ప్రభాత ఉదయం, బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను గురువారం సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల పర్యవేక్షణలో మూసివేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి సంవత్సరం జూలై 1న ప్రాజెక్టు గేట్లను తెరిచి, అక్టోబర్ 29న మూసివేయ్యాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ, మహారాష్ట్ర నీటిపారుదల శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు మొత్తం 14 గేట్లను మూసివేశారు. ఈ ఏడాది ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో వరద నీరు రాలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ సభ్యుల సంతకాలు చేసి, అవసరమైన అధికారిక ప్రక్రియను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అప్పర్ గోదావరి డివిజన్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఏఈ ఎన్. చరణ్, నాందేడ్ ఏఈ సీఆర్. బన్సోడ్, ఎస్సారెస్పీ ఏఈ కొత్త రవి, రిక్కీ సైమన్ తదితరులు పాల్గొన్నారు.