తెలంగాణ

ఏజెన్సీలో వరి కోతల జోరు.. కొనుగోలు కేంద్రాల జాడేది?

చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఇదే అదనుగా దళారులు సిండికేటై రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Phaneendra

ప్రభాత ఉదయం, భద్రాచలం: ఏజెన్సీ ప్రాంతాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నా.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో నవంబర్‌ వచ్చినా ప్రభుత్వ కేంద్రాల జాడ కనిపించడం లేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా స్థానిక దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల అప్పటికి సగానికి పైగా ధాన్యం దళారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సిండికేట్‌గా మారి ధర తగ్గిస్తున్న దళారులు

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ప్రైవేటు వ్యాపారులదే ఇష్టారాజ్యంగా మారిందని రైతులు వాపోతున్నారు. ఇతర ప్రాంతాల మిల్లర్లు రైతుల పొలాల వద్దకే వచ్చి సన్నరకం ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.4 వేల నుంచి రూ.4,500 వరకు కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ రెండు మండలాల్లోకి మిల్లర్లు నేరుగా వచ్చే అవకాశం లేకపోవడంతో స్థానిక దళారులు సిండికేట్‌గా ఏర్పడ్డారని ఆరోపిస్తున్నారు. వారు క్వింటాల్‌కు రూ.3 వేలకే కొనుగోలు చేస్తుండటంతో తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాలిపేరు ఆయకట్టులో కోతలు ముమ్మరం

చర్ల, దుమ్ముగూడెం మండలాల పరిధిలో తాలిపేరు ప్రాజెక్టు ఆయకట్టు కింద సుమారు 25 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. సాగునీటికి ఇబ్బంది లేకపోవడంతో వానాకాలం పంట తుది దశకు చేరుకుంది. దీంతో రెండు మండలాల్లోనూ వరి కోతలు జోరుగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఆయకట్టేతర ప్రాంతాల్లో ఎల్‌నినో ప్రభావంతో పంటలు ఎండిపోయి దిగుబడులు తగ్గిపోయాయి.

తూకంలోనూ మోసాలు.. అధికారుల నిర్లక్ష్యం?

ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,460 కాగా, ప్రైవేటు వ్యాపారులు అంతకంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే సీల్‌ వేసిన కాంటా రాళ్లను ఉపయోగించకుండా పడిగట్టు తూకంతో మోసం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ ఉందనే సాకుతో అదనపు తరుగు తీస్తున్నారని వాపోతున్నారు. దళారుల దోపిడీని అరికట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

ఈ సమస్యపై రైతు సంఘాల నాయకులు స్థానిక రెవెన్యూ అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, తూకంలో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.