ప్రభాత ఉదయం, కాగజ్నగర్ : రెవెన్యూ సదస్సులో కలెక్టర్ రైతుల సమస్యలు వింటున్నారు.. వాటి పరిష్కారానికి చర్యలు సైతం ఆదేశిస్తున్నారు.. ఇంతలో ఓ మహిళా రైతు తన పరిస్థితి గురించి వివరిస్తూ, డబ్బులు లేక మీ సేవ స్లాట్ బుక్ చేసుకోలేక పోతున్నానని వాపోయింది. దీంతో చలించిన కలెక్టర్ హరిత వెంటనే రూ.1500 నగదు అందించి ఆమెకు అండగా నిలిచారు. మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన సదస్సుకు కాగజ్నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరితో కలిసి కలెక్టర్ సదస్సుకు హాజరయ్యారు. ఈ క్రమంలో మండలంలోని హత్తిని గ్రామానికి చెందిన పెద్దల బాణక్క తన భూ సమస్య చెప్పుకున్నారు. తన పట్టా భూమి లావుణిగా నమోదు అయిందని, సరిచేసేందుకు ఇబ్బంది ఉన్నట్లు చెప్పారు. మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించగా, స్లాట్ బుక్ చేసుకోవడానికి డబ్బులు లేవని చెప్పింది. ఆ మహిళ దీన స్థితి తెలుసుకున్న కలెక్టర్ స్వయంగా 1500 రూపాయలు రైతుకు అందజేశారు. దీంతో ఆమె ధన్యవాదాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సదస్సులో తహసీల్దార్ మునవర్ షరీఫ్ పాల్గొన్నారు.