తెలంగాణ

అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం.. హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం!

అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్ హైదరాబాద్ మీద కూడా పడింది. తుఫాన్ ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ సిటీ : అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్ హైదరాబాద్ మీద కూడా పడింది. తుఫాన్ ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులు కమ్ముకొని ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. చాలారోజుల తర్వాత వర్షం పడటంతో నగర ప్రజలు సంతోషించినా ఇబ్బందులు తప్పలేదు. పలు ప్రాంతాల్లో గాలివానకు విద్యుత్ నిలిచిపోయింది. వర్షపునీరు రోడ్ల మీదకు చేరి వాహనదారులు నరకం అనుభవించారు. మణికొండ, రాయదుర్గం, షేక్‌పేట, తుర్కయాంజాల్‌, మన్నెగూడ, కాప్రా, కీసర, నాగారం, టోలిచౌకి, కార్వాన్‌, రాజేంద్రనగర్‌, మెహదీపట్నం, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, నాంపల్లి, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. మాదాపూర్‌, హైటెక్‌సిటీ, కేపీహెచ్‌బీ, మైండ్‌స్పేస్‌, ఐకియా మార్గాల్లో ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్తున్న ఉద్యోగులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. యూసుఫ్‌గూడ శ్రీకృష్ణనగర్‌లో వర్షం దంచికొట్టింది. కుత్బుల్లాపూర్‌ చౌరస్తా నుంచి సూరారం వరకు, షాపూర్‌ నుంచి గాజులరామారం వరకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. బహదూర్‌పురాలో అత్యధికంగా 8 సెం.మీ., మాదాపూర్‌లో 5.7 సెం.మీ., షేక్‌పేట్‌లో 5.5 సెం.మీ, చార్మినార్‌లో 4.7 సెం.మీ, జూబ్లీహిల్స్‌ 4.4 సెం.మీ, అత్తాపూర్‌ 4.3 సెం.మీ, ఆసిఫ్‌నగర్‌లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కృష్ణానగర్‌‌ను ముంచెత్తిన వరద
యూసుఫ్‌గూడ పరిధిలోని కృష్ణానగర్‌‌ను ఎగువ నుంచి వచ్చిన వర్షపు నీరు ముంచెత్తింది. రహదారులు కాలువలను తలపించాయి. వరద ఉధృతికి ఇళ్ల ముందు పార్క్ చేసిన కొన్ని వాహనాలు కొట్టుకుపోయాయి. బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట, ప్యాట్నీ, ప్యారడైజ్, చిలకలగూడ, మారేడుపల్లి ప్రాంతాల్లో వర్షంధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

విద్యుత్‌శాఖ అప్రమత్తం
భారీ వర్షాలతో విద్యుత్‌శాఖ అప్రమత్తమైంది. నగరపరిధిలోని మూడు సర్కిళ్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు సీఎండీ జితీశ్ వీ పాటిల్ తెలిపారు. సంబంధిత అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఈఆర్టీ వాహనాలు, ట్రీ కటింగ్ యంత్రాలు, ఇతర అత్యవసర పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ తీగలు తెగిపడినా, చెట్లు, కొమ్మలు విద్యుత్ లైన్లపై పడినా వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ అంతరాయాలపై వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912, వాట్సాప్ నంబర్ 8712441912, టీజీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్, అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ సిబ్బంది, సంబంధిత ఏఈ, ఏడీఈ, డీఈ, ఎస్ఈ, సీఈ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.