ప్రభాత ఉదయం, కామారెడ్డి : కాంగ్రెస్ ముఖ్యనేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. డీసీసీ అధ్యక్షుల నియామక వ్యవహారంలో ఏకంగా ఢిల్లీలోని ఓ హోటల్లో మంత్రి, ఎంఎల్ఏ మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రాష్ట్ర రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీకి రాష్ట్రం నుంచి ఆ పార్టీ ముఖ్యనేతలు తరలివెళ్లిన విషయం తెలిసిందే. అయితే, షాంగ్రిలా హోటల్లో మంత్రి దామోదర్ రాజనర్సింహతో పాటు పలువురు ఎంఎల్ఏలు, నాయకులు బసచేశారు. అయితే, హోటల్ లాబీలో మంత్రి దామోదర రాజనర్సింహ కనిపించటంతో జుక్కల్ ఎంఎల్ఏ తోట లక్ష్మీకాంతరావు విష్ చేశారని.. ఆ వెంటనే మంత్రి అతనిపై ఆగ్రహాం వ్యక్తం చేశారని సమాచారం. ఏకంగా ‘నిన్ను ఇక్కడే బొందపెడతా..’ అంటూ బూతులు తిట్టినట్టు తెలిసింది. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ రంగారెడ్డి జిల్లాతో పాటు ఇతర జిల్లాల ఎంఎల్ఏలు, నాయకులు ఉన్నట్టు సమాచారం. అయితే, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి నియమాకం వ్యవహారంలో ఎంఎల్ఏ జోక్యం చేసుకున్నారనే ఉద్దేశంతోనే మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసి ఉండొచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనపై ఎంఎల్ఏను ‘ప్రభాత ఉదయం’ ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా.. మంత్రి తనను బూతులు తిట్టిన మాట వాస్తవమేనని చెప్పారు. ఇంతకుముందు తనకు, మంత్రికి మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలు లేవన్నారు. డీసీసీ అధ్యక్షుల నియామక పక్రియ అదిష్ఠానం ‘సంఘటన్ సృజన్ అభియాన్’ అనే పక్రియ ద్వారా చేపట్టిందన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తోపాటు ఎంపీ మల్లు రవికి ఫిర్యాదు చేశానని తెలిపారు.