తెలంగాణ

గోదావరి తీరాన 'జ్ఞాన' నిలయం..బాసర శ్రీ సరస్వతీ దివ్య క్షేత్రం

Agasthya kantu

గోదావరి తీరాన ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో కొలువైన బాసర జ్ఞాన సరస్వతీ దేవి క్షేత్రం.. విద్య, జ్ఞానం, వేదవిద్యలకు ప్రతీకగా భక్తుల విశ్వాసంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వేదవ్యాస మహర్షి తపస్సు, సరస్వతీ దేవి ఆవిర్భావం వంటి పురాణ కథనాలతో ముడిపడిన ఈ క్షేత్రం.. అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి చెందిన పుణ్యస్థలంగా కూడా పేరొందింది. ఆ విశేషాలను తెలుసుకుందాం..

తెలంగాణలోని నిర్మల్ జిల్లా, పుణ్యపరివాహక గోదావరి నది తీరాన ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణంలో కొలువైన బాసర జ్ఞాన సరస్వతీ దేవి క్షేత్రం అత్యంత ప్రసిద్ధి పొందింది. కాశ్మీర్‌లోని శారదా పీఠం తర్వాత దేశంలోనే అతిపెద్ద, అత్యంత ప్రాచీనమైన రెండో సరస్వతీ దేవి ఆలయంగా ఇది విశేష పూజలందుకుంటోంది.

అరుదైన 'త్రిశక్తి క్షేత్రం' త్రిశక్తి

సాధారణంగా సరస్వతీ దేవి ఒక్కరికే ఆలయాలు ఉండటం అరుదు. అయితే బాసరలో ఒకే ప్రాంగణంలో త్రిమాతలు (మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి) కొలువై ఉండటం వల్ల దీనిని అరుదైన ‘త్రిశక్తి పీఠం’గా గుర్తిస్తారు. ప్రధాన ఆలయంలో సరస్వతీ దేవి కొలువై ఉండగా, పక్కనే మహాలక్ష్మి అమ్మవారు, కొద్ది దూరంలో గుహ రూపంలో మహాకాళి అమ్మవారు దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న మహాకాళి అమ్మవారి విగ్రహం ఉన్న ప్రాంతం ఒక సహజ సిద్ధమైన రాతి గుహలా ఉంటుంది. వ్యాస మహర్షి ఈ గుహలోనే కాళికా దేవిని ఉపాసించి శక్తిని పొందారని నమ్ముతారు.

వేదవ్యాసుడి తపస్సుతో ముడిపడిన బాసర కథ

కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన అనంతరం తీవ్ర మనోవేదనకు గురైన వేదవ్యాస మహర్షి శాంతిని వెతుక్కుంటూ దండకారణ్యంలోని ఈ ప్రాంతానికి చేరుకుని తీవ్ర తపస్సు చేశారని స్థానిక పురాణాలు చెబుతాయి. ఆయన భక్తికి ప్రసన్నురాలైన జగన్మాత ప్రత్యక్షమై, నదిలోంచి మూడు గుప్పెళ్ల ఇసుకను తీసుకువచ్చి త్రిమాతల విగ్రహాలను తయారు చేయమని ఆదేశించింది. వ్యాస మహర్షి సమర్పించిన ఆ మూడు గుప్పెళ్ల ఇసుకే కాలక్రమేణా సరస్వతి, లక్ష్మి, మహాకాళి దేవుళ్ల స్వయంభూ విగ్రహాలుగా రూపుదిద్దుకున్నాయి.

వ్యాసపురి’ నుంచి ‘బాసర’గా

ప్రాచీనకాలంలో వ్యాస మహర్షి నివసించి తపస్సు ఆచరించిన ప్రదేశం కావడం వల్ల ఈ ప్రాంతానికి మొదట 'వ్యాసపురి' లేదా 'వాసర' అనే పేరు ఉండేది. కాలక్రమేణా మరాఠీ భాషా ప్రభావంతో అది 'బాసర'గా స్థిరపడింది. వేదవ్యాస నిర్మితమైన ఈ ఇసుక విగ్రహాలకు శతాబ్దాలు గడుస్తున్నా చెక్కుచెదరకపోవడం ఇక్కడి ప్రధాన దైవిక అద్భుతం.

అక్షరాభ్యాసానికి అత్యంత పవిత్రమైన వేదిక

అమ్మవారి మూలవిరాట్‌కు పసుపు అలంకరించి నిత్య అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. స్వామివారి విగ్రహాలకు పూసిన ఆ పసుపును భక్తులకు 'బండారా' పేరుతో ప్రసాదంగా పంచుతారు. ఈ పసుపు ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల జ్ఞాపకశక్తి, అమితమైన జ్ఞానం, విద్యాబుద్ధులు లభిస్తాయని భక్తుల దృఢ విశ్వాసం. అందువల్లనే పసిపిల్లలకు తొలి విద్యాభ్యాసం కావింపజేసే 'అక్షరాభ్యాసం' పూజకు బాసర క్షేత్రం దేశంలోనే అత్యంత పవిత్రమైన వేదికగా నిలుస్తోంది. బాసర ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించే సమయంలో పలకపై బియ్యం పరిచి, పసిపిల్లల వేలితో "ఓం హరిః శ్రీ గణపతయే నమః" అని రాయించడం ఇక్కడి ప్రధానమైన సాంప్రదాయం. చిన్నారులకు మాటలు స్పష్టంగా రావడానికి, నత్తి లేదా వాక్కులో అవాంతరాలు తొలగడానికి భక్తులు సరస్వతీ దేవికి నాలుకపై తేనెతో ఓంకారం రాయించి ప్రత్యేక మొక్కుబడులు తీర్చుకుంటారు.

రామాయణ కాలంతోనూ అనుబంధం

ఈ దివ్య క్షేత్రానికి రామాయణ కాలంతోనూ అనుబంధం ఉందనే కథనం ప్రచారంలో ఉంది. వాల్మీకి మహర్షి రామాయణ కావ్యాన్ని రచించడానికి ముందు ఈ ప్రదేశంలో సరస్వతీ దేవిని ప్రతిష్టించి ఆరాధించాడని, ఆ తర్వాతే కావ్య రచన ప్రారంభించాడని చెబుతారు. దానికి నిదర్శనంగా ఆలయ పరిసరాల్లో వాల్మీకి మహర్షి సమాధితోపాటు ఆయన పాలరాతి శిల్పాలు దర్శనమిస్తాయి. దీనికి సమీపంలోనే 'మాలుకుడు' అనే మహర్షి తపస్సు చేసిన ఒక అరుదైన గుహ ఉంది. ఈ గుహ వద్ద ఉన్న ఒక పెద్ద రాతిగుండును చేతితో లేదా రాయిపైన తడితే ఒక్కో వైపు నుంచి ఒక్కో రకమైన లోహ శబ్దం రావడం ఇక్కడి శిల్పకళా విశేషం. ఈ అద్భుత శిల లోపల సీతమ్మవారి దివ్య ఆభరణాలు దాగి ఉన్నాయని స్థానికులు విశ్వసిస్తారు.

చాళుక్యుల శాసనాల్లో  'అగ్రహార వ్యాసపురం'

చారిత్రక ఆధారాల ప్రకారం ఆరో శతాబ్దంలో నాందేడ్ రాజధానిగా పాలించిన నందగిరి రాజు 'బిజ్జలుడు' ఈ ఆలయ ప్రాథమిక నిర్మాణాన్ని చేపట్టగా, తర్వాతి కాలంలో పశ్చిమ చాళుక్యులు, రాష్ట్రీకూటులు ఈ క్షేత్రాన్ని విస్తరించి అభివృద్ధి చేశారు. క్రీ.శ. 1147 నాటి చాళుక్యుల శాసనాల్లో ఈ ప్రాంతాన్ని 'అగ్రహార వ్యాసపురం'గా పేర్కొన్నారు. ప్రధాన ఆలయంలో సంక్లిష్టమైన శిల్పకళాడంబరం లేకపోయినప్పటికీ, చుట్టూ అల్లుకున్న అడవి, గోదావరి జలాలు ప్రశాంతమైన ధ్యాన వాతావరణాన్ని అందిస్తాయి. ఆలయ ప్రాంగణానికి తూర్పు దిశలో దత్తాత్రేయ స్వామి పాదుకలతో కూడిన దత్తమందిరం, కొద్ది దూరంలో మహాకాళి ఆలయం, వ్యాసలింగం మరియు వ్యాస భగవానుని విగ్రహంతో కూడిన వ్యాస మందిరం కొలువై ఉన్నాయి.

వసంత పంచమి నుంచి శరన్నవరాత్రుల వరకు ఉత్సవ శోభ

ఈ క్షేత్రంలో ఏటా మాఘశుద్ధ పంచమి రోజున సరస్వతీ దేవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే 'వసంత పంచమి' ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. వసంత పంచమితోపాటు శరన్నవరాత్రులు, వ్యాస పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో ఈ పుణ్యక్షేత్రం భక్తజనసందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.