హైదరాబాద్, అక్టోబర్ 12: రాష్ట్రంలో రైతులు చస్తుంటే కాంగ్రెస్ లీడర్లు ఢిల్లీ టూర్లకు వెళ్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం, మంత్రులకు రాష్ట్రంలో ప్రజా సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లి అక్కడ అబద్ధాలను వల్లెవేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నదని ధ్వజమెత్తారు. ఓట్లు మిస్ అయ్యాయంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు. వారి మిత్రులు మజ్లిస్ లీడర్లను కూడా పొన్నం వెంట తెచ్చుకోవచ్చునని పేర్కొన్నారు. ఎన్నికల అధికారి కార్యాలయంలో ప్రతి రికార్డును పరిశీలిద్దామని, నోటీస్ ఇవ్వకుండా.. విచారణ జరుపకుండా ఓటు తీసేశారని నిరూపించకుంటే కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. రాష్ట్రం వికసిత తెలంగాణగా మారాలంటే బీజేపీ సర్కార్ ఇక్కడ రావాలని, ఈ మేరకు తీర్మానించి ప్రధానికి నివేదిస్తామని చెప్పారు.
రేవంత్ తీరు హాస్యాస్పదం
గోవాలో సీఎం రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ను రాముడితో పోల్చుకోవడం హాస్యాస్పదమని రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు. సమాజంలో బీభత్సం సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. వారి ఆటలు సాగవని హెచ్చరించారు. రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్, ఇండియా కూటమి ఈ నాటకాలకు తెరలేపాయని స్పష్టంచేశారు. తెలంగాణలో డ్రగ్స్‌ను కట్టడి చేయలేని సీఎం రేవంత్ గోవాకు వెళ్లి నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎన్ గౌతంరావు, వీరేందర్‌గౌడ్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్చార్జి ఎన్వీ సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అభిషేక్ జిగిని, సురేశ్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.