ప్రభాత ఉదయం, ఆదిలాబాద్ ప్రతినిధి:
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పూర్వ వైభవం సాధించేందుకు సిద్ధమవుతోందా? ప్రత్యర్థి పార్టీలకు దీటుగా రాజకీయ సమరానికి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం వెనుక వ్యూహమేంటి? వరుస పర్యటనలు.. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను గులాబీ పార్టీలోకి తీసుకోవడం.. రైతు గర్జన సభలతో బలప్రదర్శన.. ఇలా ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడిని పెంచడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తర తెలంగాణపై ఫోకస్ పెట్టిన కేటీఆర్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను రాజకీయ కార్యాచరణకు కేంద్రంగా ఎంచుకున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల ఆదిలాబాద్‌లో నిర్వహించిన రైతు గర్జన సభకు యువత భారీగా తరలిరావడం, సభ విజయవంతం కావడంతో కేటీఆర్ మరింత దూకుడు పెంచినట్లు పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిదింటిని కైవసం చేసుకున్న బీఆర్ఎస్.. తిరిగి పట్టు సాధించేందుకు పావులు కదుపుతుండటం చర్చనీయాంశంగా మారింది.
యువత రాకతో కొత్త ఉత్సహం
ఆదిలాబాద్‌లో నిర్వహించిన రైతు గర్జన సభ బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సభకు యువత భారీ సంఖ్యలో తరలిరావటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చాలాకాలంగా రాజకీయ సభలకు దూరంగా ఉంటున్న యువతలోనూ కదలిక కనిపించిందని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. సభలకే పరిమితం కాకుండా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో చక్రం తిప్పిన కాంగ్రెస్ నేత భార్గవ్ దేశ్‌పాండేను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. డీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన దేశ్‌పాండే.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నప్పటికీ, అధిష్ఠానం ఆయనను పక్కన పెట్టి కంది శ్రీనివాస్‌రెడ్డికి అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న దేశ్‌పాండే.. తాజాగా తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు.
నిర్మల్‌లోనూ చేరికల జోరు..
ఆదిలాబాద్‌తో పాటు నిర్మల్‌పైనా బీఆర్ఎస్ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నల్లా వినయ్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. 2023 ఎన్నికల అనంతరం మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పార్టీని వీడటంతో నిర్మల్‌లో బీఆర్ఎస్ రాజకీయంగా బలహీనపడిందనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఆయన చేరికతో జిల్లాలో పార్టీకి కొత్త ఊపు వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. నిర్మల్‌లో తిరిగి పట్టు సాధించేందుకు వినయ్‌రెడ్డి చేరిక దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ సభతో జోష్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఈ నెల 11న నిర్మల్‌లో రైతు గర్జన సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేటీఆర్.. నిర్వహణ బాధ్యతలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జాన్సన్ నాయక్, నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రామ్‌కిషన్ రెడ్డికి అప్పగించారు. రైతు సమస్యలను ప్రస్తావించడంతో పాటు ప్రభుత్వాన్ని నిలదీయడమే బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. నిర్మల్ సభ అనంతరం నిజామాబాద్‌లోనూ కేటీఆర్ సభ నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. డిసెంబర్‌లో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కేటీఆర్ పర్యటనలు, బహిరంగ సభలకు నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పూర్వ వైభవం దిశగా అడుగులు
గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు తొమ్మిదింటిలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో మాత్రం బోథ్, ఆసిఫాబాద్ స్థానాలకే పరిమితమయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాల్లో పట్టు సాధించేందుకు కేటీఆర్ అడుగులు వేస్తున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో అధికారం కోల్పోయాక పలువురు కీలక నేతలు పార్టీని వీడటం, కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య విభేదాలు, కేడర్‌లో నెలకొన్న నైరాశ్యం బీఆర్ఎస్‌కు సవాళ్లుగా మారాయి. ఈ క్రమంలో పార్టీలో కొత్తగా చేరుతున్న నాయకులకు, ఇప్పటికే పార్టీలో ఉన్న నేతల నుంచి సహకారం లభిస్తుందా? అంతర్గత విభేదాలకు నాయకత్వం ఎలా అడ్డుకట్ట వేస్తుంది? అనేది పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.