ప్రభాత ఉదయం, హైదరాబాద్ : హజ్‌హౌస్ పక్కన అసంపూర్తిగా మిగిలిపోయిన బహుళ అంతస్తుల భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ. 25 కోట్లు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ నుంచి వక్ఫ్ బోర్డుకు రావాల్సిన బకాయిల నుంచి ఈ నిధులను కేటాయించాలని సూచించారు. శుక్రవారం ప్రజాభవన్‌లో మైనార్టీ సంక్షేమశాఖపై మంత్రి అజారుద్దీన్‌తో కలిసి భట్టి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓల్డ్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. మొఘల్‌పురా, బండ్లగూడ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన స్టడీ సర్కిళ్లకు ఉన్న అడ్డంకులను తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. మైనార్టీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం పరిధిని విస్తరిస్తామని.. ఈజిప్ట్, సౌదీ అరేబియాలను చేర్చేందుకు చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. షాదీ ముబారక్ పథకం, ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌కు ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపు, మైనార్టీల రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులు, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ విడుదల తదితర సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, మైనార్టీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, కార్యదర్శి బీ షఫీ ఉల్లా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.