ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 
తెలంగాణ

సబ్ ప్లాన్ నిధులు ఖర్చుచేయండి : డిప్యూటీ సీఎం భట్టి

ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి సబ్‌ప్లాన్‌ నిధులను వేగంగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

Phaneendra

 ప్రభాత ఉదయం, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రయోజనం చేకూర్చాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా నిధుల వినియోగంలో వేగం పెంచాలన్నారు. ఎస్సీ, ఎస్టీల ఆవాసాల్లో మౌలిక సదుపాయాలు విస్తరించి, గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. గురువారం సెక్రటేరియెట్​లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్​తో కలిసి ‎ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై శాఖలవారీగా డిప్యూటీ సీఎం భట్టి సమీక్షించారు. వ్యవసాయ, ఇంధన, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల​ అధికారులు పాల్గొన్నారు.  వ్యవసాయం, విద్యుత్‌, గృహ వసతి, సామాజిక, మౌలిక సదుపాయాలు, వైద్య సేవలు వంటి కీలక రంగాల్లో అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. భూమి కలిగిన ఎస్సీ, ఎస్టీ రైతులకు పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలను విశ్లేషించాలని, ప్రత్యేక అభివృద్ధి నిధుల వినియోగంలో ఏర్పడుతున్న వ్యత్యాసాలను గుర్తించాలని పేర్కొన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధులను పూర్తిస్థాయిలో వినియోగించలేని పరిస్థితులు ఉంటే, వాటిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట అర్హులైన ఎస్సీ రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చే ప్రత్యేక పథకాల రూపకల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. పథకాలతో లబ్ధిపొందిన రైతుల పేర్లు, గ్రామాలు, సామాజికవర్గాలు, అందించిన సహాయం తదితర వివరాలతో సమగ్ర జాబితాలను సిద్ధం చేయాలన్నారు. ప్రతి శాఖ తన పరిధిలో పథకాల కింద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎంతమేర ప్రయోజనం అందించిందో స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు. ఈ వివరాలను డిజిటల్‌ విధానంలో నమోదు చేసి, నిధుల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రాధాన్య క్రమంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..

జిల్లా కలెక్టర్ల నుంచి అందిన సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 1,300 ఎకరాల ఖాళీ భూమి అందుబాటులో ఉందని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. అయితే, ఈ భూమిని అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని, ఇప్పటికే గుర్తించిన స్థలాలను అర్హులైన కుటుంబాలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు భట్టి సూచించారు. ఇళ్లులేని అర్హులైన కుటుంబాలకు స్థలాల కొనుగోలు కోసం భూసేకరణకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా పరిశీలించాలన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్య క్రమంలో ప్రతిపాదనలు సిద్ధం చేసి, వివిధ శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ‎ఈ సమావేశంలో ఉన్నతాధికారులు నవీన్ మిట్టల్, సందీప్ కుమార్ సుల్తానియా, సురేంద్రమోహన్, సిక్తా పట్నాయక్, క్రిస్టినా, విజయేంద్ర బోయి, గోపి, గుగులోతు రవి నాయక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.