద్దు చేశారు. మిగిలిన దుకాణాలకు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. పండుగ వేళ వెలుగు చూసిన ఈ సంఘటనలతో ‘తెల్లనివన్నీ పాలు కాదన్న’ నానుడి అక్షరాలా నిజమవుతోంది.
ఇబ్రహీంపట్నంలో 100 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం
ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోచారం గ్రామంలో శుక్రవారం మహేశ్వరం జోన్ ఎస్వోటీ పోలీసులు కల్తీ పాల తయారీ కేంద్రంపై దాడిచేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పోచారం గ్రామానికి చెందిన పాల వ్యాపారి అండె శ్రీశైలం పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్, ధోల్పూర్ పాలపొడి కలిపి కల్తీ చేసి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోని వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా ఘటనా స్థలంలో 100 లీటర్ల కల్తీ పాలు, లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్, కిలో చొప్పున ఉన్న 35 పాలపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.
లైసెన్సులు రద్దయిన స్వీట్ షాపులు ..
ఎం/ఎస్ అభిరుచి స్వగృహ ఫుడ్స్, సనత్‌నగర్, హైదరాబాద్
ఎం/ఎస్ భారత్ బక్లావా, సనత్‌నగర్, హైదరాబాద్
శ్రీ షగున్ మిఠాయి వాటిక, హిమాయత్‌నగర్
ఆగ్రా మిఠాయి ఘర్ రెస్టారెంట్, చార్మినార్, చార్‌కమాన్
బాలాజీ స్వీట్స్, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, చంపాపేట్
కరాచీ బేకరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, తిమ్మాపూర్, రంగారెడ్డి జిల్లా
ఎం/ఎస్ మమత స్వీట్ హౌస్, పీజీ రోడ్, సికింద్రాబాద్
ఎం/ఎస్ ఎస్కే ఫుడ్స్, బృందావన్ కాలనీ, లక్ష్మీగూడ, కాటేదాన్
జి. పుల్లారెడ్డి స్వీట్స్, సనత్‌నగర్
స్వీటోన్ రుచులు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వనస్థలిపురం
ఎం/ఎస్ బాలాజీ శ్రీ కిషన్ మిఠాయి భండార్, షంషీర్గంజ్, ఫలక్‌నుమా
పోత్గాల్ స్వగృహ ఫుడ్స్, బహదూర్‌గూడ, సరూర్‌నగర్
ఎం/ఎస్ హమీదీ కన్ఫెక్షనరీస్, ఎంజే మార్కెట్
అన్నపూర్ణ క్యాటరర్స్, చుడీ బజార్, హైదరాబాద్
దాదూస్, దోమల్‌గూడ
హిరాణీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (మినర్వా స్వీట్స్), కాటేదాన్