తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ 
తెలంగాణ

జయేశ్ రంజన్ పై విజి‘లెన్స్’!

జయేశ్ రంజన్​ ప్రభుత్వ అనుమతి లేకుండానే 176 సార్లు విదేశీ పర్యటనలు చేసిన విషయం కేంద్ర విజిలెన్స్​ కమిషన్​ (సీవీసీ) గమనంలో ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్:

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్​ రంజన్​ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేస్తారనే ప్రచారం తెలంగాణ బ్యూరోక్రసీలో హాట్​ టాపిక్​గా మారింది. ఆయన వీఆర్ఎస్ ఆలోచన వెనుక చాలా అంశాలే దాగి ఉన్నాయన్న చర్చ సాగుతున్నది. జయేశ్​ ప్రభుత్వ అనుమతి లేకుండానే 176 సార్లు విదేశీ పర్యటనలు చేసిన విషయం కేంద్ర విజిలెన్స్​ కమిషన్​ (సీవీసీ) గమనంలో ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. అది కూడా కొచ్చి విమానాశ్రయం నుంచే అత్యధిక సందర్భాల్లో విదేశాలకు వెళ్లిన సమాచారం కూడా సీవీసీ దగ్గర ఉందని తెలుస్తున్నది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీవీసీ అప్రమత్తం చేసిందని అంటున్నారు. సీవీసీ అలర్ట్​ చేయడంతోనే సీఎం రేవంత్​ రెడ్డి ఆయనను ప్రధాన కార్యదర్శి పదవికి దూరం పెట్టారని చెబుతున్నారు. సీఎంతో సంబంధం లేకుండా భూ మార్పిడి ఫైళ్లను స్పీడ్​గా ఆమోదించారని సీఎంవోలోని ఓ అధికారి గుర్తించారు. గంపగుత్తగా ఎలా ఆమోదం తెలిపారని ఆయన ఆరా తీయగా.. ‘జూనియర్​ ఆఫీసర్​గా నీ పరిధి తెలుసుకో’ అంటూ హుంకరించినట్లు హై సర్కిల్​లో చర్చ జరుగుతోంది. అయితే జూనియర్​ అధికారి తనను ప్రశ్నించినా, సీఎం, సీఎస్​ జోక్యం చేసుకోకపోవడంతో జయేశ్​ ఇబ్బంది పడ్డారని సమాచారం. దానికి తోడు తాను చేసిన తప్పులు ఎప్పటికైనా తన మెడకు చుట్టుకుంటాయని, విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని ముందుగానే పసిగట్టిన జయేశ్​ రంజన్​ వీఆర్ఎస్​ అస్త్రాన్ని బయటకు తీశారని బ్యూరోక్రసీలో చర్చ జరుగుతోంది.

మలుపులు తిరుగుతున్న వ్యవహారం..

1992 బ్యాచ్​కు చెందిన జయేశ్​ రంజన్​ వ్యవహారం మూడు రోజులుగా అనేక మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్​ సర్కారు సీనియర్​ ఐఏఎస్​ను అవమానిస్తోందని బీఆర్ఎస్​ నేతలు విమర్శలు  చేస్తున్నారు. ఎంతగానో ఆశలు పెట్టుకున్న ప్రధాన కార్యదర్శి పదవి దక్కకపోవడం, మున్సిపల్​ శాఖలో అంతగా పని లేకపోవడం వంటి పరిణమాలతో వీఆర్ఎస్​కు దరఖాస్తు చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఐటీ కంపెనీలో పెద్ద పదవి లభించడంతో ప్రభుత్వ సర్వీస్​కు గుడ్​ బై చెబుతున్నారనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. ఈ ప్రచారాన్ని పక్కనపెడితే అసలు విషయం వేరే ఉందని తెలంగాణ సచివాలయం హై సర్కిల్స్​లో చర్చించుకుంటున్నారు. గత 13 ఏళ్లుగా జయేశ్​ రంజన్​ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్​ హయాంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖలను పర్యవేక్షించారు. అప్పటి మంత్రి కేటీఆర్​తో కలిసి వ్యవహారాలను చక్కబెట్టారు. ఈ మూడు శాఖలను కంటి చూపుతో శాసించారని అంటుంటారు. ఆయన అనుమతి లేకుండా కేటీఆర్​ వద్ద కీలకమైన ప్రాజెక్టులకు అనుమతులు లభించేవి కాదనేది జగమెరిగిన సత్యం. పెట్టుబడుల పేరుతో విదేశాలకు చుట్టి వచ్చిన తరువాత ఒక సందర్భంలో సీఎం క్యాంప్​ ఆఫీస్​లో కేసీఆర్​ను కలిశారు. విదేశాల నుంచి పలువురు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని కేసీఆర్​కు చెప్పగా, ‘మీరు వెళ్లేది పెట్టుబడుల కోసం కాదు. మరో పని కోసం వెళ్తున్నారు’.. అంటూ చురకలు అంటించారనే ప్రచారం జరిగింది. కేటీఆర్, జయేశ్​ రంజన్​ విదేశీ పర్యటనలపై కేసీఆర్​కు కేటీఆర్​ భార్య శైలిమ ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్​ ముఖ్య నాయకులు సైతం చర్చించుకున్నారు. కేటీఆర్​ ఒత్తిడితోనే పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగించారని బీఆర్ఎస్ వర్గాలే ధృవీకరించాయి. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్​ రెడ్డి సైతం జయేశ్​ రంజన్​కు ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన తనవద్దే పెట్టుకొని మెట్రో పాలిటన్​ ఏరియా అండ్​ అర్బన్​ డెవలప్​మెంట్​ శాఖ అప్పగించారు.

గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు..

ఏ సీనియర్​ ఐఏఎస్​ ఆఫీసర్​ పర్యటించని విధంగా జయేశ్​ రంజన్​ 176 సార్లు విదేశాలు చుట్టి వచ్చారని అంటున్నారు. సాధారణంగా సర్వీస్​ అధికారులు విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్​ నుంచి నేరుగా విదేశాలకు వెళ్లేందుకు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి. సీట్లు దొరకక పోతే ఢిల్లీ నుంచి వెళ్లవచ్చు. అయితే జయేశ్​ మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా కేరళం రాష్ట్రం కొచ్చిన్​ నుంచి విదేశాలకు వెళ్లి వచ్చారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా లేకుండానే ఏ ధైర్యంతో ఇలా చేశారనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఈ విదేశీ పర్యటనల వ్యవహారం కేంద్ర విజిలెన్స్​ కమిషన్​ దృష్టికి వెళ్లగా, రంగంలోకి దిగిన సీవీసీ... కొచ్చిన్​ విమానాశ్రయం నుంచి సీసీటీవీ పుటేజీలు తెప్పించి పరిశీలించిందని సమాచారం. కొచ్చిన్​ నుంచి దుబాయ్​, లండన్​ నగరాలకు జయేశ్​ వెళ్లినట్లు వెల్లడైంది. సీవీసీ అధికారులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అప్రమత్తం చేశారు. ఈ పర్యటనలకు అనుమతులు ఇచ్చారా? అనుమతులు ఇస్తే వివరాలు తెలియచేయాలని కోరారు. దీంతో జయేశ్​ రంజన్​.. జనరల్​ విమానాల్లో ప్రయాణించారా? లేదంటే చార్టర్​ ఫ్లైట్​లో వెళ్లారా? అనేది తెలుసుకునే పనిలో రాష్ట్ర అధికారులు ఉన్నారు.

ప్రభుత్వాన్ని బద్​నాం చేసేలా ప్రచారం

కొద్ది రోజుల కింద సీఎం రేవంత్​ రెడ్డిని భూ మార్పిడి ఫైళ్ల వ్యవహారంలో సీఎంవో అధికారి ఒకరు అప్రమత్తం చేశారు. ‘మీ అనుమతి లేకుండానే భూ మార్పిడి ఫైళ్లకు అనుమతులు ఇచ్చారని, ఇందులో ఏదో మతలబు ఉంది.’ అని తెలిపారు. ఇదే విషయాన్ని సదరు అధికారి జయేశ్​ వద్ద ప్రస్తావించగా, సర్వీసులో జూనియర్​వి నన్నే ప్రశ్నిస్తావా? అని సీరియస్​ అయ్యారు. అయితే సీవీసీ విదేశీ పర్యటనలపై ఆరా తీయడం, భూ మార్పిడి ఫైళ్ల క్లియరెన్స్​పై విచారణ చేపట్టే అవకాశం ఉండడంతో జయేశ్​ రంజన్​ తన వ్యూహానికి పదును పెట్టారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే వీఆర్ఎస్​ తీసుకుంటున్నట్లు ప్రచారం ప్రారంభించారని అంటున్నారు. వీఆర్ఎస్​ తీసుకున్నాక సీవీసీ విచారణకు ప్రాధాన్యం ఉండదనే ముందు చూపుతో స్వచ్ఛంద పదవీ విరమణ డ్రామా మొదలుపెట్టారని చెబుతున్నారు.