ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ నిర్వహించనున్న ‘రైతు గర్జన’ బహిరంగ సభ 
తెలంగాణ

ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ రైతు గర్జన..!

ఆదిలాబాద్‌లో ఆదివారం బీఆర్ఎస్ రైతు గర్జన బహిరంగ సభ నిర్వహించనుంది. కేటీఆర్ అతిథిగా హాజరుకానుండగా, రైతుల సమస్యలపై పోరాటంతో పాటు భారీ చేరికలకు పార్టీ సిద్ధమైంది.

Phaneendra

ప్రభాత ఉదయం, ఆదిలాబాద్ : రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్ ) ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన ఎజెండాగా పోరాటానికి శ్రీకారం చుట్టబోతోంది. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో నిర్వహించే ‘రైతు గర్జన’ బహిరంగ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు జనసమీకరణకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో గులాబీ పార్టీ బలాన్ని చాటేలా సభా నిర్వహణకు పార్టీ నాయకత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఇంద్రవెల్లిలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత పాంచజన్య సంకల్ప సభ నిర్వహించి అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం నాటి సభలో కవిత వ్యాఖ్యలపైనే కాకుండా కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు సంధించే అవకాశం కనిపిస్తోంది.

రైతు సమస్యలే ఎజెండాగా..

రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఫోకస్ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ప్రస్తుతం కరువు పరిస్థితులు తలెత్తడంతో యాసంగిలో వరి పంటలు వేయకూడని ప్రభుత్వం చెబుతోంది.  రైతులకు ఈ పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్సే అని ఇప్పటికే బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఈ సభ ద్వారా రైతుల సమస్యలపై రాష్ట్ర స్థాయిలో పోరుబాట పట్టేందుకు ఆ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారీ చేరికలతో పార్టీకి కొత్త బలం

గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత జిల్లాలో కొందరు నాయకులు గులాబీ గూటిని వీడి అధికార పార్టీలో చేరారు. దీంతో పార్టీ కొంత బలహీనపడినట్లయ్యింది. ఆదిలాబాద్ సభను భారీ స్థాయిలో నిర్వహించి మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా ముఖ్య నాయకులు పట్టుదలతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు భార్గవ్ దేశ్ పాండే కేటీఆర్ సమక్షంలో చేరగా, నేటి సభలో ఆయన అనుచరులతో పాటు పలువురు పెద్ద సంఖ్యలో కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సభ ద్వారా పార్టీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందన్న సంకేతాలు ఇచ్చేందుకు బీఆర్ఎన్ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఈ సభను సక్సెస్ చేసేందుకు మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎంపీ బాల్క సుమన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, భార్గవ్ దేశ్ పాండే ప్రత్యేక దృష్టి సారించారు. పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేశారు. ఇప్పటికే పట్టణంలోని ప్రధాన కూడళ్లు గులాబీమయంగా మారాయి.