Bejjur Illegal Cockfights 
తెలంగాణ

బెజ్జూరు.. కోడిపందేల జోరు

చోద్యం చూస్తున్న పోలీసులు

B. Suresh

ప్రభాత ఉదయం, మంచిర్యాల,ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో కోడి పందేలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అటవీ అధికారుల హెచ్చరికలను నిర్వాహకులు బేఖాతర్ చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా పాపన్నపేట శివారులో కోడి పందేలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. అటవీ ప్రాంతానికి సమీపానే ఈ జూదం కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అప్పులు చేసి..

చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పందెంరాయుళ్లు తరలివస్తున్నట్లు సమాచారం. పందేల పేరుతో భారీగా డబ్బులు చేతులు మారుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అత్యాశతో కొందరు అప్పులు చేసి మరీ పందేల్లో పాల్గొంటుండగా.. మరికొందరు కుటుంబ అవసరాలకు ఉపయోగించాల్సిన సొమ్మును జూదంలో తగలబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిఘా పెడితేనే..

పోలీసుల నిర్లక్ష్యమే కోడి పందేల నిర్వాహకులకు వరంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక నిఘా పెట్టి.. నిర్వాహకులతోపాటు  పందెంరాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జూదానికి అడ్డుకట్ట వేయకపోతే పలు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.