తెలంగాణ

మానుకోటలో బెల్లం దందా

మహబూబాబాద్ జిల్లాలో నల్ల బెల్లం అక్రమ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఐరన్, రేలింగ్ పనుల నిమిత్తం వచ్చిన రాజస్థాన్, గుజరాత్ వ్యాపారులు ఈ బెల్లం దందాకు తెరలేపారు.

Phaneendra

ప్రభాత ఉదయం, మహబూబాబాద్ : మానుకోటలో నల్ల బెల్లం అక్రమ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. రాజస్థాన్, గుజరాత్​కు చెందిన వ్యాపారులు మహబూబ్​నగర్​ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఐరన్, రేలింగ్​ పనులు చేస్తుంటారు. వీరు తమ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు వచ్చే పాత కార్లను ఈ పనుల కోసం వాడుతుంటారు. ఇలాంటి పనులు చేస్తే గిట్టుబాటు కావడం లేదనుకున్నారో? ఏమో? బెల్లం దందాకు తెరలేపారు. 15 నుంచి 30 వేల విలువ చేసే కార్లలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో గుడుంబా తయారు చేసే వారికి నల్ల బెల్లం సరఫరా చేస్తున్నారు. పోలీసులు, ఎక్సైజ్​ అధికారులు దాడులు చేస్తే కారు వదిలేసి పరారవుతున్నారు. ఇలా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కార్లు పట్టుబడ్డాయి. అయితే నల్ల బెల్లం ఎక్కడి నుంచి వస్తోంది? ఎవరు తీసుకొస్తున్నారు? అనే విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్​, గుజరాత్​ వ్యాపారులు ప్లైవుడ్, ఎలక్ట్రికల్, ఇతర దుకాణాలు ఏర్పాటు చేసి నాసిరకం వస్తువులు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

దృష్టి పెట్టని అధికారులు

జిల్లావ్యాప్తంగా ఇక్కడి వ్యాపారులతో నల్లబెల్లం వ్యాపారం చేస్తూ.. అక్రమ సంపాదనకు ఎగబడిన రాజస్థాన్​, గుజరాత్​ వ్యాపారుల దందాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు  చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. నల్ల బెల్లం రవాణా చేస్తూ కార్లు పట్టుబడితే.. లోతుగా విచారణ చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా బెల్లం దందాపై అధికారులు దృష్టి పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లాలో గుడుంబా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.