తెలంగాణ

బాసర ఆలయ పునర్నిర్మాణ పనులు స్పీడప్

గోదావరి పుష్కరాలకల్లా పూర్తి చేయాలని సర్కార్ ప్లాన్ మొదటి విడతలో రూ.225 కోట్లతో అభివృద్ధి

Ramana

బాసర సరస్వతి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణ పనులను ప్రభుత్వం స్పీడప్ చేసింది. వచ్చే ఏడాదిలో జరిగే గోదావరి పుష్కరాలకల్లా పనులు పూర్తి చేయాలన్న ప్రణాళిక మేరకు అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు కొనసాగుతున్నాయి.

తొలగింపు పనులు 90శాతం పూర్తి

సరస్వతి అమ్మవారి ఆలయ మాస్టర్ ప్లానలో భాగంగా కొన్ని పాత నిర్మాణాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధాన ఆలయంతోపాటు ప్రాకార.. అక్షరాభ్యాస మండపాలు, వసతి గృహాల తొలగింపు పనులు 90శాతం పూర్తయ్యాయి. తొలి విడతలో రూ.225 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టగా, ఇప్పటికే ప్రధాన ఆలయ నిర్మాణ పనులు పునాది దశ పూర్తి చేసుకున్నాయి. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రాకారం, నాలుగు గోపురాలు, మాడ వీధులు, క్యూ కాంప్లెక్స్, వీఐపీ వసతి గృహాలు, గోశాల, ఆలయం చుట్టూ 100 అడుగుల రింగ్ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన భక్తుడు సూర్యపనేని సునంద్ తన సొంత ఖర్చులు రూ.30 కోట్లతో చేపట్టిన సరస్వతి, మహంకాళి ఆలయాలతోపాటు వాటికి ఎదురుగా ప్లాన్ చేసిన ఎదురు మండపాల నిర్మాణ పనులు ప్రస్తుతం బేస్‌మెంట్ దశకు చేరుకున్నాయి.

భక్తులకు బాలాలయంలో దర్శనాలు

బాలాలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తూ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని బాసర ఆలయ ఈవో అంజనా దేవి మీడియాకు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్ రాజు ఇప్పటికే రెండుసార్లు పర్యటించి ఆలయ నిర్మాణ పనులపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఆర్ అండ్ బీ అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు.