తెలంగాణ

గవర్నర్‌ వర్సెస్‌ గవర్నమెంట్

Agasthya kantu

భారతదేశంలో గవర్నర్‌ వ్యవస్థపై రోజురోజుకూ చర్చ తీవ్రతరమవుతోంది. పలు రాష్ట్రాల్లో గవర్నర్‌–ఎన్నికైన ప్రభుత్వాల మధ్య విభేదాలు బహిరంగ ఘర్షణలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉన్న సందర్భాల్లో గవర్నర్‌ పాత్ర, అధికార పరిధి, ప్రభుత్వ నిర్ణయాలపై జోక్యం వంటి అంశాలు వివాదాలకు కారణమవుతున్నాయి. కేంద్ర స్థాయిలో రాష్ట్రపతి నిర్వహించే పాత్రకు సమానమైన రాజ్యాంగపరమైన బాధ్యతలను రాష్ట్ర స్థాయిలో గవర్నర్‌ నిర్వహిస్తారు. గవర్నర్‌ రాష్ట్రానికి రాజ్యాంగపరమైన అధిపతిగా ఉన్నప్పటికీ, సాధారణ పరిపాలనలో ఆయన పాత్ర నామమాత్రమే. అసలైన అధికారం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో గవర్నర్‌–ఎన్నికైన ప్రభుత్వం మధ్య అధికారాలు, బిల్లుల ఆమోదం, విశ్వవిద్యాలయాల వ్యవహారాలు, రాజ్యాంగ విచక్షణ వంటి అంశాలపై విభేదాలు తీవ్ర చర్చకు దారితీశాయి. తటస్థంగా ఉండాల్సిన గవర్నర్లు పరిధి దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలోనూ, ప్రత్యేక తెలంగాణలోనూ గవర్నర్‌ వర్సెస్‌ ప్రభుత్వంగా మారిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి కీలక రాజకీయ పరిణామాలను చూద్దాం..

1984.. ఎన్టీఆర్‌ను తొలగించిన సంచలన ఘటన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో గవర్నర్‌–ముఖ్యమంత్రి వివాదానికి అత్యంత సంచలన ఉదాహరణ 1984 ఆగస్టు సంక్షోభం. 1983లో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో గవర్నర్ గా ఠాకూర్‌ రామ్‌లాల్‌ ఉన్నారు. 1984లో ఎన్టీఆర్‌ వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఆ సమయంలో ఎన్టీఆర్ మంత్రివర్గంలోని ఆర్థిక మంత్రి నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేశారు. ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగొచ్చిన వెంటనే, తనకు అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉందని నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే నాటి గవర్నర్ ఠాకూర్ రామ్‌లాల్, ఎన్టీఆర్ బలపరీక్ష నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండానే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. 1984, ఆగస్ట్ 16న మెజారిటీ లేని నాదెండ్ల భాస్కరరావుతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు, "ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి" దారితీసింది. ఎన్టీఆర్ తన ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వీధుల్లో, రాష్ట్రపతి భవన్ ముందు పరేడ్ నిర్వహించారు. ప్రజా ఒత్తిడి, దేశవ్యాప్త రాజకీయ నిరసనల కారణంగా  రామ్‌లాల్‌ 1984 ఆగస్ట్ 24న రాజీనామా చేశారు. కేంద్రం రామ్‌లాల్‌ స్థానంలో 1989, ఆగస్ట్ 29న శంకర్ దయాళ్ శర్మను గవర్నర్‌గా నియమించింది. శంకర్ దయాళ్ శర్మ అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించగా నాదెండ్ల భాస్కరరావుకు మెజారిటీ లేకపోవడంతో ఆయన సెప్టెంబర్ 16న సీఎంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 1984, సెప్టెంబర్ 16 తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

1989 ఆర్డినెన్సుల వివాదం & బడ్జెట్ ప్రతిష్టంభన (కుముద్ బెన్ జోషి వర్సెస్ ఎన్టీఆర్)

1985 నుంచి 1990 మధ్య గవర్నర్‌గా పనిచేసిన కుముద్ బెన్ జోషి కాలంలో రాజ్‌భవన్, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కార్యాలయం మధ్య నిరంతరం తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. కుముద్ బెన్ జోషి కాంగ్రెస్ నేపథ్యం ఉన్న నాయకురాలు కావడం, ఆమె రాజ్‌భవన్‌ను కాంగ్రెస్ రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చారనే ఆరోపణలు టీడీపీ ప్రభుత్వం నుంచి వచ్చాయి. ఎన్టీఆర్ ప్రభుత్వం పంపిన పలు బిల్లులు, ఆర్డినెన్సులను క్లియర్ చేయకుండా గవర్నర్ సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టడం ప్రధాన వివాదంగా మారింది. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (VC) నియామకం విషయంలో ప్రభుత్వం పంపిన పేర్లను తిరస్కరించి గవర్నర్ తన రాజ్యాంగ అధికారాన్ని నేరుగా ఉపయోగించడం తీవ్ర ఘర్షణకు దారితీసింది. గవర్నర్ రాజ్‌భవన్‌లో జోగినులకు వివాహం జరిపించి సంచలనం సృష్టించారు. గవర్నర్ జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలపై సమీక్షలు నిర్వహించడాన్ని ఎన్టీఆర్ బహిరంగంగా తప్పుపట్టడమే కాకుండా, ఏపీ అసెంబ్లీలో గవర్నర్ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తీర్మానాలు కూడా ప్రవేశపెట్టారు.

1995 టీడీపీ నాయకత్వ మార్పు.. కృష్ణకాంత్ పాత్ర వివాదస్పదం

1995 ఆగస్టులో తెలుగుదేశం పార్టీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుని, ఎన్టీఆర్ స్థానంలో నారా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంలో రాజ్‌భవన్ పాత్ర కీలకంగా మారింది. పార్టీ ఎమ్మెల్యేలు మెజారిటీ సంఖ్యలో చంద్రబాబు నాయుడికి మద్దతు ప్రకటించగా, మరోవైపు ఎన్టీఆర్ తాను సీఎం స్థానంలో ఉన్నందున అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని గవర్నర్‌కు సిఫార్సు చేశారు. నాటి గవర్నర్ కృష్ణకాంత్, సీఎం ఎన్టీఆర్ చేసిన అసెంబ్లీ రద్దు సిఫార్సును పక్కనబెట్టి, అసెంబ్లీలోనే ఎవరికి మెజారిటీ ఉందో తేల్చుకోవడానికి చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్ వర్గం ఈ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమని విమర్శించినప్పటికీ, కృష్ణకాంత్ శాసనసభ వేదికగానే బలపరీక్ష జరగాలనే సూత్రానికి కట్టుబడి చంద్రబాబును ఆహ్వానించారు. చంద్రబాబు మెజారిటీ నిరూపించుకోవడంతో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది.

మలిదశ తెలంగాణ ఉద్యమం

రాష్ట్ర విభజన సమయానికి ముందు ఉమ్మడి ఏపీకి చివరి గవర్నర్‌గా పనిచేసిన ఈ.ఎస్.ఎల్. నరసింహన్ కాలంలో శాంతిభద్రతలు, సీఎంతో సమీక్షల విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2009 డిసెంబర్ తర్వాత తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో నాటి సీఎంలు కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలతో పాటు గవర్నర్ నరసింహన్ వద్ద శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన దిశగా నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన గవర్నర్ నరసింహన్ శాంతిభద్రతలను నేరుగా పర్యవేక్షించడం,  పరిస్థితిపై నివేదికలు రూపొందించడం సీఎం కార్యాలయానికి, గవర్నర్‌కు నడుమ అంతర్గత అసంతృప్తికి కారణమైంది.

కేసీఆర్‌ వర్సెస్‌ తమిళిసై..

తెలంగాణలో నాటి కేసీఆర్‌ ప్రభుత్వం, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మధ్య విభేదాలు అత్యంత చర్చనీయాంశంగా మారాయి. 2021లో పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ సిఫారసుపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోకపోవడంతో విబేధాలు మొదలయ్యాయి. గవర్నర్ తమిళసై మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు, యాదాద్రి ఆలయానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు లేదా స్థానిక మంత్రులు ఆమెకు స్వాగతం పలకడానికి రాలేదని, ప్రోటోకాల్ ఉల్లంఘించారని గవర్నర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్ జెండా ఆవిష్కరించే కార్యక్రమానికి సీఎం కేసీఆర్, ఆయన మంత్రులు వరుసగా హాజరుకాకపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం యత్నించడం వివాదానికి దారితీసింది. రాజ్ భవన్‌లో తమిళసై "మహిళా దర్బార్" ఏర్పాటు చేసి ప్రజల నుండి వినతులు స్వీకరించడాన్ని సీఎం కేసీఆర్ వర్గం తీవ్రంగా తప్పుపట్టింది. ఇది సమాంతర ప్రభుత్వం నడపడమేనని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. తెలంగాణ యూనివర్సిటీల్లో ఉపాధ్యాయుల భర్తీ కోసం తెచ్చిన 'కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లు'తో పాటు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీల సవరణ బిల్లు వంటి అనేక ఫైళ్లను గవర్నర్ పరిశీలన పేరుతో పెండింగ్‌లో పెట్టారు. గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా అడ్డుకుంటున్నారని కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సహకార సమాఖ్య స్ఫూర్తితో ..గవర్నర్ వ్యవహరించాలి

ఎన్టీఆర్‌ను పదవి నుంచి తొలగించిన 1984 సంక్షోభం నుంచి కేసీఆర్‌-తమిళిసై మధ్య బిల్లుల వివాదం వరకు చూస్తే.. కాలం మారినా గవర్నర్‌–ఎన్నికైన ప్రభుత్వం మధ్య అధికారాల పరిధి అనే ప్రశ్న మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆర్టికల్ 153,  154 ప్రకారం గవర్నర్ రాజ్యాంగ అధిపతి అయినప్పటికీ, ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాల పరి పరిధిలోకి వచ్చే పాలనావ్యవస్థలో గవర్నర్ పాత్ర పరిమితంగా ఉండాలని, సమాఖ్య వ్యవస్థ (Federalism) దెబ్బతినకుండా "సహకార సమాఖ్య స్ఫూర్తి"తో వ్యవహరించాలని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో పునరుద్ఘాటించింది. గవర్నర్‌ పదవి వివాదాస్పదం కాకుండా, కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయానికి వేదికగా ఉండాలంటే కొన్ని మార్పులు అవసరమనే అభిప్రాయాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. సర్కారియా కమిషన్‌, పూంచీ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం సమకాలీన రాజకీయాల్లో చురుకుగా లేని, రాజకీయ పక్షపాతాలకు దూరంగా ఉన్న వ్యక్తులను గవర్నర్లుగా నియమించాలి. రాజకీయ రంగంతో ప్రత్యక్ష సంబంధం లేని, ప్రజా పరిపాలన, న్యాయ, విద్యా లేదా ఇతర ప్రజాసేవా రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే సూచనలు ఉన్నాయి. అలాగే గవర్నర్‌ నియామకానికి ముందు సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరపడం వంటి విధానాన్ని అనుసరిస్తే రాష్ట్ర ప్రభుత్వాల విశ్వాసం పెరిగే అవకాశం ఉంది. గవర్నర్‌ పదవి కేంద్రం తరఫున రాజకీయ ప్రతినిధిగా కాకుండా.. రాజ్యాంగ పరిరక్షకుడిగా, కేంద్రం, రాష్ట్రాల మధ్య వారధిగా పనిచేసేలా ఈ సిఫార్సులను అమలు చేయడం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.