ప్రభాత ఉదయం, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌ను గద్దె దించాలని, అందుకు బీజేపీ కార్యకర్తలంతా సకల్పం తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకత్వాన్ని అంతం చేద్దాం’ పేరుతో నిర్వహించిన మహా పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియం వద్దనున్న బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర నుంచి మొజాంజాహీ మార్కెట్ వరకు కొనసాగిన ఈ మహా పాదయాత్రలో వేలాది మంది కార్యకర్తలకు అభివాదం చేస్తూ అమిత్ షా ముందుకు నడిచారు. ఎంజే మార్కెట్ సమీపంలో ఉన్న ట్రూప్ బజార్ చౌరస్తా వరకు పాదయాత్ర కొనసాగింది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణలో కాంగ్రెస్ అరాచక సర్కారును కూకటివేళ్లతో పెకలించి బీజేపీని గెలిపించాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకునే సత్తా బీఆర్ఎస్, ఎంఐఎంలకు లేదని.. కాంగ్రెస్ అవినీతిపై పోరాడి ప్రజలకు న్యాయం చేసే ఏకైక శక్తి భారతీయ జనతా పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సాగనంపి, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కార్యకర్తలు సమరశంఖం పూరించాలన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.
ప్రజల సొమ్ముతో ఢిల్లీకి మూటలు
తెలంగాణను రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మార్చాడని అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో నిస్సిగ్గుగా ‘ఆర్ఆర్ ట్యాక్స్’ (రాహుల్-రేవంత్ ట్యాక్స్) వసూలు చేస్తున్నారని, ప్రజల సొమ్మును దోచుకుని ఢిల్లీ కాంగ్రెస్‌కు మూటలు పంపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన గ్యారెంటీలు అమలుకావడం లేదని అన్నారు. పదేళ్ల యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన చరిత్ర కాంగ్రెస్‌దని నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోదీ పన్నెండేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా దేశాన్ని అగ్రపథాన నడిపిస్తున్నారని కొనియాడారు.
రాహుల్.. మాక్ పార్లమెంట్‌కే పరిమితం
మాక్ పార్లమెంట్లో తప్ప రాహుల్ గాంధీ ఎప్పటికీ దేశానికి ప్రధాని కాలేరని అమిత్ షా ఎద్దేవా చేశారు. ‘ఎస్ఐఆర్’ వల్లే బీజేపీ గెలుస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. 2014, 2019లో ఎస్ఐఆర్ లేకుండానే దేశ ప్రజలు నరేంద్ర మోదీకి సంపూర్ణ మెజారిటీ ఇచ్చారని గుర్తుచేశారు. 2024 తర్వాత హర్యానా, మహారాష్ట్రలో భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఈవీఎంల వల్ల బీజేపీ గెలుస్తోందని కాంగ్రెస్ నమ్మించడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజాస్వామ్యం, ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టా? అని ప్రశ్నించారు. ‘ఈవీఎంలే బీజేపీ గెలుపునకు కారణమైతే తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచింది? తమిళనాడు, కేరళలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఎలా ఏర్పడ్డాయి?”అని ప్రశ్నించారు. ‘‘ఎస్ఐఆర్, ఈవీఎంలపై చర్చకు మేం సిద్ధం. కాంగ్రెస్ ఈ చర్చకు ఎందుకు ముందుకు రావడం లేదు?’ అని అమిత్‌షా నిలదీశారు.
కాంగ్రెస్‌ది చొరబాటుదారులను కాపాడే ర్యాలీ
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీపై అమిత్‌షా స్పందిస్తూ.. అది ‘ఓట్ బచావో’ ర్యాలీ కాదని, పచ్చిగా ‘చొరబాటుదారులను కాపాడే (ఘుస్పైఠియా బచావో) ర్యాలీ’ అని విమర్శించారు. దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించారని రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ 13 కోట్లలో దాదాపు 6.5 కోట్ల ఓట్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారివన్నారు. ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు వేసే హక్కు ఉంటుందా? అని ప్రశ్నించారు. ‘తొలగించిన ఓట్లలో దాదాపు 3 కోట్ల మంది చనిపోయిన వారున్నారు. చనిపోయిన వారి పేరిట కాంగ్రెస్ బోగస్ ఓటింగ్ చేయాలని చూస్తోంది. మరో కోటి ఓట్లు డూప్లికేట్ ఎంట్రీలు ఉన్నాయి. మిగిలిన 3 కోట్ల ఓట్లు దేశంలో ఉనికిలోనే లేని బంగ్లాదేశ్ చొరబాటుదారులవి. ఈ నకిలీ, చొరబాటుదారుల ఓట్లను కాపాడేందుకే రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతున్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎంత శ్రమించినా, ఈ దేశంలో ఒక్క బంగ్లాదేశ్ చొరబాటుదారుడిని ఓటర్ల జాబితాలో ఉండనివ్వం. దేశం నుంచి వారిని వెళ్లగొట్టి తీరుతాం. కేవలం దేశ పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది’ అని అమిత్ షా తేల్చి చెప్పారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, గోడం నగేశ్, రఘునందన్ రావు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.