Beeranguda goshala established by Enugu damodar reddy is providing oxen and cows for free to farmers  
తెలంగాణ

గోవులకు అండగా.. అన్నదాతకు తోడుగా

బీరంగూడ గోశాల ద్వారా 18 ఏళ్లుగా పేద రైతులకు ఎద్దులు, పాడి రైతులకు ఆవులను అందిస్తూ వ్యవసాయానికి తోడ్పాటు అందిస్తున్నారు.

Ranjith

ప్రభాత ఉదయం, పటాన్‌చెరు: శ్రీమహా విష్ణువు ఇష్టపడే సేవ.. గోసేవ. గోవు ఉత్తమమైన జంతువని.. ఆజీవిలోని అణువణువూ పవిత్రమైనదని శాస్ర్తవేత్తలు సైతం పేర్కొంటున్నారు. గోవులు రోడ్లపై తిరగడం చూసి చలించిన ఓ వ్యక్తి చిన్న పూరిగుడిసె వేసి ఐదు ఆవులతో గోశాల ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 1,200పైగా గోవులున్నాయి.

హిందువులు పూజించే గోవులు రోడ్లపై తిరుగుతుండటంతో బీరంగూడకు చెందిన ఏనుగు దామోదర్‌రెడ్డి చిన్న పూరిగుడిసె వేసి గోశాల ప్రారంభించారు. అనంతరం ఆయనతో స్థానికులు, రాజస్థాన్‌కు చెందిన వ్యాపారస్తులు కలిసి కామధేను జీవ రక్షా సమితిని స్థాపించి గోవులను సంరక్షిస్తున్నారు. బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి గోశాల నుంచి ఈ 18 ఏళ్లలో ఎంతోమంది పేద రైతులకు వ్యవసాయం కోసం ఎద్దులను, పాల కోసం ఆవులను అందించి వారి పాలిట కల్పతరువుగా నిలుస్తోంది. ఇక్కడ గోమాత విశిష్టత, ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక ప్రైవేటు పాఠశాల విద్యార్థులను గోశాల సందర్శనకు తీసుకువస్తున్నారు. నగర శివారులోనే అతి పెద్ద గోశాలగా విరాజిల్లుతోంది.

పంచగవ్య చికిత్స

గోవు నుంచి లభించే పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రము, పేడతో వైద్యం అందిస్తున్నారు. పంచగవ్య చికిత్స తో పాటు పంచగవ్య వైద్యులను సైతం సిద్ధం చేస్తున్నారు. గోశాల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ ప్రస్తుతం ఆహార కల్తీలో రోగాలు పెరుగుతున్నాయి. ప్రతీ ఇంటిలో ఓ ఆవును పెంచి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలనే సంకల్పంతో గోశాల నిర్వహిస్తున్నాం.’’ అన్ని అన్నారు.

వ్యవసాయానికి 450 జతల ఎడ్లు

గ్రామీణ ప్రాంత పేద రైతులకు సాగు భూమి ఉన్నప్పటికీ పశుసంపద లేక వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు. వారిని గుర్తించి గోశాల నుంచి వ్యవసాయానికి కావాల్సిన ఎడ్లను అందజేస్తున్నారు. పాడి రైతులకు సైతం ఉచితంగా ఆవులను అందిస్తున్నారు. ఇటీవల పలువురు రైతులకు 450 జతల ఎడ్లను పంపిణీ చేశారు. సుమారు 650 మంది పేదలకు ఆవులను ఇచ్చారు.