తెలంగాణ

తెలంగాణ ఊటీ..అనంతగిరి

Agasthya kantu

ఎటు చూసినా పచ్చని చెట్లు.. వాటి మధ్య నుంచి దూసుకెళ్లే మలుపుల రహదారులు.. కొండలను చుట్టుకుంటూ కదిలే మేఘాలు.. లోయల్లో పరుచుకున్న పచ్చదనం.. అప్పుడప్పుడూ పలకరించే జలధారలు.. చెట్ల మధ్య వినిపించే పక్షుల కిలకిలరావాలు.. చల్లని గాలులతో మనసుకు హాయినిచ్చే వాతావరణం.. ఇవన్నీ కలిసిన ప్రకృతి చిత్రమే అనంతగిరి కొండలు. వర్షం పడితే అనంతగిరి కొండల అందం మరింత రెట్టింపవుతుంది. మంచుతెర కమ్ముకున్న ఉదయాలు, సూర్యాస్తమయ వేళల్లో కనిపించే కొండల దృశ్యాలు, అడవిలోని నిశ్శబ్దం అనంతగిరికి ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకొచ్చాయి. ప్రకృతి ఒడిలో ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతతను ఒకేసారి ఆస్వాదించే అవకాశం ఉండటంతో అనంతగిరికి ‘తెలంగాణ ఊటీ’గా ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

ఎలా ఏర్పడ్డాయి

అనంతగిరి కొండలు భూవిజ్ఞాన శాస్త్రపరంగా సుమారు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం, భూమిపై డైనోసార్లు అంతరించిపోతున్న కాలంలో సంభవించిన భారీ అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల రూపుదిద్దుకున్నాయి. దక్కన్ పఠార ప్రాంతానికి చెందిన ఈ కొండలు, భూ అంతర్భాగం నుండి పొంగిపొర్లిన వేడి బసాల్ట్ ద్రవ లావా పొరలు పొరలుగా ప్రవహించి చల్లబడటం ద్వారా ఏర్పడ్డాయి. శతాబ్దాల పాటు కురిసిన వర్షాలు, వీచిన గాలుల ప్రభావంతో ఈ లావా రాళ్లు క్షీణించి ఎర్రటి ల్యాటరైట్ నేలలుగా మారి నేడు మనం చూస్తున్న అందమైన, ప్రాచీన అనంతగిరి కొండల రూపంలో స్థిరపడ్డాయి.

ప్రకృతి సిరి

అనంతగిరి కొండలు సుమారు 3,763 ఎకరాల పరిధిలో విస్తరించిన అడవులతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. సముద్ర మట్టానికి సుమారు 2,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండ ప్రాంతంలో దట్టమైన చెట్లు, లోయలు, వాగులు, సహజ నీటి ప్రవాహాలు, రాతి నిర్మాణాలు కనిపిస్తాయి. ఏ కాలంలో చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని కొండలు, లోయలు, చల్లటి గాలులతో అనంతగిరి ప్రత్యేకంగా కనిపిస్తుంది. వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత అందంగా మారుతుంది. కొండలపై పచ్చదనం పరుచుకోవడంతోపాటు వర్షపు నీరు చిన్న చిన్న జలధారలుగా ప్రవహిస్తుంది. పొగమంచు కొండలను కప్పేసిన ఉదయాలు, తడిసిన చెట్ల మధ్య నుంచి వచ్చే చల్లని గాలి, మలుపులు తిరిగే ఘాట్‌ రహదారులు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. అడవిలోని సహజ మార్గాలు, కొండ బాటలు అనంతగిరిని ట్రెక్కింగ్‌కు అనువైన ప్రాంతంగా మార్చాయి. కొండలపై నడక, అడవి మార్గాల్లో ప్రయాణం, ఎత్తైన ప్రాంతాలకు చేరుకోవడం ప్రకృతిని మరింత దగ్గరగా అనుభవించే అవకాశాన్ని ఇస్తాయి. ట్రెక్కింగ్‌తోపాటు క్యాంపింగ్‌, ప్రకృతి పరిశీలన వంటి కార్యకలాపాలకు కూడా ఈ ప్రాంతంలో అవకాశాలు ఉన్నాయి.

ఆధ్యాత్మికతను తెచ్చిన అనంత పద్మనాభస్వామి

అనంతగిరి కొండల మధ్య కొలువైన 1300 సంవత్సరాల చరిత్ర గల శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం ఈ ప్రాంతానికి ఆధ్యాత్మికతను ప్రసాదించింది. ఇక్కడ  శ్రీ అనంత పద్మనాభస్వామివారు శ్రీమహావిష్ణువు అవతారంగా కొలువుదీరారు. దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీన, మహిమాన్వితమైన వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయానికి సంబంధించి పురాణాలు, ఇతిహాసాలు మరియు చారిత్రక కథనాల్లో అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. స్కంద పురాణం ప్రకారం..ద్వాపరయుగంలో మార్కండేయ మహర్షి అనంతగిరి కొండల ప్రశాంత వాతావరణానికి ఆకర్షితుడై ఇక్కడ యోగసాధన చేసేవారని ప్రతీతి. మహర్షి ప్రతిరోజూ ఇక్కడి నుండి కాశీకి వెళ్లి గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించేవారు. ఒకరోజు ఉదయాన్నే ద్వాదశి ఘడియలు ప్రవేశించడంతో ఆయన కాశీకి వెళ్లి రాలేకపోయాను అని బాధపడగా, మహావిష్ణువు ఆయన తపస్సుకు మెచ్చి కాశీ గంగా జలాన్ని ఇక్కడికే ప్రవహింపజేశారని నమ్ముతారు. ఆ తర్వాత మహర్షి తపఃఫలంగా స్వామివారు సాలగ్రామ రూపంలో అనంత పద్మనాభుడిగా ఇక్కడ ఆవిర్భవించారు.

మరో కథనం ప్రకారం..రాజర్షి ముచికుందుడు రాక్షసులతో కొన్నేళ్ల పాటు యుద్ధం చేసి అలసిపోయి అనంతగిరి గుహల్లో నిద్రలోకి వెళ్తాడు. దేవేంద్రుడి వరప్రభావంతో తన నిద్రాభంగం కలిగించిన కాలయవనుడు అనే రాక్షసుడిని తన నేత్రాల అగ్నితో భస్మం చేస్తాడు. అనంతరం శ్రీకృష్ణుడు ఆ ముచికుందునికి "అనంత పద్మనాభస్వామి" రూపంలో దర్శనమివ్వగా, ముచుకుందుడు పరమానందంతో స్వామివారి పాదాలను కడిగిన జలమే జీవనదిగా మారి ముచికుంద నది (మూసీ నది) గా ఆవిర్భవించిందని స్థానికుల విశ్వాసం.

చారిత్రక ఆధారాలు, క్షేత్ర కథనాల ప్రకారం, సుమారు 400 ఏళ్ల క్రితం హైదరాబాద్ నవాబుకు (లేదా నిజాంకు) శ్రీ అనంత పద్మనాభస్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి, కొండల్లో కొలువైన తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారట. అనంతరం నవాబు ఈ క్షేత్ర మహత్య గ్రహించి ప్రస్తుతం ఉన్న ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని నిర్మించారు.

భవనాశి పుష్కరిణి (పాపనాశనం)

ఆలయానికి సమీపంలోనే 'భవనాశిని' లేదా భగీరథ గుండం ఉంది. లోయలోకి మెట్ల మార్గంలో వెళ్లే ఈ పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోవడమే కాకుండా, సమస్త రోగాలు నయమై ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. మెట్ల మార్గంలో దిగుతూ వెళ్లే ఈ ప్రాంతం చుట్టూ కొండలు, చెట్లు, సహజ నీటి ప్రవాహాలు కనిపిస్తాయి.

ఆదిశేషుని తోక భాగం

అనంతగిరి కొండల గురించి మరో ఆధ్యాత్మిక విశ్వాసం కూడా ఉంది. తిరుమలలోని శేషాచల పర్వతాలను ఆదిశేషుని తల భాగంగా, అహోబిలం కొండలను మధ్య భాగంగా, అనంతగిరిని ఆదిశేషుని తోక భాగంగా భావిస్తారని క్షేత్ర కథనాలు చెబుతున్నాయి. ఈ నమ్మకం కారణంగా అనంతగిరికి వైష్ణవ సంప్రదాయంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని భక్తులు విశ్వసిస్తారు.

రెండు సార్లు ఉత్సవాల వైభవం

అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఏడాదికి రెండు సార్లు.. ఆషాఢ, కార్తీక మాసల్లో ఉత్సవాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే జాతర ఇక్కడి అతిపెద్ద ఉత్సవం. కార్తీక మాసంలో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి భవనాశి పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఆషాఢ మాసంలో కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి.

మూసీ నది పుట్టినిల్లు

అనంతగిరిలోని భవనాశి లోయ వద్ద మూసీ నది ఆవిర్భవిస్తుంది. ద్వాపరయుగంలో మార్కండేయ మహర్షి యోగసాధనకు ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు రప్పించిన పవిత్ర జలధారే ఈ మూసీ నదిగా ప్రవాహరూపం దాల్చిందని పురాణాలు చెబుతున్నాయి. అనంతగిరుల్లో మొదలయ్యే ఈ మూసీ నది వికారాబాద్, చేవెళ్ల,  హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ జిల్లాల గుండా ప్రయాణించి వాడపల్లి క్షేత్రం వద్ద కృష్ణా నదిలో సంగమిస్తుంది.

పురాతన మానవ నివాసం

అనంతగిరి ప్రాంతానికి ప్రకృతి సౌందర్యంతోపాటు ప్రాచీన చరిత్ర కూడా ఉంది. దక్షిణ భారతదేశంలోని ప్రాచీన మానవ నివాస ప్రాంతాల్లో (Prehistoric Human Settlements) ఒకటిగా దీనిని వికారాబాద్‌ జిల్లా అధికారిక పర్యాటక సమాచారం పేర్కొంటోంది. అడవుల్లో కనిపించే పురాతన గుహలు, మధ్యయుగ కోటలను పోలిన నిర్మాణాలు, పాత ఆలయాల ఆనవాళ్లు ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయి.

జైన గుహల చరిత్ర

అనంతగిరిలోని రాతి గుహలకు మరింత ప్రాచీన చారిత్రక ప్రాధాన్యం ఉన్నట్లు పురావస్తు పరిశోధనలు వెల్లడించాయి. క్రీస్తుశకం 9వ శతాబ్దానికి చెందిన 15 జైన రాతి గుహలు ఇక్కడ ఉన్నట్లు 2025లో పురావస్తు పరిశోధకుల పరిశీలనలో వెల్లడైంది. వాటిలో ఆరు గుహలు ప్రస్తుతం పూర్తిగా కనిపిస్తుండగా, మిగిలినవి మార్గం విస్తరణతో కొంత దెబ్బతిన్నాయి. వర్షాకాలంలో జైన సన్యాసులు నివసించేందుకు, ఆధ్యాత్మిక సాధనకు ఈ గుహలను ఉపయోగించేవారని పరిశోధకులు తెలిపారు. రాతితో చేసిన పడకలు, దీపాలు పెట్టేందుకు గోడల్లో చెక్కిన గూళ్లు, ధ్యాన భంగిమలో ఉన్న జైన విగ్రహ ఆనవాళ్లు వాటి ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయి.

వ్యూ పాయింట్

అనంతగిరి కొండల్లో సందర్శకులను విశేషంగా ఆకట్టుకునే ప్రధాన ప్రాంతాలలో అనంతగిరి వ్యూ పాయింట్ ఒకటి. సముద్ర మట్టానికి సుమారు 2,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం నుండి దట్టమైన అడవులు, పచ్చని లోయలు,  ప్రకృతి అందాలను సుదూరం వరకు వీక్షించే అద్భుత అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం,  శీతాకాలంలో (జూన్ నుండి ఫిబ్రవరి) ఉదయాన్నే కొండలను కప్పేసే పొగమంచు, మనోహరమైన సూర్యోదయ దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఎకో అర్బన్ పార్క్‌లోని వాచ్‌టవర్ సహా ఈ ప్రాంగణమంతా  ప్రకృతి ప్రేమికుల విశ్రాంతికి అత్యంత అనువైన వేదికగా నిలుస్తోంది.

అరకు అనుభూతిని ఇచ్చే కాఫీ తోటలు

అనంతగిరి కొండల్లో దట్టమైన అడవుల మధ్య వెలసిన కాఫీ తోటలు పర్యాటకులకు అరకు అనుభూతిని అందిస్తాయి. సముద్ర మట్టానికి సుమారు 2,500 అడుగుల ఎత్తుతోపాటు చల్లని ఆహ్లాదకరమైన శీతోష్ణస్థితి, ల్యాటరైట్ నేలలు అనుకూలంగా ఉండటంతో ఇక్కడ కాఫీ సాగు సాధ్యమైంది. ఆంధ్రాలోని పాడేరు, అరకు తరహాలోనే అటవీ శాఖ ఆధ్వర్యంలో పెంపొందించిన ఈ తోటలు పచ్చని చెట్ల నీడన ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం ముగిసాక ఎర్రటి కాఫీ గింజలు, ఆకులపై వాలే మంచు బిందువులతో మెరిసిపోయే ఈ తోటల గుండా నడవడం పర్యాటకులకు ప్రశాంతమైన, వినూత్నమైన అనుభూతిని ఇస్తుంది.

అందాలతోపాటు ఔషధ సిరి కూడా

అనంతగిరి అటవీ ప్రాంతం సహజసిద్ధమైన 'ఔషధ సిరి'కి నిలయం. దాదాపు 3,763 ఎకరాల్లో విస్తరించిన ఈ దట్టమైన అడవుల్లో 50కి పైగా రకాల మూలికా, ఔషధ గుణాలు కలిగిన వృక్షసంపద సహజంగా పెరుగుతోంది. టీబీ (క్షయ) వ్యాధికి సరైన మందులు లేని రోజుల్లోనే ఈ కొండలపై కొన్ని నెలల పాటు నివసించి, ఇక్కడి మూలికా గుణాలు కలిగిన స్వచ్ఛమైన గాలి పీల్చితే ఆ వ్యాధి తగ్గేదని చరిత్ర చెబుతోంది.  ఈ విలువైన మూలికా సంపదను కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు అనంతగిరికి వెళ్లే దారిలో 1,200 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక 'ఔషధ వనం' (Medicinal Plants Park) ఏర్పాటు చేశారు. ఇందులో తిప్పతీగ, కానుగ, అల్లనేరెడు, మారేడు, ఉసిరి, కలబంద, వేప, అశ్వగంధ వంటి 30కి పైగా ప్రసిద్ధ ఔషధ మొక్కలను ప్రత్యేకంగా పెంపొందిస్తున్నారు. చర్మ వ్యాధులు, మధుమేహం, రక్తపోటు, కాలేయ సమస్యలు మరియు రోగనిరోధక శక్తి పెంపునకు తోడ్పడే ఈ మొక్కలు చుట్టుపక్కల వాతావరణాన్ని మంచి సువాసనతో, ఆరోగ్యకరమైన గాలితో నింపుతుంటాయి. అందుకే అనంతగిరి కొండలు పర్యాటకులకు కేవలం మానసిక ఉల్లాసాన్నే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించే సహజ వైద్య నిలయంగా నిలుస్తున్నాయి.

ఎకో అర్బన్‌ పార్క్

ఇటీవలి కాలంలో అనంతగిరి అటవీ ప్రాంతంలో పర్యాటక సదుపాయాలను మరింత విస్తరించే చర్యల్లో భాగంగా సుమారు 80 హెక్టార్లలో ఎకో అర్బన్‌ పార్క్‌ అభివృద్ధి చేశారు. ట్రెక్కింగ్‌ పాత్‌, సావనీర్‌ షాప్‌, గజీబోలు, వాచ్‌టవర్లు వంటి సౌకర్యాలు ఇందులో ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి సుమారు 700 మీటర్ల ఎత్తులో ఉన్న వాచ్‌టవర్‌ నుంచి అనంతగిరి అటవీ దృశ్యాలను వీక్షించే అవకాశం కల్పించారు. ప్రకృతి నడక (Nature Walk), సాహస ట్రెక్కింగ్ ఇష్టపడే వారి కోసం పార్క్ లోపల సురక్షితమైన రాతి దారులు, వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేశారు.

సమీపంలోని పర్యాటక ప్రదేశాలు

అనంతగిరి కొండల పరిసరాల్లో ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి రమణీయతను పంచే అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణానికి అతి సమీపంలోనే సహజ నీటి ఊటతో ప్రసిద్ధి చెందిన పురాతన బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ నిరంతరం ప్రవహించే పవిత్ర జలధార భక్తులను ఎంతో ఆకట్టుకుంటుంది. కాస్త ముందుకు వెళ్తే కొటపల్లి రిజర్వాయర్ (నగసముద్రం సరస్సు) జలక్రీడలకు, కయాకింగ్, బోటింగ్ కు అనువైన ప్రధాన పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది. కుల్కచర్ల పాంబండ, కొడంగల్‌ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, తాండూరు భూకైలాస్‌, భద్రేశ్వర ఆలయం, జుంటుపల్లి సీతారాముల దేవాలయం, ఏకాంభరేశ్వరాలయం, పూడూరు దామంగం రామలింగేశ్వర స్వామి, పరిగి వేంకటేశ్వర స్వామి దేవాలయం కూడా సమీపంలోనే ఉంటాయి.

వెళ్లడానికి సరైన సమయం

హైదరాబాద్‌ నుంచి 70–90 కిలోమీటర్ల దూరంలో, వికారాబాద్‌ పట్టణం నుంచి  సుమారు 5–10 కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండలు ఉన్నాయి. అనంతగిరిని ఏడాది పొడవునా సందర్శించవచ్చు. అయితే జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు వర్షాకాలం ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కొండలు పచ్చని దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తాయి, జలధారలు ప్రవహిస్తాయి, పొగమంచు వాతావరణాన్ని మరింత అందంగా మారుస్తుంది. మరోవైపు నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు చల్లటి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ట్రెక్కింగ్‌, ప్రకృతి విహారం, కుటుంబ పర్యటనకు ఈ కాలం కూడా అనువైనది.