ప్రభాత ఉదయం, న్యూఢిల్లీ : తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టే ప్రతీ పెట్టుబడికి తాను భరోసా ఇస్తానని స్పష్టం చేశారు. ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములు కావాలని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన విధాన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ సహకారం అందించేందుకు వ్యక్తిగతంగా కృషి చేస్తానని మాటిచ్చారు. హైదరాబాద్‌కు 400 ఏండ్ల క్రితమే ప్రపంచ నగరంగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ప్రపంచీకరణ అనే మాట ప్రాచుర్యంలోకి రాకముందే అనేక దేశాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసేవారని గుర్తుచేశారు. చార్మినార్ పరిసరాల్లో ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, నఖాశీ వస్తువుల వ్యాపారం జరిగేదని వివరించారు. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’ సన్నాహక కార్యక్రమాన్ని గురువారం రాత్రి ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నిజాం పాలనలో హైదరాబాద్‌లో అనేక చారిత్రక కట్టడాలు, అంతర్జాతీయ స్థాయి మ్యూజియాలు, టంకశాల, విమానాశ్రయం, రైల్వే వ్యవస్థ, విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), అజయ్ బంగా (ప్రపంచ బ్యాంకు), శంతను నారాయణ్ (అడోబ్), ప్రేమ్ వత్స వంటి వారు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతులను అందించడంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
రాజీవ్, పీవీ కీలక సంస్కరణలు..
భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో దేశాభివృద్ధికి బాటలు వేసిన నాయకులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కంప్యూటర్, టెలికం రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు దేశ ప్రగతికి పునాది వేశాయని కొనియాడారు. రాజీవ్‌గాంధీ హైదరాబాద్‌లో పైలట్ శిక్షణ పొందారని, అందుకే అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టామని చెప్పారు. 1991లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారావు దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ చూపారని వివరించారు. హైదరాబాద్ జీవన విధానంలోనే ప్రపంచ దృక్పథం ఉందని, సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధి, వ్యాపార స్ఫూర్తి తెలంగాణ ప్రజల జీవన విధానంలో భాగమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1991 నుంచి వివిధ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో పెట్టుబడులకు అన్ని ప్రభుత్వాలు తమవంతు సహకారం అందించాయన్నారు.
పారిశ్రామికవేత్తలకు ఏ సాయానికైనా సిద్ధం..
వ్యాపార, వాణిజ్య రంగాల్లో పారిశ్రామికవేత్తలకు తమకంటే ఎక్కువ అనుభవం ఉందని, వారి నుంచి నేర్చుకుని, సూచనలను అర్థం చేసుకుని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకున్న పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడి మొత్తాన్ని, వ్యాపార వృద్ధిని, లాభాల అంచనాలను రెట్టింపు చేయాలని కోరారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వపరంగా ఎలాంటి సహకారం అందించడానికైనా సిద్ధమన్నారు.
మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ..
‘తెలంగాణ రైజింగ్–2047’ లక్ష్యం ‘వికసిత్ భారత్–2047’ దార్శనికతకు అనుగుణంగా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సమయంలో దేశ స్థూల దేశీయోత్పత్తిలో తెలంగాణ వాటాను ఐదు శాతం నుంచి పది శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వెల్లడించారు.
అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది..
కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై పెట్టుబడిదారులకు అనేక సందేహాలు ఉండొచ్చని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరుకావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో ఏడు హైస్పీడ్ రైలు కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించిందని, వాటిలో హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పుణెకు మూడు కారిడార్లు కేటాయించారని తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్‌లలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కూడా కేంద్రం సహకరిస్తోందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు విస్తరణ, నేవీ లో-ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి సహకారం అందుతోందని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు ఉన్న అడ్డంకులను తొలగించడమే తన బాధ్యతని తెలిపారు. హైదరాబాద్ పోటీ ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాలతో కాదని, న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి ప్రపంచ నగరాలతోనేనని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచస్థాయి ఆలోచనలు, మెరుగైన విధానపరమైన సూచనలు అందించాలని పారిశ్రామికవేత్తలను కోరారు.
పండుగలా ‘సమ్మిట్’: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనకు భారతీయులంతా కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దసరా, దీపావళి పండుగల వాతావరణంలో ఈ సమ్మిట్ మరో పండుగలా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని మొదటి ఐదు ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉందని, అంచనాలకు మించిన వేగంతో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధిస్తోందని 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. వికసిత్ భారత్ సాధించాలంటే అన్ని రాష్ట్రాలు, అన్ని రంగాల్లో తమ సామర్థ్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఏఐ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ ముందుందని పేర్కొన్నారు. భౌగోళిక గుర్తింపు ట్యాగ్ ఉన్న తాండూరు కందులను ఆస్ట్రేలియాకు పంపించామని తెలిపారు. తెలంగాణ సక్సెస్‌లో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని హామీ ఇచ్చారు. తాండూరు కందులు, నిజామాబాద్ పసుపు వంటి అత్యుత్తమ ఉత్పత్తులతో పాటు ఫార్మా, బయోటెక్ రంగాల్లో తెలంగాణకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఏరోస్పేస్, రక్షణ, క్వాంటం కంప్యూటింగ్ రంగాలపై దృష్టి సారించాలని, సులభతర వాణిజ్య అవకాశాలను మరింత మెరుగుపర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అభిషేక్ మను సింఘ్వీ, రేణుకా చౌదరి, డాక్టర్ మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, ఆర్. రఘురాం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.