బోథ్, ప్రభాత ఉదయం: బోథ్ నియోజకవర్గాన్ని ఈసారి వేసవి కంటే ముందే తాగునీటి కష్టాలు వెంటాడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగస్టులో బోథ్ పరిసర ప్రాంతాల్లో సాధారణంతో పోలిస్తే వర్షపాతం గణనీయంగా తగ్గింది. గతేడాది సాధారణం కంటే అధిక వర్షాలు కురిసినా.. వేసవిలో బోర్లు ఎండిపోయి నీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈసారి వర్షపాతం లోటు నేపథ్యంలో రానున్న రోజుల్లో నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి అవసరాలకు బోర్లు, బావులు, చిన్నచిన్న నీటి వనరులే ప్రధాన ఆధారం. వర్షాలు తగ్గడంతో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగకపోతే.. ఈ వనరులపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.
నీటి వనరులను గుర్తించాలి
బోర్లు, బావులు, చెరువుల్లో నీటి లభ్యత తగ్గితే ట్యాంకర్లను నింపేందుకు దూర ప్రాంతాలపై ఆధారపడాల్సి రావచ్చు. ముఖ్యంగా మారుమూల ఏజెన్సీ గ్రామాలకు నీటిని తరలించాల్సి వస్తే రవాణా దూరం, సమయం, వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంది. నీటి ఎద్దడి ఏర్పడిన తర్వాత ట్యాంకర్లను ఏర్పాటు చేయడం ఒక్కటే పరిష్కారం కాదని సామాజిక కార్యకర్త సాబ్లె సంతోష్ పేర్కొన్నారు. ట్యాంకర్లకు అవసరమైన నీటిని ఎక్కడి నుంచి సమకూర్చాలనే అంశంపై కూడా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. అధికారుల ముందస్తు ప్రణాళిక లోపమే ఇలాంటి ఇబ్బందులకు కారణమవుతోందని ఆయన విమర్శించారు. వేసవిలో పరిస్థితి మరింత దిగజారకుండా ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించి, అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
ఒకే బోర్.. 50 కుటుంబాలకు ఆధారం
ఇచ్చోడ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో ఓ ప్రైవేటు ఇంటి వద్ద ఉన్న బోరే దాదాపు 50 కుటుంబాలకు ప్రధాన తాగునీటి ఆధారంగా మారింది. ఆ బోరు నుంచి పైప్లైన్లు ఏర్పాటు చేసుకుని కాలనీవాసులు నీటిని వినియోగించుకుంటున్నారు. ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాల లభ్యత తగ్గితే.. ఇన్ని కుటుంబాలకు తాగునీరు ఎలా అందించాలన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ తాగునీటి వనరులు అందుబాటులో లేకపోవడంతో ఓ ప్రైవేటు ఇంటి బోరుపైనే ఇన్ని కుటుంబాలు ఆధారపడాల్సి రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ ఏడాది వర్షపాతం లోటుతో గతంతో పోలిస్తే రెండు నెలల ముందుగానే నీటి సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
టీచర్స్ కాలనీవాసుడు చౌహాన్ గోపాల్ మాట్లాడుతూ.. ‘‘ఇచ్చోడ మండల పరిధిలోని టీచర్స్ కాలనీలో ఒక ప్రైవేటు ఇంటి బోరే దాదాపు 50 కుటుంబాల దాహం తీరుస్తోంది. ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదవడంతో నీటి సమస్య రెండు నెలల ముందుగానే మొదలవుతుందేమోనన్న భయం కలుగుతోంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏజెన్సీ గ్రామాలపైనే ఎక్కువ ప్రభావం
బోథ్ నియోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య ఈసారి మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం కనిపిస్తోంది. అనేక గ్రామాలకు బోర్లు, బావులు, చిన్నచిన్న నీటి వనరులే ప్రధాన ఆధారం. వర్షపాతం తగ్గి భూగర్భ జలమట్టాలు పడిపోతే.. తొలుత ప్రభావం పడేది ఈ ప్రాంతాలపైనే. ఇప్పటికే వేసవిలో నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు పలుచోట్ల కనిపిస్తుండగా.. ఈసారి నీటి వనరులు ముందుగానే అడుగంటితే కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు నీటి కోసం దూరం వెళ్లాల్సిన దుస్థితి తలెత్తకుండా ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటి నుంచే అప్రమత్తమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. నీటి ఎద్దడి ముదిరిన తర్వాత హడావుడి చర్యలు చేపట్టడం కంటే ముందస్తు ప్రణాళికతో సమస్యను ఎదుర్కోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మారుమూల గిరిజన గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఏజెన్సీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.