హైదరాబాద్‌ పోచారంలో ఇన్ఫోసిస్‌ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు 
తెలంగాణ

పోచారంలో ఇన్ఫోసిస్ నూతన క్యాంపస్ ప్రారంభం

హైదరాబాద్‌లోని పోచారం ప్రాంగణంలో రూ.600 కోట్లతో నిర్మించిన ఇన్ఫోసిస్‌ నూతన కార్యాలయ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం ప్రారంభించారు.

Phaneendra

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ప్రపంచ సాంకేతిక రంగంలో హైదరాబాద్‌ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. హైదరాబాద్‌లోని పోచారం ప్రాంగణంలో రూ.600 కోట్లతో నిర్మించిన ఇన్ఫోసిస్‌ నూతన కార్యాలయ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం ప్రారంభించారు. 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం అందుబాటులోకి వచ్చిందని, 10 వేల సీట్ల సామర్థ్యంతో నిర్మించినట్లు శ్రీధర్​ బాబు వివరించారు. సుమారు 450 ఎకరాల్లో విస్తరించిన పోచారం ఇన్ఫోసిస్‌ ప్రాంగణ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.3,200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. కొత్త భవనం కేవలం మౌలిక సదుపాయాల విస్తరణ మాత్రమే కాకుండా, తెలంగాణ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు, ప్రపంచ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర భాగస్వామ్యాన్ని పెంచేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ పెట్టుబడులకు ఆకర్షణగా..

ఇన్ఫోసిస్‌ సంస్థ నేడు 59 దేశాల్లో సేవలందిస్తూ, 3.25 లక్షలకు పైగా ఉద్యోగులతో అంతర్జాతీయ సాంకేతిక సేవలు, కన్సల్టింగ్‌ రంగంలో అగ్రగామిగా ఎదిగిందని శ్రీధర్​ బాబు గుర్తుచేశారు. ఉద్యోగాల కల్పన, ఐటీ ఎగుమతులు, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలకు ఈ సంస్థ దోహదపడుతోందని అన్నారు. ఐటీతో పాటు ఔషధాలు, జీవసాంకేతికత, ఆర్థిక సేవలు, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) రంగాల్లో నగరం సాధిస్తున్న పురోగతి అంతర్జాతీయ పెట్టుబడులకు ఆకర్షణగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్‌ దురిశెట్టి, ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ జయేశ్‌ సంఘరాజ్కా, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్లు సునీల్‌ కుమార్‌ ధారేశ్వర్‌, రాజనీష్‌ మాల్వియా, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నిలాద్రి ప్రసాద్‌ మిశ్రా, డెవలప్‌మెంట్‌ సెంటర్‌ హెడ్‌ ప్రణబ్‌ భరద్వాజ్‌ తదితరులు పాల్గొన్నారు.